ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారుల మధ్య జరిగిన హింసలో ఇప్పటివరకు 151 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు తమ తమ క్లాసులకు తిరిగి హాజరుకావాలని ఆదేశించింది.
దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులు రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌పై బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు ఆదివారం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఈ మేరకు విద్యార్థులంతా వెంటనే ఆందోళనలు ముగించి తిరిగి తమ తరగతులకు హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జూలై 13 వ తేదీన మొదలైన రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు దేశవ్యాప్తంగా హింసాత్మంకంగా మారాయి. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్‌నెట్‌పై నిషేధం విధించింది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఆదివారం, సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించింది.
మరోవైపు.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కఠిన చర్యలు మొదలు పెట్టింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఇప్పటికే దేశవ్యాప్త కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం తాజాగా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసింది.
1000 మందిదాకా పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దుదాటి భారత్‌లో ప్రవేశించినట్లు సమాచారం. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రధాని షేక్‌హసీనా తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment