
వర్మకు మోకాలడ్డింది పవనేనని జోరుగా ప్రచారం
ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అన్యాయం
తనకు ప్రొటోకాల్ ఇబ్బందులు వస్తాయని బాబుకు చెప్పినట్లు వార్తలు
రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయనీ ఆందోళన
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు
రెండు చోట్ల ఓడిన పవన్‌ను గెలిపించిన వ్యక్తిని అవమానించారని ఆందోళన
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసిన పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.
అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం.
సీటు త్యాగం చేసిన వ్యక్తికి వెన్నుపోటా!
ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో అధినేత ఓడిపోవడం అప్పట్లో జనసేన వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి.
పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని పలు సభల్లో చెప్పి బాధపడేవారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ ఆయనను ఓటమి భయం వెంటాడింది. అందుకే చివరి వరకూ ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోయారు. రకరకాల సమీకరణాల తర్వాత పిఠాపురం అయితే బాగుంటుందని పొత్తులో ఆ సీటును తీసుకున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మొదట దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. టీడీపీ సీటును జనసేనకు ఎలా ఇస్తారని భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి.
టీడీపీ తరఫున ఆ సీటు దాదాపు ఖరారైన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ అయితే రాజీనామాకు సైతం సిద్ధపడ్డారు. కానీ, చంద్రబాబు పలుమార్లు బుజ్జగించడంతో శాంతించి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయనను ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతోనే ఆయన పవన్ కోసం తన సీటు త్యాగం చేశారు. పిఠాపురం టీడీపీ శ్రేణుల్ని బ్రతిమిలాడి ఆయన పవన్ కోసం పని చేయించారు.
పవన్ అసెంబ్లీకి వెళ్లడంలో వర్మది కీలక పాత్ర
పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు.
ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment