గిరాకీలేని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు కంటే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. పది రోజుల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నప్పటికీ సీటు ఆశించే వారి సంఖ్య ఆ పార్టీలో పరిమితంగా ఉంది. ఎక్కువ మంది నాయకులు స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనేక కారణాలు వినపడుతున్నాయి.
యూటీఎఫ్ బలపరిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు బలమైన అభ్యర్థి కావడం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కంటే, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం ఉండటంతో ఈ సీటు కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు.
గత ఎన్నికల సమయానికి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో మొత్తం 12,850 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్నారు. గుంటూరులో 6,800 మంది, కృష్ణా జిల్లాలో 6,050 ఉన్నారు.
మార్చిలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇటీవల దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులతో కలిపి ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఈ నెల 15,16 తేదీల్లో విడుదల చేయనుంది. 20 తరువాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి.
నోటిఫికేషన్‌కు ముందే ప్రస్తుత ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మళ్లీ పోటీ చేసేం దుకు సమాయత్తం అవుతున్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తాను చేసిన సేవలను వివరిస్తున్నారు.
యూటీఎఫ్ మద్దతుతో రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన లక్ష్మణరావు మూడోసారి ఇతర వర్గాలను కలుపుకునే యత్నంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తారనే అభిప్రాయం కూడా వినపడుతోంది.
ఈ నేపథ్యంలోనే పీఆర్‌టీయూ, ఎస్‌టీయూ, ఏపీటీఎఫ్, ఆర్‌యూపీపీ, హెచ్‌ఎంఏ, పీఈటీ తదితర ఉపాధ్యాయ సంఘాలన్నీ ఓ అభ్యర్థిని నిలిపేందుకు సిద్ధమవుతున్నాయి.
వాస్తవంగా టీడీపీలో నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ సీట్లను ఆశించే నాయకుల సంఖ్యకు కొదవ లేదు. గత ఎన్నికల్లో సీటు ఆశించినవారు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి చిరకాలంగా సేవ చేస్తున్న సీనియర్లు ఈ జాబితాలో ఉన్నారు.
వీరిలో ఎక్కువ మంది ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు కంటే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తూ ఈ సీటు కోసం ప్రయత్నించడంలేదు.
ఇద్దరు ముగ్గురు నాయకులు తమకే సీటు అని చెప్పుకుంటున్నా, జిల్లా మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అభ్యర్థిని ఖరారు చేయలేదని, అధినేత చంద్రబాబు వద్ద ఇంకా చర్చ జరగలేదంటున్నారు.
ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో సీపీఐ మద్దతుతో పోటీచేసిన డాక్టర్ ఏఎస్ రామకృష్ణ ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం గుంటూరులో ఉపాధ్యాయులతో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి తాను టీడీపీ మద్దతుతో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు, పార్టీలోని ముఖ్యుల మద్దతు కూడా తనకు ఉన్నట్టు ప్రకటించుకున్నారు.
ఈ పరిస్థితులను అంచనా వేసుకుని టీడీపీలోని ముఖ్యులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. సీటు వచ్చినా బరిలో బలమైన అభ్యర్థులు ఉండే అవకాశాలు కనపడటం, ఎన్నికల ఖర్చు కూడా రూ.3 కోట్ల వరకు అయ్యే అవకాశాలు ఉండటం, గెలిచినా ఆ పదవి వల్ల రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం ఉండదనే భావన టీడీపీ నేతల్లో ఉండటంతో సీటుకోసం పోటీపడే నేతల సంఖ్య పరిమితమైంది.
దేశం అనాసక్తి!
Published Wed, Jan 14 2015 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM
Advertisement
Advertisement