సాక్షి, నల్గొండ/యాదాద్రి భువనగిరి: ఎమ్మెల్సీ పదవి కోసం జిల్లా బీఆర్‌ఎస్‌లో కోలాహలం మొదలైంది. శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అధినేత కేసీఆర్ ఇప్పటికే పలువురికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికే ఇస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశమైంది.
ఎవరి ప్రయత్నాల్లో వారు
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు ఎలిమినేటి కృష్ణారెడ్డికి ఆరేళ్ల క్రితం శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కిన విషయం తెలిసిందే. వచ్చేనెల ఆయన పదవీకాలం ముగియనుండడంతో ఆశావహులు ఆ సీటుపై కన్నేశారు. ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ద్వారా కొందరు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు నేరుగా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వేడుకుంటున్నారు.
తమకే వస్తుందన్న ధీమా
అధినేత కేసీఆర్ వివిధ ఎన్నికల సందర్భంగా పార్టీలోని పలువురు ముఖ్య నేతలకు పదవుల విషయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. దీంతో వారు ధీమాతో ఉన్నారు. బీఆర్‌ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీలో చేరారు. ఈ భర్తీని పూడ్చేందుకు బీజేపీలో ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను పార్టీ పెద్దలు రాత్రికిరాత్రి ఒప్పించి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పారు.
అంతకుముందు బీఆర్‌ఎస్‌లో ఉన్న భిక్షమయ్య ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో టికెట్ అవకాశం కోసం బీజేపీ గూటికి చేరారు. అయితే మార్చిలో రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎక్కడో ఒక చోట నుంచి అవకాశం కల్పిస్తానని భిక్షమయ్యగౌడ్‌కు అధినేత కేసీఆర్ మాటివ్వడంతో ఆయన తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సామాజిక వర్గ సమీకరణల్లో భాగంగా పార్టీ అవసరాల దృష్ట్యా భిక్షమయ్యగౌడ్‌కు అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది.
మరికొందరు
ఇక జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాయమైందన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డికి ఆ పదవి దక్కింది.
దీంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని, అప్పట్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చింతల వర్గీయులు చెబుతున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు సమసిపోవడానికి ఒక ప్రయత్నంగా అధిష్టానం ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.
మరోవైపు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తనకు మరోమారు అవకాశం కల్పించాలని మనసులో ఉన్న మాటను తన వర్గీయులతో అన్నట్లు తెలుస్తోంది. అయితే తనకంటే కూడా తన కుమారుడు వివేక్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ, సంస్థాన్‌నారాయణపురానికి చెందిన కర్నె ప్రభాకర్, శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
సామాజిక సమీకరణలపై లెక్కలు
ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న పలువురు బీఆర్‌ఎస్ నేతలు సామాజిక వర్గ సమీకరణలపైనా లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్ర యూనిట్‌గా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధినేత ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గ సమీకరణలు బలంగా పని చేయనున్నాయి.
మార్చిలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన స్థానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బలమైన సామాజిక వర్గానికి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బీసీ గౌడ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం లేనందున ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment