అంతా అక్కడే...
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎమ్మెల్సీ సీటుపై తెలుగుదేశంపార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఆశావహులంతా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. గురువారం జిల్లాకు చెందిన మంత్రులు, శాసన సభ్యులు, సీనియర్ నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ సీటుపై సమీక్షించారు. కాపు సామాజికవర్గానికి ఆ సీటు కేటాయించాలని అంతా భావించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు కూడా కాపులకు ఆ సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయని మీడియాకు వివరించారు.
అయితే కమ్మ సామాజికవర్గం నుంచి సీటు ఆశిస్తున్న వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు హైదరాబాద్‌లోనే ఉండి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు జిల్లాలో సమావేశాలు నిర్వహించి మన్నవకు సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆ సమావేశం ద్వారా కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ లాల్‌వజీర్ అధ్యక్షతన స్థానిక చంద్రమౌళినగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన ఆత్మీయ సమావేశంలో పలువురు ప్రసంగించారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుబ్బారావు దశాబ్దకాలంపాటు పార్టీ ఉనికిని కాపాడారన్నారు. గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి పార్టీకి అండగా నిలిచారని తెలిపారు. కులం, డబ్బు ప్రతిభకు ఆటంకం కారాదని, ప్రతిభావంతులను గుర్తించాల్సిన అవసరం వుందని గుర్తుచేశారు. పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి చంద్రగిరి ఏడుకొండలు మాట్లాడుతూ నీతి, నిజాయతీకి మారుపేరు మన్నవ అని, కుల సమీకరణలో భాగంగా ఆయనను బలిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీటు ఆశిస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందిన అన్నం సతీష్ ప్రభాకర్, దాసరి రాజామాస్టారు, చందు సాంబశివరావులు హైదరాబాద్‌లో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.