మోసకారి బాబు
- ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంపై బచ్చుల విమర్శ
- చంద్రబాబు ఏంటో అర్థమైందని వ్యాఖ్య
- నూజివీడు ఎమ్మెల్యే టికెట్ విషయంలోనూ మోసం చేశారని ఆవేదన
- వైవీబీ, బుద్దా బుజ్జగింపు యత్నాలు
మచిలీపట్నం : ‘‘తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అనే పేరుతో నా చేతికి మూర్ఛ బిళ్ల కట్టారు. 34 సంవత్సరాలుగా టీడీపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు టిక్కెట్ ఇస్తామని చెప్పి అలానే చేశారు. 34 సంవత్సరాల తరువాత చంద్రబాబునాయుడు అంటే ఏంటో అర్థమైంది.’’ ..ఇదీ ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆవేదన.
పార్టీలో తన సేవలను గుర్తించి తనకు కచ్చితంగా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని పెట్టుకున్న ఆశలు అడియాసలు కావడంతో తీవ్ర వైరాగ్యంలో ఉన్న బచ్చుల అర్జునుడును ఎమ్మెల్సీ అభ్యర్థులు వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, టీడీపీ నాయకులు బుధవారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, ఆమోదం అనంతరం వారు అర్జునుడు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా బచ్చుల అర్జునుడు పైవిధంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. అర్జునుడుతో పాటు ఆయన కుమారుడు బోస్ తమదైన శైలిలో పార్టీ నాయకత్వంపై తమ అభిప్రాయాలను కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు.
పార్టీ మారిన వారికే టికెట్లు ఇస్తారా...
బోస్ మాట్లాడుతూ... ‘సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆశ చూపితే మాకు ఉన్నవన్నీ అమ్ముకుని నూజివీడు బయలుదేరాం. నూజివీడులో అద్దెకు ఇల్లు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ఈలోపుగానే దేవినేని ఉమా ఫోన్ చేసి వద్దు అంటూ వారించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు నూజివీడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా రెండు చేతులతో పార్టీ జెండాను మోస్తే టికెట్ ఇవ్వకుండా నిలిపివేశారు. మీతో పాటే నేను పార్టీ కోసం చాకిరీ చేశా.. చేయలేదంటే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ముద్దరబోయినకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని ఆశ చూపారు. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటం లేదని ఒక్కమాట చెప్పలేదు. ఎప్పటి నుంచో పార్టీ మారితేనే విలువ ఉంటుందని చెబుతూ వచ్చా’ అని వ్యాఖ్యానించారు.
ఉన్నత పదవి ఇప్పిస్తామంటూ వైవీబీ, బుద్దా వెంకన్న బుజ్జగింపు
బచ్చుల అర్జునుడును బుజ్జగిస్తూ వైవీబీ, బుద్దా వెంకన్నలు మాట్లాడుతూ ‘ఎమ్మెల్సీ పదవి రాలేదని బాధపడవద్దు. చంద్రబాబునాయుడు ఈ కేసు నుంచి బయటపడగానే ఆయన వద్దకు మేమే తీసుకువెళతాం. మాకంటే ఉన్నతమైన పదవిని ఇప్పిస్తాం. నూజివీడు ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు విషయంలో మీకు అన్యాయం జరిగింది. అప్పట్లో మేమంతా బాధపడ్డాం. ఇవన్నీ సహజం’ అని చెప్పారు. వైవీబీ మాట్లాడుతూ తనకంటే జూనియర్‌కు ఏడాది క్రితమే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఈ విషయమై ఏడాది కాలంగా తాను ఎంతో బాధపడ్డానని, ఏడాది తరువాత తనకు న్యాయం జరిగిందని తెలిపారు. ‘నేనే చంద్రబాబునాయుడు వద్దకు నిన్ను తీసుకువెళతా.. ఉన్నతమైన పదవి ఇస్తున్నట్లు ఆర్డరు కాగితం తెచ్చుకుందాం’ అని చెప్పారు.
ఈ సందర్భంగా బచ్చుల మాట్లాడుతూ ‘పార్టీ కోసం నా కంటే మీరెవ్వరూ గొప్పగా పనిచేయలేదని నా భావన. చంద్రబాబు వద్దకు మీరెవ్వరూ నన్ను తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. నేను నేరుగా వెళ్లలేనా’ అంటూ ప్రశ్నించారు. దీంతో కాలక్రమేణా పరిస్థితులు చక్కబడతాయని నచ్చజెప్పి వారు వెనుదిరిగారు. బచ్చులను కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, ఇతర టీడీపీ నేతలు ఉన్నారు.