MLC seat
-
బీసీలపై బాబు కపట ప్రేమ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా బీసీ మహిళా నేత పంచుమర్తి అనూరాధను పోటీకి దించి చంద్రబాబు మరోసారి తన మార్కు రాజకీయానికి తెరలేపారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు మొండిచేయి చూపించి.. ఇప్పుడు గెలవలేని సీటు ఇచ్చి ఆమెను బలి చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలంతో వాటిన్నింటినీ చేజిక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలంటే కనీసం 22 మంది ఎమ్మెల్యేలు అవసరం. టీడీపీ నుంచి గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలైనా, అందులో నలుగురు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మిగిలింది 19 మంది మాత్రమే. వారి ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలవడం అసాధ్యం అని అందరికీ తెలుసు. అలాంటి ఎన్నికల్లో బీసీ మహిళను నిలబెట్టడం అంటే ఆ వర్గాన్ని అవమానించడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, అనూరాధ ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలని పలుమార్లు కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓడిపోయే సీటును మాత్రం బీసీల కోటాలో ఆమెకు ఇవ్వడంపై టీడీపీలోనే అసహనం వ్యక్తమవుతోంది. మొదటి నుంచీ ఇదే తీరు ♦ అధికారంలో ఉన్నప్పుడు సొంత వర్గానికి మాత్రమే పదవులు కట్టబెట్టిన చంద్రబాబు.. అప్పట్లో బీసీలు, దళిత నేతలను చాలా అవమానాలకు గురిచేశారు. 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుతం అనూరాధకు ఎమ్మెల్సీ సీటు కేటాయించినట్టే, పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు కేటాయించారు. ఆ ఎన్నికల్లోనూ రాష్ట్రానికి వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాల్లో సంఖ్యా బలం రీత్యా వైఎస్సార్సీపీ గెలవడం లాంఛనమేనని తెలిసినా చంద్రబాబు దళిత నేతను పోటీకి దింపి ఆ వర్గాన్ని బలి చేశారు. ♦2014 నుంచి ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజిక వర్గం వారికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి.. దళితులు, బీసీ నాయకుల్ని మాత్రం పట్టించుకోలేదు. ♦2014, 2016, 2018లో ఏడుగురిని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబుకు బీసీలు, దళితులు గుర్తుకు రాలేదు. అప్పుడు తన సొంత సామాజికవర్గ నేతలు, తన కోటరీకి చెందిన వారు, సన్నిహితులకు అవకాశం ఇచ్చారు. ♦గరికపాటి మోహనరావు, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి నేతలను రాజ్యసభకు పంపారు. మిగిలిన సీట్లలోనూ సామాజిక సమీకరణలు, పార్టీ అవసరాల పేరుతో టీజీ వెంకటేష్, తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్, సురేష్ ప్రభు వంటి నేతలకు ఇచ్చారు. ♦2016లో దళిత నేత జేఆర్ పుష్పరాజ్‌కు సీటిస్తానని తన ఇంటికి పిలిపించుకుని ఒక రోజంతా కూర్చోబెట్టి, ఆ తర్వాత లేదని చెప్పి అవమానించి పంపారు. 2018లో దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి అంతా సిద్ధమయ్యాక చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఆ సీటు ఇచ్చారు. ♦ఇప్పుడు అధికారం కోల్పోయి, ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేని స్థితిలో ఓడిపోతామని తెలిసి కూడా ఆ సీటులో బీసీ మహిళను నిలబెట్టడం ద్వారా చంద్రబాబు మరోసారి బలహీన వర్గాలను మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ స్థానాల్లో తన కుమారుడు లోకేశ్, ఇతర ముఖ్య నాయకులను ఎందుకు నిలబెట్టలేదనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. -
BRS Party: ఎమ్మెల్సీ చాన్స్ ఎవరికి? నేరుగా కేసీఆర్, కేటీఆర్‌తోనే..
సాక్షి, నల్గొండ/యాదాద్రి భువనగిరి: ఎమ్మెల్సీ పదవి కోసం జిల్లా బీఆర్ఎస్లో కోలాహలం మొదలైంది. శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అధినేత కేసీఆర్ ఇప్పటికే పలువురికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికే ఇస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఎవరి ప్రయత్నాల్లో వారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు ఎలిమినేటి కృష్ణారెడ్డికి ఆరేళ్ల క్రితం శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కిన విషయం తెలిసిందే. వచ్చేనెల ఆయన పదవీకాలం ముగియనుండడంతో ఆశావహులు ఆ సీటుపై కన్నేశారు. ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ద్వారా కొందరు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు నేరుగా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వేడుకుంటున్నారు. తమకే వస్తుందన్న ధీమా అధినేత కేసీఆర్ వివిధ ఎన్నికల సందర్భంగా పార్టీలోని పలువురు ముఖ్య నేతలకు పదవుల విషయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. దీంతో వారు ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీలో చేరారు. ఈ భర్తీని పూడ్చేందుకు బీజేపీలో ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను పార్టీ పెద్దలు రాత్రికిరాత్రి ఒప్పించి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పారు. అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న భిక్షమయ్య ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో టికెట్ అవకాశం కోసం బీజేపీ గూటికి చేరారు. అయితే మార్చిలో రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎక్కడో ఒక చోట నుంచి అవకాశం కల్పిస్తానని భిక్షమయ్యగౌడ్‌కు అధినేత కేసీఆర్ మాటివ్వడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సామాజిక వర్గ సమీకరణల్లో భాగంగా పార్టీ అవసరాల దృష్ట్యా భిక్షమయ్యగౌడ్‌కు అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది. మరికొందరు ఇక జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాయమైందన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డికి ఆ పదవి దక్కింది. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని, అప్పట్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చింతల వర్గీయులు చెబుతున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు సమసిపోవడానికి ఒక ప్రయత్నంగా అధిష్టానం ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తనకు మరోమారు అవకాశం కల్పించాలని మనసులో ఉన్న మాటను తన వర్గీయులతో అన్నట్లు తెలుస్తోంది. అయితే తనకంటే కూడా తన కుమారుడు వివేక్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ, సంస్థాన్‌నారాయణపురానికి చెందిన కర్నె ప్రభాకర్, శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సామాజిక సమీకరణలపై లెక్కలు ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలు సామాజిక వర్గ సమీకరణలపైనా లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్ర యూనిట్‌గా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధినేత ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గ సమీకరణలు బలంగా పని చేయనున్నాయి. మార్చిలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన స్థానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బలమైన సామాజిక వర్గానికి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బీసీ గౌడ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం లేనందున ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది. -
గుత్తా పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ఖరారు అయింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం ఉదయం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ పత్రాల దాఖలులో గుత్తాకు సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. గుత్తా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటనతో నల్లగొండ జిల్లాకు మరో ఎమ్మెల్సీ పదవి వరించినట్లు అయింది. ఇప్పటికే జిల్లా నుంచి నేతి విద్యాసాగర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ప్రస్తుతం ఆయన శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ తేరా చిన్నపరెడ్డి విజయం సాధిం చారు. అంతకుముందు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా, ఆయన మండలిలో ప్రభుత్వ విప్ పదవిలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఒక స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం లాంఛనమేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి.. టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నుంచి.. టీఆర్ఎస్లోకి నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్‌నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం లో టీఆర్ఎస్ గూటికి చేరారు. 2014 సార్వత్రిక ఎ న్నికల్లో, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తొలి ఎన్నికల్లో పదిహేడు ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించగా.. అందులో నల్లగొండ ఒకటి. టీఆర్ఎస్ గాలిని తట్టుకుని కాంగ్రెస్‌నుంచి విజయం సాధించిన ఆయన రాజకీయ పునరేకీకరణ పేర టీఆర్ఎస్ చేపట్టి ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గులాబీ పార్టీకి చేరువయ్యారు. ఆయన తనతోపాటు మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండిన ఎన్.భాస్కర్‌రావు, సీపీఐ నుంచి దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రకుమార్లను కూడా టీఆర్ఎస్లోకి తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించిన గుత్తాకు చివరి వరకూ ఆ అవకాశమే దక్కలేదు. కానీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి మాత్రం దక్కింది. గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కానీ, ఆయన ఎక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నించలేదు. ఎమ్మెల్సీ పదవిపైనే ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఖాళీ కావడం, నోటిఫికేషన్ కూడా వెలువడడంతో పాటు గుత్తా పేరు ఖరారు కావడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. -
ముఖ్యమంత్రితో మనస్పర్థలు నిజమే
పావగడ (తుమకూరు): తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, తన సోదరుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో మనస్పర్థలు వచ్చిన మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆయన నిన్న కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడలో శనీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ తనకు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ (ఏపీఐడీ) బోర్డు చైర్మన్ పదవి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని, అందువల్లే టీడీపీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. -
సీమలో బీసీలకు ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదు
నా తమ్ముడికి సమాధానం చెప్పలేకపోతున్నా: కేఈ సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీగా రాయలసీమ లో ఒక్క బీసీ నాయకుడికీ టీడీపీ అవకాశం ఇవ్వలేదని ఆ పార్టీ నేత, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. తన సోదరుడు కేఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వలే దని, దీనిపై తాను అతనికి సర్దిచెప్పలేక పోతున్నానని తెలిపారు. మంగళవారం వెలగపూడి అసెంబ్లీలోని తన కార్యాలయంలో కేఈ విలేకరులతో మాట్లాడారు. పరోక్షంగా అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రస్తావిస్తూ వారికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు తమకు ఒక ఎమ్మెల్సీ ఎందుకివ్వరని ప్రభాకర్ వాదిస్తు న్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో ఐదుగురు రెడ్టిలకు, ఎమ్మెల్యేల కోటాలో ఇద్దరు కమ్మవారికి ఎమ్మెల్సీ సీట్లిచ్చారని, సీమలో ఓ బీసీకి అవ కాశముంటుందని అను కున్నా అది జరగలేదన్నారు. కర్నూలు ఎంపీ సీటు తమ కుటుంబానికి ఇస్తేనే గెలుస్తామ న్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ సీటును బీసీలకే ఇచ్చిందని గుర్తు చేశారు. సీఎం మూడ్ బాగోలేదు..! కర్నూలు రాజధానిగా ఉండగా అసెంబ్లీ జరి గినప్పుడు మంత్రివర్గంలో ఎవరున్నారు, తదితర వివరాలతో నోట్ సీఎంకిచ్చినా పట్టించుకోలేదని కేఈ తెలిపారు. సుప్రీం కోర్టు ఓటుకు కోట్లు కేసును విచారణకు స్వీక రించడంతో సీఎం మూడ్ బాగోలేదన్నారు. -
ఉందామా..పోదామా!
♦ ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందుకు ఫరూక్ అసంతృప్తి ♦ టీడీపీని వీడాలని అనుచరుల ఒత్తిడి ♦ త్వరలో కార్యకర్తల సమావేశం నంద్యాల: ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందున టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అసంతృప్తికి గురయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న తనను పట్టించుకోకుండా.. జూనియర్లకు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తూ.. తనను పార్టీ అధిష్టానం అవమానించిందని ఆయన ఆవేదన చెందారు. సోమవారం స్థానిక రాజ్ థియేటర్లోని తన కార్యాలయంలో పార్టీ నాయకుల వద్ద తన బాధను వ్యక్త పరిచారు. దీంతో పలువురు టీడీపీ నాయకులు భావోద్వేగానికి గురై.. పార్టీని వీడాలని సూచించారు. ఈ విషయమై త్వరలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కుమారుడు ఎన్ఎండీ ఫిరోజ్ భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీలో మైనార్టీ నేతగా ఉన్న ఫరూక్ గతంలో రెండుసార్లు మంత్రిగా, శాసన సభ ఉపసభాపతిగా పని చేశారు. రాజకీయంగా ఆయనకు 2004 నుంచి తిరోగమనం మొదలైంది. శాసన సభకు 2004లో, పార్లమెంట్ స్థానానికి 2009, 2014లో పోటీ చేసి ఓడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో మైనార్టీ ఎమ్మెల్యే ఎవరూ లేకపోవడంతో సీనియర్ నేత ఫరూక్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి రావచ్చునని ప్రచారం జరిగింది. అయితే చివరకు నిరాశే ఎదురైంది. కొరవడిన సహకారం.. ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలని ఫరూక్ తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీలో తానే సీనియర్ మైనార్టీ నేతనని, తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి కోరారు. తర్వాత పార్టీలో సమకాలీకులైన పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రి యనమల రామకృష్ణుడులను కలిసి సహకారాన్ని కోరారు. కాని సీఎం చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపారు. -
టీడీపీలో చేరి తప్పుచేశాను : ఆనం
► ఆనంకు చేదు అనుభవం ► ఎమ్మెల్సీ సీటుపై దక్కని హామీ ► మనస్తాపంతో అనుచరుల వద్ద ఆవేదన నెల్లూరు సిటీ: కాంగ్రెస్ పార్టీలో తాము చెప్పిందే వేదం..తాము చెప్పిన వారికే పదవులు అన్న విధంగా ఏలిన ఆనం కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో చేదు అనుభవం ఎదురైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటలో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా టీడీపీ అధిష్టానం నుంచి సరైన హామీ రాకపోవడంతో ఆనం వివేకానందరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా టీడీపీలో చేరామని అనచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆనంపై బాబు ఆగ్రహం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ కోసం తనను కలిసిన ఆనం సోదరులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నమ్మకంతో పార్టీలోకి ఆహ్వానిస్తే, పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడినట్లు తెలిసింది. పార్టీలోకి ఆహ్వానించే ముందు ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గ సీటు ఇచ్చేందుకు ఒప్పం దం కుదుర్చుకున్నారు. ఆనం సోదరులు టీడీపీలో చేరి చ క్రం తిప్పుదామని ముందుగానే వ్యూహరచన చేశారు. రామ నారాయణరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే టికెట్ , వివేకా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు, తనయడు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. బాబు ఆగ్రహంతో ఆనం సోదరుల ముందస్తు వ్యూహాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఏమి ఇవ్వాలో నాకు తెలుసు ఎమ్మెల్సీ సీటు కోసం ఆనం వివేకాందరెడ్డి స్వయంగా వెళ్లి సీఎంను కలిశారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా రెండు రోజులు విజయవాడలో బస చేసి చివరికి 2 నిమి షాలు మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబునాయుడు ఇప్పటికే రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్చార్జిగా అవకాశం కల్పించామని, ఇంకా ఏమి ఇవ్వాలో తెలుసునని, అడగాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. భంగపడ్డ ఆనం టీడీపీలో చేరి తప్పుచేశానని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆశలపై నీళ్లు తనకు ఎమ్మెల్సీ స్థానం..తన కుమారుడికి నగర ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి ఆనం టీడీపీలో చేరారు. తన అనుచరులకు రానున్న రోజుల్లో టీడీపీని మనమే లీడ్ చేస్తామని చెప్పారు. అమరావతి మూడ్రోజుల పర్యటనతో ఆనం అం చనాలు తలకిందులయ్యాయి. కాంగ్రెస్‌ని ఏ విధంగా లీడ్ చేశామో.. అలాగే టీడీపీని లీడ్ చేయవచ్చని వివేకా అనుకున్నారు. అయితే లోకేష్ మీ పని మీరు చూసుకోవాలని, మేయర్ జోలికి వెళ్లద్దని సూచించడం.. బాబు సైతం పార్టీలో విభేదాలకు కేంద్ర బిందువుగా మారవద్దని హెచ్చరించడంతో వివేకా మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆనం కంట కన్నీరు ఆనం వివేకానందరెడ్డి ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని విమర్శించడం..అవకాశం వచ్చినప్పుడల్లా తన శైలిలో ఎకసెక్కాలు ఆడడం మామూలే..అయితే విలేకరుల సమావేశంలో ఎన్నడూ లేని విధంగా వ్యవహరించారు. తమ సొదరుల మధ్యన చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మాట్లాడుతూ కన్నీటి పర్వంతమయ్యారు. తాము చివరి వరకు రాజకీయాల్లోనే ఉంటామని తెలిపారు. సహనం కోల్పోయి..విలేకరులు అడిగిన ప్రశ్నకు సైతం సమాధానం ఇవ్వకుండా ఒంటి కాలిపై లేచారు. తనను ఇంక ప్రశ్నించవద్దని, చాలు అని గట్టిగా ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పర్యటన అనంతరం ఆనంలో వచ్చిన మార్పు అటు టీడీపీ, ఇటు ఆనం వర్గంలో చర్చినీయాంశమైంది. -
మోసకారి బాబు
- ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంపై బచ్చుల విమర్శ - చంద్రబాబు ఏంటో అర్థమైందని వ్యాఖ్య - నూజివీడు ఎమ్మెల్యే టికెట్ విషయంలోనూ మోసం చేశారని ఆవేదన - వైవీబీ, బుద్దా బుజ్జగింపు యత్నాలు మచిలీపట్నం : ‘‘తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అనే పేరుతో నా చేతికి మూర్ఛ బిళ్ల కట్టారు. 34 సంవత్సరాలుగా టీడీపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు టిక్కెట్ ఇస్తామని చెప్పి అలానే చేశారు. 34 సంవత్సరాల తరువాత చంద్రబాబునాయుడు అంటే ఏంటో అర్థమైంది.’’ ..ఇదీ ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆవేదన. పార్టీలో తన సేవలను గుర్తించి తనకు కచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని పెట్టుకున్న ఆశలు అడియాసలు కావడంతో తీవ్ర వైరాగ్యంలో ఉన్న బచ్చుల అర్జునుడును ఎమ్మెల్సీ అభ్యర్థులు వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, టీడీపీ నాయకులు బుధవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, ఆమోదం అనంతరం వారు అర్జునుడు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా బచ్చుల అర్జునుడు పైవిధంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. అర్జునుడుతో పాటు ఆయన కుమారుడు బోస్ తమదైన శైలిలో పార్టీ నాయకత్వంపై తమ అభిప్రాయాలను కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. పార్టీ మారిన వారికే టికెట్లు ఇస్తారా... బోస్ మాట్లాడుతూ... ‘సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆశ చూపితే మాకు ఉన్నవన్నీ అమ్ముకుని నూజివీడు బయలుదేరాం. నూజివీడులో అద్దెకు ఇల్లు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ఈలోపుగానే దేవినేని ఉమా ఫోన్ చేసి వద్దు అంటూ వారించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు నూజివీడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా రెండు చేతులతో పార్టీ జెండాను మోస్తే టికెట్ ఇవ్వకుండా నిలిపివేశారు. మీతో పాటే నేను పార్టీ కోసం చాకిరీ చేశా.. చేయలేదంటే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ముద్దరబోయినకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని ఆశ చూపారు. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటం లేదని ఒక్కమాట చెప్పలేదు. ఎప్పటి నుంచో పార్టీ మారితేనే విలువ ఉంటుందని చెబుతూ వచ్చా’ అని వ్యాఖ్యానించారు. ఉన్నత పదవి ఇప్పిస్తామంటూ వైవీబీ, బుద్దా వెంకన్న బుజ్జగింపు బచ్చుల అర్జునుడును బుజ్జగిస్తూ వైవీబీ, బుద్దా వెంకన్నలు మాట్లాడుతూ ‘ఎమ్మెల్సీ పదవి రాలేదని బాధపడవద్దు. చంద్రబాబునాయుడు ఈ కేసు నుంచి బయటపడగానే ఆయన వద్దకు మేమే తీసుకువెళతాం. మాకంటే ఉన్నతమైన పదవిని ఇప్పిస్తాం. నూజివీడు ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు విషయంలో మీకు అన్యాయం జరిగింది. అప్పట్లో మేమంతా బాధపడ్డాం. ఇవన్నీ సహజం’ అని చెప్పారు. వైవీబీ మాట్లాడుతూ తనకంటే జూనియర్‌కు ఏడాది క్రితమే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఈ విషయమై ఏడాది కాలంగా తాను ఎంతో బాధపడ్డానని, ఏడాది తరువాత తనకు న్యాయం జరిగిందని తెలిపారు. ‘నేనే చంద్రబాబునాయుడు వద్దకు నిన్ను తీసుకువెళతా.. ఉన్నతమైన పదవి ఇస్తున్నట్లు ఆర్డరు కాగితం తెచ్చుకుందాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా బచ్చుల మాట్లాడుతూ ‘పార్టీ కోసం నా కంటే మీరెవ్వరూ గొప్పగా పనిచేయలేదని నా భావన. చంద్రబాబు వద్దకు మీరెవ్వరూ నన్ను తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. నేను నేరుగా వెళ్లలేనా’ అంటూ ప్రశ్నించారు. దీంతో కాలక్రమేణా పరిస్థితులు చక్కబడతాయని నచ్చజెప్పి వారు వెనుదిరిగారు. బచ్చులను కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, ఇతర టీడీపీ నేతలు ఉన్నారు. -
అంతా అక్కడే...
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎమ్మెల్సీ సీటుపై తెలుగుదేశంపార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఆశావహులంతా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. గురువారం జిల్లాకు చెందిన మంత్రులు, శాసన సభ్యులు, సీనియర్ నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ సీటుపై సమీక్షించారు. కాపు సామాజికవర్గానికి ఆ సీటు కేటాయించాలని అంతా భావించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు కూడా కాపులకు ఆ సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయని మీడియాకు వివరించారు. అయితే కమ్మ సామాజికవర్గం నుంచి సీటు ఆశిస్తున్న వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు హైదరాబాద్‌లోనే ఉండి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు జిల్లాలో సమావేశాలు నిర్వహించి మన్నవకు సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆ సమావేశం ద్వారా కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ లాల్‌వజీర్ అధ్యక్షతన స్థానిక చంద్రమౌళినగర్లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన ఆత్మీయ సమావేశంలో పలువురు ప్రసంగించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుబ్బారావు దశాబ్దకాలంపాటు పార్టీ ఉనికిని కాపాడారన్నారు. గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి పార్టీకి అండగా నిలిచారని తెలిపారు. కులం, డబ్బు ప్రతిభకు ఆటంకం కారాదని, ప్రతిభావంతులను గుర్తించాల్సిన అవసరం వుందని గుర్తుచేశారు. పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి చంద్రగిరి ఏడుకొండలు మాట్లాడుతూ నీతి, నిజాయతీకి మారుపేరు మన్నవ అని, కుల సమీకరణలో భాగంగా ఆయనను బలిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీటు ఆశిస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందిన అన్నం సతీష్ ప్రభాకర్, దాసరి రాజామాస్టారు, చందు సాంబశివరావులు హైదరాబాద్‌లో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. -
బాబుపైనే భారం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : స్థానిక ఎమ్మెల్సీ సీటుపై టీడీపీలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. పార్టీ నాయకులు రోజుకో ప్రాంతంలో సమావేశమవుతున్నా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. తమ బలానికి అనుగుణంగా ఒకరినే బరిలోకి దింపాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే ఆ ఒక్క సీటు ఏ సామాజిక వర్గానికి, ఎవరికి ఇవ్వాలి అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సంఘటన నేపథ్యంలో రెండో సీటుకోసం ప్రయత్నించడం సరికాదని సీనియర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆర్థిక వెసులుబాటు కలిగిన కొందరు ఆశావహులు రెండు సీట్లకు పోటీ చేయాలని నాయకులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు చెందిన గ్రాండ్ నాగార్జున హోటల్లో మంత్రి పుల్లారావు సమక్షంలో శనివారం జరిగిన సమావేశంలో నేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కొందరు రెండు సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయాలని, మరి కొందరు ఒక సీటుకు అభ్యర్థిని ఎంపిక చేయాలని సూచించినట్టు తెలిసింది. ఆదివారం మరో సీనియర్ నేత సమక్షంలో జరిగిన సమావేశంలో విమర్శలకు తావులేకుండా ఒక సీటుకే అభ్యర్థిని ఎంపిక చేయడం సరైన మార్గమనే అభిప్రాయానికి మిగిలిన నేతలు వచ్చారు. ఆ ఒక్కరి ఎంపిక నిర్ణయం ‘బాబు’కు వదిలేస్తే ఏ సమస్య లేకుండా పోతుందని భావించారు. ‘మహాసంక్పలం’ తరువాత ఢిల్లీ పర్యటన ఆ తరువాత అభ్యర్థిపై బాబు నిర్ణయంతీసుకునే అవకాశం ఉంది. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పదిహేను రోజుల క్రితమే పార్టీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవడంతో ప్రచారం ఊపందుకుంది. మాజీ మంత్రి, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తరువాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశం పది రోజుల క్రితం గుంటూరులో జరిగింది. ఉమ్మారెడ్డిని గెలిపించడానికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు పూర్తిస్థాయిలో సహకరించాలని, వారి పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రస్తుత పరిస్థితులు వివరించాలని విజయసాయి రెడ్డి కోరారు. ఆ తరువాత నుంచి ఉమ్మారెడ్డి నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ అక్కడి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిల సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది నియోజకవర్గాల్లో ఉమ్మారెడ్డి పర్యటించారు. మిగిలిన నియోజకవర్గాలలో ఒకటి రెండు రోజుల్లో మొదటిసారి పర్యటన పూర్తి చేయనున్నారు. మేజిక్ ఫిగర్- 454 కాగా, ఈ ఎన్నికల్లో 454 ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎమ్మెల్సీ అవుతారు. మొత్తం 1359 ఓట్లలో అన్నీ పోలైతే ఈ మేజిక్ ఫిగర్‌కు చేరుకున్న అభ్యర్థికి విజయం చేకూరుతుంది. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు పోగా 566 మంది వైఎస్సార్ సీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మాజిక్ ఫిగర్ కంటే వైఎస్సార్సీపీకి 112 ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇవి కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు 14 మంది, సీపీఐ 9, సీపీఎం 6, ఇండిపెండెంట్లు ఏడుగురు ఉన్నారు. సీపీఎం మినహా ఇతర పార్టీలు వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతు పలుకుతున్నాయి. ఆ పార్టీల అగ్రనాయకుల నుంచి ఇప్పటికే వారికి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. -
సీఎం ‘బ్రేక్’.. ఫాస్ట్‌తో బెదురుతున్న నేతలు..!
ముఖ్యులు ఉదయాన్నే మా ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కు రావాలని పిలిస్తే ఎవరైనా సంతోషిస్తారు. అందులోనూ సీఎం అంతటి వ్యక్తి పిలిస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు బ్రేక్ ఫాస్ట్ అంటే మాత్రం నేతలు ఏదో తిరకాసు ఉందని వెనుకడుగు వేస్తున్నారట. అలా హాజరైన వారికి పదవులు ఇవ్వకుండా బ్రేక్ వేయడానికే ఆయన బ్రేక్ ఫాస్ట్‌కు పిలుస్తారట. ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చూద్దామన్నందుకు... రోజూ స్వాతిముత్యం సినిమాలో ఉద్యోగం కోసం కమలహాసన్‌లా ప్రతి రోజూ ఏదో సందర్భంలో ఎక్కడో ఒకచోట కలిసి నమస్కారం పెట్టడం ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ఆయన వ్యవహారం గమనించిన చంద్రబాబు పిలిచి రేపు మాయింటికి బ్రేక్ ఫాస్ట్‌కు రావాలని ఆహ్వానించారు. దాంతో తెగ సంతోషపడిన ఆ నేత తనకు ఎమ్మెల్సీ ఖరారైనట్టేనని మిత్రులు, సన్నిహితులందరికీ చెప్పుకున్నారు. ఉదయాన్నే చెప్పిన టైమ్కన్నా అరగంట ముందే సీఎంగారి ఇంటికి చేరుకున్నారు. కొద్ది సేపటి తర్వాత పిలుపు అందుకుని లోనికి వెళ్లారు. అల్పాహారం వడ్డింపులైన తర్వాత కుశల ప్రశ్నల పరంపర...! ఈలోగా తన పదవి అంటూ ఆ నేత గుర్తుచేయగా..! నీ గురించి నాకు తెలియదా..! నీ గురించి ఆలోచించేవారు నాకన్నా నీకెవరున్నారు...!! ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాగా...! ఇప్పుడే ఎందుకు తొందర...: అని బ్రేక్ ఫాస్ట్ ముగించి మళ్లీ కలుద్దామన్నారట. అంతే...!!! టికెట్ లేదని చెప్పడానికి ఇంత తతంగమా...! బ్రేక్ ఫాస్ట్ పెట్టి మరీ పదవి రాకుండా బ్రేక్ వేశారంటూ ఆ నేత బయటకు రాగానే ఎదురుపడిన నేతలకు చెప్పేసారు. ఆరోజు నుంచి నేతలెవరు కలిసినా బ్రేక్ ఫాస్ట్‌కు మాత్రం వెళ్లకండని చెబుతున్నారట. -
ఈ జన్మకు ఇది చాలు..!
- సేవకుడిలా పనిచేస్తా - అందర్నీ కలుపుకుపోతా - టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు చిత్తూరు (అర్బన్): ‘‘ సామాన్య కార్యకర్తగా కష్టపడి పనిచేస్తే ఎలాంటి గుర్తింపు వస్తుందనడానికి నేనే నిదర్శనం. 1982లో ఓ సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాకు ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి, జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో మరచిపోలేని రోజు. ఈ జన్మకు ఇది చాలు...!’’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా, ఎమ్మెల్సీగా గవర్నర్ కోటా నుంచి తన పేరు ప్రకటించిన తరువాత హైదరాబాదు నుంచి సోమవారం చిత్తూరుకు వచ్చారు. చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ దాదాపు 33 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా వచ్చిన తనను పార్టీ అధిష్టానం తొలి నుంచే ఆదరిస్తోందన్నారు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర పరిశీలకునిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఎంపీపీగా, రాష్ట్ర బోర్డుల్లో సభ్యులుగా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, సీఎం రోజుకు 18 గంటలు పనిచేస్తే పార్టీ క్రియాశీలక కార్యకర్తలు 2 గంటలైనా పార్టీ కోసం పనిచేయాలన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. పేరుకు పదవుల్లో ఉన్నా తాను టీడీపీ కార్యకర్తననే విషయాన్ని విస్మరించబోనన్నారు. ఎమ్మెల్సీ పదవి ఊహించనది... తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రిలో చూపించడానికి వెళుతున్న తనకు పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేసి అధిష్టానం గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని ప్రకటించారని చెప్పడం ఎప్పటికీ మరచిపోలేనిదని శ్రీనివాసులు చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తాను ఎమ్మెల్సీగా ఎంపిక అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. టీడీపీలో బీసీలకు ఎప్పటికీ సముచిత స్థానం ఉంటుందనే విషయం మరో మారు స్పష్టమైందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసుల్ని ఘనంగా స న్మానించారు.జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, పా ర్టీ నేతలు నాని, దొరబాబు, సురేం ద్రకుమార్, ఇందిరా, కఠారి మోహన్, బ ద్రీ, ఇందిరా, శ్రీధర్‌వర్మ పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ ఎమ్మెల్సీ’ దక్కేదెవరికో...
ఒక్కసీటు కోసం 40 మంది పోటీ ఢిల్లీలో ముఖ్యనేతల మోహరింపు హైదరాబాద్ : శాసనసభ్యుల కోటా నుంచి కాంగ్రెస్ పార్టీకి దక్కబోయే ఒకేఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి ఆశావహులు భారీగా పోటీ పడుతున్నా రు. నామినేషన్లకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద తమకు ఉన్న పరపతిని ఉపయోగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన వారికి అవకాశం ఇచ్చేది లేదని అధిష్టానం యోచిస్తున్నట్టుగా పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. పార్టీకోసం పూర్తికాలం పనిచేసేవారు, అంకితభావం ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి మహిళకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా అధిష్టానం వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. అయినా కొందరు ఎలాగైనా ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకోవాలని ఢిల్లీలో రెండురోజులుగా మకాం వేశారు. పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీని వాస్, పొన్నాల లక్ష్మయ్య వంటివారు ఢిల్లీలోనే ఉం డి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, సీనియర్లు కొందరు అక్కడే ఉండి ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం రానివారు కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. మహిళకు అవకాశం ఇవ్వవచ్చనే వార్తల నేపథ్యంలో పలువురు మహిళలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారదకు టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా చేయడంతో ఎమ్మెల్సీ పదవిపై ఆశ వదులుకున్నారు. మాజీ అధ్యక్షురాలు ఆకుల లలిత, పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి మహిళా కోటాలో ముందు వరుసలో ఉన్నారు. -
దేశం అనాసక్తి!
గిరాకీలేని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు కంటే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. పది రోజుల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ సీటు ఆశించే వారి సంఖ్య ఆ పార్టీలో పరిమితంగా ఉంది. ఎక్కువ మంది నాయకులు స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనేక కారణాలు వినపడుతున్నాయి. యూటీఎఫ్ బలపరిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు బలమైన అభ్యర్థి కావడం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కంటే, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం ఉండటంతో ఈ సీటు కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల సమయానికి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో మొత్తం 12,850 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్నారు. గుంటూరులో 6,800 మంది, కృష్ణా జిల్లాలో 6,050 ఉన్నారు. మార్చిలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇటీవల దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులతో కలిపి ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఈ నెల 15,16 తేదీల్లో విడుదల చేయనుంది. 20 తరువాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్‌కు ముందే ప్రస్తుత ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మళ్లీ పోటీ చేసేం దుకు సమాయత్తం అవుతున్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తాను చేసిన సేవలను వివరిస్తున్నారు. యూటీఎఫ్ మద్దతుతో రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన లక్ష్మణరావు మూడోసారి ఇతర వర్గాలను కలుపుకునే యత్నంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తారనే అభిప్రాయం కూడా వినపడుతోంది. ఈ నేపథ్యంలోనే పీఆర్టీయూ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్, ఆర్‌యూపీపీ, హెచ్ఎంఏ, పీఈటీ తదితర ఉపాధ్యాయ సంఘాలన్నీ ఓ అభ్యర్థిని నిలిపేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవంగా టీడీపీలో నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ సీట్లను ఆశించే నాయకుల సంఖ్యకు కొదవ లేదు. గత ఎన్నికల్లో సీటు ఆశించినవారు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి చిరకాలంగా సేవ చేస్తున్న సీనియర్లు ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు కంటే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తూ ఈ సీటు కోసం ప్రయత్నించడంలేదు. ఇద్దరు ముగ్గురు నాయకులు తమకే సీటు అని చెప్పుకుంటున్నా, జిల్లా మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అభ్యర్థిని ఖరారు చేయలేదని, అధినేత చంద్రబాబు వద్ద ఇంకా చర్చ జరగలేదంటున్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో సీపీఐ మద్దతుతో పోటీచేసిన డాక్టర్ ఏఎస్ రామకృష్ణ ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం గుంటూరులో ఉపాధ్యాయులతో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి తాను టీడీపీ మద్దతుతో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు, పార్టీలోని ముఖ్యుల మద్దతు కూడా తనకు ఉన్నట్టు ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితులను అంచనా వేసుకుని టీడీపీలోని ముఖ్యులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. సీటు వచ్చినా బరిలో బలమైన అభ్యర్థులు ఉండే అవకాశాలు కనపడటం, ఎన్నికల ఖర్చు కూడా రూ.3 కోట్ల వరకు అయ్యే అవకాశాలు ఉండటం, గెలిచినా ఆ పదవి వల్ల రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం ఉండదనే భావన టీడీపీ నేతల్లో ఉండటంతో సీటుకోసం పోటీపడే నేతల సంఖ్య పరిమితమైంది. -
కర్నూలు ఎమ్మెల్సీ సీటు కోసం టిడిపి లో పోటీ
-
తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, విజయనగరం : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీలో పోరు మొదలైంది. ఇది రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకర్నిఒకరు దెబ్బతీసుకునే యత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ పదవిని ఆశించినవారు అధికంగా ఉన్నప్పటికీ కోల్డ్‌వార్ మాత్రం టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు, చీపురుపల్లి టీడీపీ ఇన్చార్జి కె.త్రిమూర్తులరాజు మధ్య జరుగుతోంది. తాము కూడా రేసులో ఉన్నామని గద్దేబాబూరావు, భంజ్‌దేవ్, తెంటు లక్ష్మునాయుడు పరోక్ష సంకేతాలు పంపిస్తున్నారు. గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్రశాఖ అధ్యక్షునిగా పనిచేసి, ప్రస్తుతం టీడీపీ ఆరోగ్య విభాగం ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ కూడా అశోక్ గజపతిరాజును కలిశారు. చంద్రబాబునాయుడికి తనబయోడేటాను పంపించారు. టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు, చీపురుపల్లి ఇన్చార్జి కె.త్రిమూర్తులురాజు, డాక్టర్ వి. ఎస్.ప్రసాద్ మధ్య ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రస్థాయిలో వార్ జరుగుతోంది. దీంతో వీరు ఒకరిపై ఒకరు గుర్రుగా ఉన్నట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నమ్ముకొని పనిచేశామని, కార్యకర్తలను కాపాడామని ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీ రాజు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకే పోస్టుకు పోటీ పడటంతో వీరిద్దరి మధ్య ఆగాదం ఏర్పడింది. ఇందులో జగదీష్, ఐవీపీ వర్గీయులు రకరకాల వాదనలు విన్పిస్తున్నారు. ద్వారపురెడ్డి జగదీష్ ఇప్పటికే లబ్ధిపొందారని, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ గిరీని తన భార్యకు దక్కించుకున్నారని, ఇంకా పదవులు ఆశించడం సరికాదని ఐవీపీ వర్గీయులు వాదిస్తున్నారు. ఐవీపీ కూడా నోరు విప్పి అడుగుతున్నారు. ఎప్పుడూ తాను పదవుల కోసం పనిచేయలేదని, అయితే ఈసారి తనకు కాకుండా వేరొకరికి ఎమ్మెల్సీ ఇవ్వడం భావ్యం కాదని ఐవీపీ కార్యకర్తల వద్ద అంటున్నారు. దీనికి స్పందనగా ద్వారపురెడ్డి కూడా తన అనుచరుల వద్ద తన వాదన వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి, అధ్యక్ష పదవికి యడ్ల రమణమూర్తి రాజీనామా చేసిన తరువాత పార్టీ పూర్తిస్థాయిలో నిస్తేజంలో పడిందని, ఆ నేపథ్యంలో తాను అధ్యక్ష పదవిని చేపట్టి పార్టీని జిల్లాలో గెలిపించానని ద్వారపురెడ్డి చెబుతున్నారు. అనుచరుల చేత కూడా అదే మాట అన్పిస్తున్నారు. తన భార్య పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు కదా అంటూ ఐవీపీ వర్గీయులు చేస్తున్న వాదనలపై కూడా తన అనుచరుల చేత గట్టిగా బదులిప్పిస్తున్నట్టు తెలిసింది. అయితే వీరికి తానేమీ తక్కువ కాదని, ద్వారపురెడ్డి, ఐవీపీ కంటే తనకే ఎమ్మెల్సీ పదవిని అలంకరించే అర్హత ఉందని చీపురుపల్లి నియోజకవర్గ నేత కె.టి.త్రిమూర్తులరాజు వాదిస్తున్నారని సమాచారం. ఎన్నికల సమయంలో తనకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తామనే హామీని కూడా హైకమాండ్ నుంచి వచ్చిందని నాటి విషయాలు గుర్తుచేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పార్టీ టిక్కెట్టు ఇవ్వనప్పుడు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశానని, దీనికి అశోక్‌గజపతిరాజు, కిమిడి కళావెంకటరావు వచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత నీకు ఏదోఒకటి చూస్తామని హామీ ఇవ్వడంతోనే నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు అనుచరుల వద్ద చెప్పుకొస్తున్నారు. ఉన్నది ఒకే ఎమ్మెల్సీ పదవి కావడం దానికి తానే అర్హుడనని కేటీఆర్ తన అనుచరుల వద్ద చెప్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్‌కు చెక్ పెట్టేలా మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు కూడా పోటీ పడుతున్నారు. పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉందంటూ ఆయన రంగంలోకి దిగారు. సామాజిక అస్త్రాన్ని ప్రయోగించి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కేటీఆర్‌కు సొంత నియోజకవర్గంలోనే సెగ పెట్టినట్టు అయింది. ఇక, ఎన్నికల్లో ఓడిపోయిన భంజ్‌దేవ్, తెంటులక్ష్మునాయుడు కూడా పోటీ పడుతున్నారు. స్థానికంగా పార్టీ పట్టు సాధించాలంటే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నట్టు సమాచారం. ఇప్పటికే అధినేతకు తమ ఆకాంక్షను తెలియజేసినట్టు పార్టీ వర్గాల్లో విన్పిస్తోంది. డాక్టర్ వి.ఎస్. ప్రసాద్ కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఈ విధంగా ఎమ్మెల్సీ పదవి విషయంలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు ఎక్కువవుతోంది. ఎవరికి వారు అశోక్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ఇంతవరకు బయటపడలేదు. పదవి కావాలని కోరేవారిపై చిర్రెత్తిపోతున్నారు. మనసులో మాటను చెప్పుకోవడానికి కూడా అవకాశమివ్వడం లేదు. దీంతో ఏ ఒక్కరిలోనూ ధీమా కన్పించడం లేదు. కానీ అంతర్గతంగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. -
ఏపి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటుకు 21ఎన్నిక