ప్రైవేటు జపం ప్రారంభించిన చంద్రబాబు
ఆయిల్‌ఫెడ్, పులివెందుల స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ ప్రైవేటుకు!
పి–4 మోడ్‌లో తాబేదార్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం
లాభాల్లో ఉన్న ఆయిల్‌ఫెడ్‌పై పలు సంస్థల కన్ను
యూనిట్ ఆధునికీకరణకు నిధుల్లేవని సాకు.. అంధకారంలో 2.5 లక్షల మంది రైతుల భవిష్యత్తు
నిర్వహణ భారం పేరుతో పులివెందుల లేబొరేటరీ ప్రైవేటీకరణ
రూ.11 కోట్లతో దేశంలోనే అతి పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
పాలు, పాల ఉత్పత్తులు, ఆహారాల్లో విష పదార్థాలు, కల్తీ గుర్తింపు
బాబు ‘ప్రైవేటు’ నిర్ణయంపై మండిపడుతున్న రైతులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందంటే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు పండగే. ప్రభుత్వమంటే ప్రజలకు సేవ చేయాలన్న ప్రాథమిక సూత్రం బాబు దగ్గర పనిచేయదు. నిరంతరం ప్రైవేటు సేవలో తరించడమే ఆయన ప్రభుత్వ ప్రత్యేకత. ప్రభుత్వ రంగంలో మంచి స్థితిలో ఉన్న సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రకరకాల సాకులతో అనుకున్న వారికి కట్టబెట్టేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజిన ఆంధ్రప్రదేశ్‌కు గతంలో సీఎంగా ఉండగా కూడా చంద్రబాబు చేసిందిదే.
ఇప్పుడూ అదే పనిలో నిమగ్నమయ్యారు. లాభాల్లో నడుస్తున్న ఏపీ కో–ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీ ఆయిల్‌ఫెడ్)ను, దేశంలోనే అతి పెద్దదైన పులివెందులలో స్టేట్ సెంట్రల్ లేబోరేటరీని ప్రైవేటీకరణ పేరుతో తాబేదార్లకు కారుచౌకగా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండూ రాష్ట్రంలో రైతులు, పాడి పరిశ్రమకు సేవలందిస్తున్నవే కావడం గమనార్హం.
పొరుగున ఉన్న తెలంగాణలో రెండు ఆయిల్‌ఫెడ్ యూనిట్ల ఉండగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త యూనిట్ ఏర్పాటు చేస్తుండగా.. ఏపీ ప్రభుత్వం ఉన్న ఒకే ఒక్క యూనిట్‌ను ప్రైవేటుపరం చేస్తోంది. ఏదైనా ప్రభుత్వ సంస్థను ఎంత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని, వాటి విస్తరణ ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడంలేదని రైతులు, పాడి పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నాయి.
నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర
ఏపీ ఆయిల్‌ఫెడ్ 1980లో ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద ఏర్పాటైంది. దీనికి అనుబంధంగా పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో 1992లో ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ 2019–23 మధ్య రికార్డు స్థాయిలో 1.25 లక్షల టన్నుల పామాయిల్‌ను ప్రాసెస్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఎఫ్‌ఎఫ్‌బీ (తాజా గెలల) ప్రాసెసింగ్ ద్వారా టన్నుకు రూ.3,500 చొప్పున లాభాలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం రూ.168 కోట్ల లాభాల్లో ఉంది. దీని ద్వారా 2.50 లక్షల మంది ఆయిల్‌పామ్ రైతులు ప్రయోజనం పొందుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాలో రూ.230 కోట్లతో అత్యాధునిక ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైనరీ ఏర్పాటుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆయిల్‌ఫెడ్‌పై ప్రైవేటు సంస్థల కన్ను పడింది. ఈ ప్లాంట్‌ను చేజిక్కించుకుందుకు త్రిబుల్ ఎఫ్, గోద్రెజ్ కంపెనీలు ఉత్సాహం చూపిస్తుండగా.. టీడీపీకి చెందిన బడా పారిశ్రామికవేత్తలు సైతం చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూనిట్ ఆధునికీకరణకు నిధులు లేవనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం దీనిని వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ప్లాంట్ ఆధునికీకరణ, కొత్త యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, దీనికి జాతీయ పామాయిల్ మిషన్ ద్వారా నిధులు సాధించుకోవచ్చని రైతు సంఘాల నేతలు సూచిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్‌షిప్ (పీ4) పద్ధతిలో ఈ యూనిట్‌ను ప్రైవేటుకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఇక తమ చేతుల్లో ఏమీ లేదని వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టంగా చెప్పేయడంతో రైతులు, ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఇప్పటికే ఆయిల్‌ఫెడ్ పరిధిలోని కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని ఆయిల్‌పామ్ రైతులు మండలాలు, గ్రామాల వారీగా సమావేశమై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు. ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ప్రైవేటుపరం చేస్తే తమ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ భారం పేరుతో స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ ప్రైవేటీకరణ!
పులివెందులలోని ప్రతిష్టాత్మకమైన ఏపీ స్టేట్ సెంట్రల్ లేబొరేటరీ నిర్వహణ భారమైందన్న పేరుతో (పీ–4) మోడ్‌లో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ ల్యాబ్‌లో పాలు, పాల ఉత్పతుల్లో విషపూరిత రసాయనాలు, ఆహార పదార్థాలు, మంచి నీరు, మాంసం, గుడ్లు, రొయ్యలు, ఎరువులు, మందుల్లో కల్తీని గుర్తిస్తారు. గతంలో వీటి పరీక్షలకు శాంపిల్స్‌ను కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ల్యాబ్‌లకు పంపాల్సి వచ్చేది.
దూరాభారం కావడంతో ఒక్కో శాంపిల్‌కు రూ.2,500 నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యేది. దీంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక లేబొరేటరీని నిర్మించాలని సంకల్పించింది. పులివెందులలోని ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఆన్ లైవ్‌స్టాక్ (ఏపీ కార్ల్) ప్రాంగణంలో రూ.11 కోట్లతో స్టేట్ సెంట్రల్ లేబొరేటరీని నిర్మించింది. గతేడాది నవంబర్‌లో దీనిని ప్రారంభించారు.
రూ.8 కోట్లతో అత్యాధునిక పరికరాలు
దేశ, విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాలను ఈ ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మిల్క్ ఎనలైజర్, బ్యాక్టీరియా, సోమాటిక్ సెల్ ఎనలైజర్, ఎఫ్‌టీఐఆర్ సాంకేతికత ఆధారిత పాల విశ్లేషణ పరికరం, ట్రిపుల్ ట్యాడ్రపుల్ మాస్ డిటెక్టర్‌తో ఎస్‌సీఎంఎస్, ఎఫ్‌ఐడీతో జీసీ ఎంఎస్, సోడియం పొటాషియం ఎనలైజర్, మెలమైన్ టెస్టింగ్ స్ట్రిప్, మఫిల్ ఫర్నేస్, ఆటో క్లాప్, డబుల్ డిస్టిలేషన్ యూనిట్, గెర్బర్ సెంట్రిప్యూజ్, కల్తీ పరీక్షల కిట్ వంటి అత్యాధునిక పరికరాలున్నాయి. వీటి కోసమే రూ.8 కోట్లు ఖర్చు చేశారు.
వీటి ద్వారా వందకుపైగా పరీక్షలు చేసేందుకు నిష్ణాతులైన 15 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 8 మంది శాస్త్రవేత్తలతో పాటు జూనియర్, సీనియర్ ఎనలిస్ట్‌లు ఉన్నారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్‌ఎబీఎల్) ధృవీకరణ కోసం దరఖాస్తు కూడా చేశారు. ఇంత అత్యాధునిక లేబొరేటరీని ప్రైవేటు సంస్థల పరం చేయడం పట్ల పాడి పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ల్యాబ్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే శాంపిల్స్ పరీక్షలకు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తారని, ఇది తమకు భారంగా మారుతుందని పాడి రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ఆయిల్‌ఫెడ్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
ఆయిల్‌ఫెడ్ ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్తే ఆయిల్‌పామ్ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఓఈఆర్ ధరలో రైతులకు న్యాయం జరగదు. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటాం. సుదీర్ఘ చరిత్ర కల్గిన ఆయిల్‌ఫెడ్‌ను ప్రైవేటీకరించాలన్న ఆలోచన విరమించుకొని, బలోపేతం చేయాలి. – అనుమోలు గాంధీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, భారతీయ కిసాన్ సంఘ్
అమ్మేసుకోవడం సరికాదు
ఆయిల్‌ఫెడ్‌ను ప్రైవేటీకరిస్తే 2.5 లక్షల మంది రైతులు భవిష్యత్తు అంధకారమవుతుంది. లాభాల్లో ఉన్న ఈ యూనిట్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలి. భవిష్యత్ అవసరాల మేరకు కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలి. అంతేకానీ ఉన్న యూనిట్‌ను అమ్మేసుకోవడం సరికాదు. – కె.క్రాంత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్ రైతుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment