బాబుపైనే భారం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : స్థానిక ఎమ్మెల్సీ సీటుపై టీడీపీలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. పార్టీ నాయకులు రోజుకో ప్రాంతంలో సమావేశమవుతున్నా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. తమ బలానికి అనుగుణంగా ఒకరినే బరిలోకి దింపాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే ఆ ఒక్క సీటు ఏ సామాజిక వర్గానికి, ఎవరికి ఇవ్వాలి అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సంఘటన నేపథ్యంలో రెండో సీటుకోసం ప్రయత్నించడం సరికాదని సీనియర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆర్థిక వెసులుబాటు కలిగిన కొందరు ఆశావహులు రెండు సీట్లకు పోటీ చేయాలని నాయకులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు.
తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు చెందిన గ్రాండ్ నాగార్జున హోటల్‌లో మంత్రి పుల్లారావు సమక్షంలో శనివారం జరిగిన సమావేశంలో నేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కొందరు రెండు సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయాలని, మరి కొందరు ఒక సీటుకు అభ్యర్థిని ఎంపిక చేయాలని సూచించినట్టు తెలిసింది. ఆదివారం మరో సీనియర్ నేత సమక్షంలో జరిగిన సమావేశంలో విమర్శలకు తావులేకుండా ఒక సీటుకే అభ్యర్థిని ఎంపిక చేయడం సరైన మార్గమనే అభిప్రాయానికి మిగిలిన నేతలు వచ్చారు.
ఆ ఒక్కరి ఎంపిక నిర్ణయం ‘బాబు’కు వదిలేస్తే ఏ సమస్య లేకుండా పోతుందని భావించారు. ‘మహాసంక్పలం’ తరువాత ఢిల్లీ పర్యటన ఆ తరువాత అభ్యర్థిపై బాబు నిర్ణయంతీసుకునే అవకాశం ఉంది. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పదిహేను రోజుల క్రితమే పార్టీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవడంతో ప్రచారం ఊపందుకుంది. మాజీ మంత్రి, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తరువాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశం పది రోజుల క్రితం గుంటూరులో జరిగింది.
ఉమ్మారెడ్డిని గెలిపించడానికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పూర్తిస్థాయిలో సహకరించాలని, వారి పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రస్తుత పరిస్థితులు వివరించాలని విజయసాయి రెడ్డి కోరారు. ఆ తరువాత నుంచి ఉమ్మారెడ్డి నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ అక్కడి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిల సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది నియోజకవర్గాల్లో ఉమ్మారెడ్డి పర్యటించారు. మిగిలిన నియోజకవర్గాలలో ఒకటి రెండు రోజుల్లో మొదటిసారి పర్యటన పూర్తి చేయనున్నారు.
మేజిక్ ఫిగర్- 454
కాగా, ఈ ఎన్నికల్లో 454 ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎమ్మెల్సీ అవుతారు. మొత్తం 1359 ఓట్లలో అన్నీ పోలైతే ఈ మేజిక్ ఫిగర్‌కు చేరుకున్న అభ్యర్థికి విజయం చేకూరుతుంది. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు పోగా 566 మంది వైఎస్సార్ సీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మాజిక్ ఫిగర్ కంటే వైఎస్సార్‌సీపీకి 112 ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇవి కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు 14 మంది, సీపీఐ 9, సీపీఎం 6, ఇండిపెండెంట్లు ఏడుగురు ఉన్నారు. సీపీఎం మినహా ఇతర పార్టీలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు పలుకుతున్నాయి. ఆ పార్టీల అగ్రనాయకుల నుంచి ఇప్పటికే వారికి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.