bikshamaiah goud
-
BRS Party: ఎమ్మెల్సీ చాన్స్ ఎవరికి? నేరుగా కేసీఆర్, కేటీఆర్‌తోనే..
సాక్షి, నల్గొండ/యాదాద్రి భువనగిరి: ఎమ్మెల్సీ పదవి కోసం జిల్లా బీఆర్ఎస్లో కోలాహలం మొదలైంది. శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం మార్చి 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అధినేత కేసీఆర్ ఇప్పటికే పలువురికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికే ఇస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఎవరి ప్రయత్నాల్లో వారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు ఎలిమినేటి కృష్ణారెడ్డికి ఆరేళ్ల క్రితం శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కిన విషయం తెలిసిందే. వచ్చేనెల ఆయన పదవీకాలం ముగియనుండడంతో ఆశావహులు ఆ సీటుపై కన్నేశారు. ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ద్వారా కొందరు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు నేరుగా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వేడుకుంటున్నారు. తమకే వస్తుందన్న ధీమా అధినేత కేసీఆర్ వివిధ ఎన్నికల సందర్భంగా పార్టీలోని పలువురు ముఖ్య నేతలకు పదవుల విషయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. దీంతో వారు ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీలో చేరారు. ఈ భర్తీని పూడ్చేందుకు బీజేపీలో ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను పార్టీ పెద్దలు రాత్రికిరాత్రి ఒప్పించి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పారు. అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న భిక్షమయ్య ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో టికెట్ అవకాశం కోసం బీజేపీ గూటికి చేరారు. అయితే మార్చిలో రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎక్కడో ఒక చోట నుంచి అవకాశం కల్పిస్తానని భిక్షమయ్యగౌడ్‌కు అధినేత కేసీఆర్ మాటివ్వడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సామాజిక వర్గ సమీకరణల్లో భాగంగా పార్టీ అవసరాల దృష్ట్యా భిక్షమయ్యగౌడ్‌కు అవకాశం దక్కనుందన్న ప్రచారం సాగుతోంది. మరికొందరు ఇక జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాయమైందన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డికి ఆ పదవి దక్కింది. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని, అప్పట్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చింతల వర్గీయులు చెబుతున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు సమసిపోవడానికి ఒక ప్రయత్నంగా అధిష్టానం ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తనకు మరోమారు అవకాశం కల్పించాలని మనసులో ఉన్న మాటను తన వర్గీయులతో అన్నట్లు తెలుస్తోంది. అయితే తనకంటే కూడా తన కుమారుడు వివేక్ రెడ్డి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ, సంస్థాన్‌నారాయణపురానికి చెందిన కర్నె ప్రభాకర్, శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సామాజిక సమీకరణలపై లెక్కలు ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలు సామాజిక వర్గ సమీకరణలపైనా లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్ర యూనిట్‌గా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధినేత ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక వర్గ సమీకరణలు బలంగా పని చేయనున్నాయి. మార్చిలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన స్థానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బలమైన సామాజిక వర్గానికి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బీసీ గౌడ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం లేనందున ఆ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది. -
టీఆర్ఎస్లో చేరిన భిక్షమయ్య గౌడ్.. కండువా కప్పిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి రాజీనామా చేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు భిక్షమయ్య గౌడ్. నల్లగొండ రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. కోమటిరెడ్డి సోదరులను రాజకీయంగా సమాధి చేయాలన్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే బీజేపీలోకి వెళ్లిన భిక్షమయ్య గౌడ్.. ఆ పార్టీలో ఎక్కువ రోజులు ఇమడలేకపోయారు. కమలం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చదవండి: బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా? -
బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా?
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపారు. ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భిక్షమయ్య గౌడ్. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక బీజేపీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామంటూ భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరాను. అయితే మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరు. పైగా ఈమద్య కాలంలో పదే పదే తెలంగాణ రాష్ట్రానికి, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆ పార్టీలో కొనసాగకుండా చేశాయి. కేంద్రం నుంచి వచ్చిన ప్రధాని నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరు డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట మాటలు చెప్పడమే కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా అదనపు సహాయాన్ని తెలంగాణకు చేయలేదు. ఇక్కడ సర్కారు ఉంటేనే నిధులిస్తాము, అప్పటిదాకా తెలంగాణ ఇబ్బందులను పట్టించుకోమన్నట్లు వ్యవహరిస్తున్న తీరు బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారు మోడల్లోని డొల్లతనానికి అద్దం పడుతోంది. గత రెండున్నర దశాబ్దాల నా రాజకీయ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేశాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అనేక పర్యాయాలు కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చిన ప్రతిసారి ఎంతో ఆశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించాను. కానీ ప్రతిసారి నిరాశనే ఎదురైంది. దీంతోపాటు నాతోటి బిసి సోదరులైన నేతన్నల సమాజం భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేలా, వారికున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. దేశ చరిత్రలో చేనేతపైన తొలిసారి పన్ను వేసిన కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నా పద్మశాలి సొదరులు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టి జీఎస్టీని భారీగా పెంచే కుట్రలు చేయడం బాధ కలిగిస్తోంది. ఈ నిర్ణయాలతో పూర్వ నల్లగొండలోని వేలాది నేతన్నల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్‌కి ఏ మాత్రం పట్టులేదనే విషయం నాకు పార్టీలో చేరిన కొద్ది కాలానికే అర్థమైంది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎలాంటి మత సంఘర్షణలు, ఆందోళనలు లేకుండా కొనసాగుతున్న ప్రశాంతమైన శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక బీజేపీ నాయకులు ఉద్రేకాలు పెంచేలా మాట్లాడినా, బీజేపీ హైకమాండ్ స్పందించకపోవడం నన్ను ఎంతో కలతకు గురిచేసింది. హిందు సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమే పనిగా పెట్టుకున్న బీజేపీ, ఇప్పటిదాకా ఆధునిక భారత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. దశాబ్దాల ప్లోరైడ్ రక్కసిని తరిమికొట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, మిషన్ భగీరథ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఈ 2016లో ప్రస్తుత బీజేపీ అధ్యక్షులు, అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపి నడ్డా గారు మునుగొడులోని మర్రిగూడలో ప్లోరైడ్ బాధితుల కోసం కట్టిస్తామన్న 300 పడకల ఆసుపత్రికి అతీగతి లేదు. చౌటుప్పల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్లోరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం దండుమల్కాపూర్ లో 8.2 ఏకరాల స్ధలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఇప్పటికీ నయాపైసా రాలేదు. దీంతోపాటు ప్లొరైడ్ భాధితులకు అర్దిక సహాయం చేస్తామన్న హమీలపై బీజేపీ స్పందించకపోవడం నల్లగొండ జిల్లా నాయకునిగా తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.’ అని బీజేపీపే తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. ఇదీ చదవండి: ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి భిక్షమయ్య గుడ్‌బై -
బీజేపీలోకి టీఆర్ఎస్ నేత భిక్షమయ్య గౌడ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ బీజేపీలో చేరుతున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతల సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తరుణ్‌ఛుగ్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భిక్షమయ్యగౌడ్‌కు కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆలేరు ప్రజలకు సేవచేసేందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు భిక్షమయ్య పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు తాను 2018లో టీఆర్ఎస్లో చేరినా అభివృద్ధిలో తనను భాగస్వామిని చేయలేదని, ప్రజల నుంచి తనను వేరు చేసే కుట్ర చేశారని ఒక లేఖ విడుదల చేశారు. -
నా పైనే దాడి చేస్తారా?
సాక్షి, యాదాద్రి: ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ల ప్రచారంలో తలెత్తిన ఘర్షణ వివాదాస్పదమైంది. అసలు ఏం జరిగింది? బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి తన అనుచరులతో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ యాదగిరిగుట్ట మండలంలో చేపట్టిన బైక్ ర్యాలీ మల్లాపురంలో మోత్కుపల్లి ప్రచారానికి ఎదురుపడింది. ఈ సమయంలో ఇరువురు పరస్పరం అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే టవేరా వాహనం మోత్కుపల్లి ప్రచార వాహనాన్ని తాకడంతో అక్కడ వివాదం తలెత్తింది. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు తన ప్రచారాన్ని అడ్డుకుని తనపై దాడి చేశారని మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించారు. నాపై దాడి చేస్తారా అంటూ మోత్కుపల్లి కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకుడు కర్ర వెంకటయ్య తన అనుచరులతో వచ్చి మోత్కుపల్లికి సంఘీభావం తెలిపారు. రాస్తారోకో చేస్తున్న మోత్కుపల్లిని ఆందోళన విరమించాలని యాదగిరిగుట్ట ఏసీపీ మనోహర్‌రెడ్డి కోరారు. భిక్షమయ్యగౌడ్‌ను అరెస్టు చేస్తేనే ఆందోళన విరమిస్తానని భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు మోత్కుపల్లిని అరెస్టు చేసి తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తుర్కపల్లి పీఎస్‌లోనూ మోత్కు పల్లి దీక్ష కొనసాగించారు. భిక్షమయ్యగౌడ్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోత్కుపల్లిపై జరిగిన దాడిని నిరసిస్తూ గోదావరి నదీ జలాల సాధన సమితి బుధవారం ఆలేరు బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ తెలిపారు. దాడి జరగలేదని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ స్పష్టం చేశారు. భిక్షమయ్యను అరెస్ట్ చేయాలి: మోత్కుపల్లి ‘‘ఎన్నికల ప్రచారంలో ఉన్న నాపై దాడికి కారకుడైన భిక్షమయ్యగౌడ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. నాపై కావాలనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ అండ చూసుకుని మల్లాపురంలో ప్రచారాన్ని అడ్డుకున్నారు. నా వాహనాన్ని ఢీ కొట్టారు. చేయి చేసుకున్నారు. నియోజకవర్గంలో నాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భిక్షమ య్యగౌడ్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు’’. ఒప్పందం బయటపడింది: భిక్షమయ్యగౌడ్ ‘‘టీఆర్ఎస్ పార్టీతో మోత్కుపల్లి నర్సింహులు కుదుర్చుకున్న ఒప్పందం బయటపడింది. నా వాహనం మోత్కుపల్లి వాహనానికి తాకినా, నేను ఆయనను తిట్టినట్లు తేలినా రాజకీయాలను వదిలిపెడతా. నేను అనుమతి తీసుకుని బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాను. ప్రచారంలో భాగంగా ఇద్దరం మల్లాపురంలో ఎదురుపడ్డాం.. పరస్పరం అభివాదం చేసుకున్నాం. నాపై ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.’’ భిక్షమయ్యగౌడ్‌పై అట్రాసిటీ కేసు తుర్కపల్లి: మోత్కుపల్లి ఫిర్యాదు మేరకు భిక్షమయ్య గౌడ్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 279, 504, 506, 143 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులు తెలిపారు. దాడిని ఖండిస్తున్నాం: బీఎల్ఎఫ్ సాక్షి,హైదరాబాద్: బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు ప్రచార యాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. -
జలదోపిడీ చేస్తున్న మామాఅల్లుడు
రాజాపేట (ఆలేరు) : తపాసుపల్లి రిజర్వాయర్ ద్వారా మామాఅల్లుడు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు జలదోపిడీకి పాల్ప డుతున్నారని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. సోమవారం తపాసుపల్లి రిజార్వాయర్ నుంచి సిద్దిపేట జిల్లాకు నీటిని తరలిస్తున్న కాల్వను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ, ఆలేరు నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తపాసుపల్లి రిజర్వాయర్‌ను 2004లో ప్రారంభించి 2013 వరకు పూర్తిచేసిందని తెలిపారు. రాజాపేట మండలంలోని పాలెంగండిలోకి తపాసుపల్లి రిజార్వాయర్ నీరు అందించేందుకు అప్పట్లో రూ.4.95కోట్లు నిధులు మంజూరు చేయించామన్నారు. నేటి ప్రభుత్వం ఆ ప్రణాళికను తుంగలో తొక్కిందన్నారు. తపాసుపల్లి ద్వారా ఆలేరుకు వచ్చే జలాలను మంత్రి హరీశ్‌రావు సొంత జిల్లా సిద్దిపేటకు తరలిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఆలేరు ప్రాంత ప్రజలపై ప్రేమలేదని.. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు మార్చుకుని రాజాపేట, ఆలేరు ప్రాంతాలకు తపాసుపల్లి నీరు అందిచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, జనగామ ఉపేందర్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోత్నక్ ప్రమాద్‌కుమార్, తుర్కపల్లి ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్, నాయకులు ఎంఎస్ విజయ్‌కుమార్, నీలం వెకంటస్వామి, భరత్‌గౌడ్, శంకర్‌నాయక్, నాగిర్తి రాజిరెడ్డి, సట్టు తిరుమలేష్, ఎడ్ల బాలలక్ష్మి, నీలం పద్మ, బుడిగె పెంటయ్యగౌడ్, గొల్లపల్లి రాంరెడ్డి, శంకర్‌గౌడ్, సాగర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, సుధాకర్, మల్లేష్‌యాద్, రాంరెడ్డి, విఠల్‌నాయక్, రాంజీ నాయక్, బాలయ్య, యాదేష్, రమేష్, ఇస్తారి, సిద్దులు, ప్రవీణ్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఆలేరు ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మోసం కేసుకు సంబంధించి నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌పై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ పరిధిలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదైంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తానంటూ తనవద్ద రూ.20 లక్షలు లంచం తీసుకున్నారని, వేధింపులకు గురిచేశారని పేర్కొంటూ బాధితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి.పూర్ణచందర్రావు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఎమ్మెల్యేపై చర్యలకు ఆదేశించింది. బాధితుడు పూర్ణచందర్రావు ఆదివారం ఆయా వివరాలను మీడియాకు వివరించారు.