సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా బీసీ మహిళా నేత పంచుమర్తి అనూరాధను పోటీకి దించి చంద్రబాబు మరోసారి తన మార్కు రాజకీయానికి తెరలేపారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు మొండిచేయి చూపించి.. ఇప్పుడు గెలవలేని సీటు ఇచ్చి ఆమెను బలి చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా వైఎస్సార్‌సీపీకి ఉన్న సంఖ్యాబలంతో వాటిన్నింటినీ చేజిక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలంటే కనీసం 22 మంది ఎమ్మెల్యేలు అవసరం.
టీడీపీ నుంచి గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలైనా, అందులో నలుగురు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మిగిలింది 19 మంది మాత్రమే. వారి ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలవడం అసాధ్యం అని అందరికీ తెలుసు. అలాంటి ఎన్నికల్లో బీసీ మహిళను నిలబెట్టడం అంటే ఆ వర్గాన్ని అవమానించడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, అనూరాధ ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలని పలుమార్లు కోరినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓడిపోయే సీటును మాత్రం బీసీల కోటాలో ఆమెకు ఇవ్వడంపై టీడీపీలోనే అసహనం వ్యక్తమవుతోంది.
మొదటి నుంచీ ఇదే తీరు
♦ అధికారంలో ఉన్నప్పుడు సొంత వర్గానికి మాత్రమే పదవులు కట్టబెట్టిన చంద్రబాబు.. అప్పట్లో బీసీలు, దళిత నేతలను చాలా అవమానాలకు గురిచేశారు. 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుతం అనూరాధకు ఎమ్మెల్సీ సీటు కేటాయించినట్టే, పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు కేటాయించారు. ఆ ఎన్నికల్లోనూ రాష్ట్రానికి వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాల్లో సంఖ్యా బలం రీత్యా వైఎస్సార్‌సీపీ గెలవడం లాంఛనమేనని తెలిసినా చంద్రబాబు దళిత నేతను పోటీకి దింపి ఆ వర్గాన్ని బలి చేశారు.
♦2014 నుంచి ఆరేళ్లలో మూడుసార్లు టీడీపీ నాయకుల్ని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు తన కోటరీలోని ముఖ్యులు, సొంత సామాజిక వర్గం వారికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి.. దళితులు, బీసీ నాయకుల్ని మాత్రం పట్టించుకోలేదు.
♦2014, 2016, 2018లో ఏడుగురిని రాజ్యసభకు పంపే అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబుకు బీసీలు, దళితులు గుర్తుకు రాలేదు. అప్పుడు తన సొంత సామాజికవర్గ నేతలు, తన కోటరీకి చెందిన వారు, సన్నిహితులకు అవకాశం ఇచ్చారు.
♦గరికపాటి మోహనరావు, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి నేతలను రాజ్యసభకు పంపారు. మిగిలిన సీట్లలోనూ సామాజిక సమీకరణలు, పార్టీ అవసరాల పేరుతో టీజీ వెంకటేష్, తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్, సురేష్ ప్రభు వంటి నేతలకు ఇచ్చారు.
♦2016లో దళిత నేత జేఆర్ పుష్పరాజ్‌కు సీటిస్తానని తన ఇంటికి పిలిపించుకుని ఒక రోజంతా కూర్చోబెట్టి, ఆ తర్వాత లేదని చెప్పి అవమానించి పంపారు. 2018లో దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి అంతా సిద్ధమయ్యాక చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకుమార్‌కు ఆ సీటు ఇచ్చారు.
♦ఇప్పుడు అధికారం కోల్పోయి, ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేని స్థితిలో ఓడిపోతామని తెలిసి కూడా ఆ సీటులో బీసీ మహిళను నిలబెట్టడం ద్వారా చంద్రబాబు మరోసారి బలహీన వర్గాలను మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ స్థానాల్లో తన కుమారుడు లోకేశ్, ఇతర ముఖ్య నాయకులను ఎందుకు నిలబెట్టలేదనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment