
మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో మరణించినట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు
భువనగిరి: అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన అడవి దున్న ఎట్టకేలకు చిక్కింది. అయితే అది మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడురోజుల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తున్న అడవి దున్నను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు, పశువైద్యాధికారులతో కలిపి 10 బృందాలను ఏర్పాటు చేశారు.
అడవి దున్నకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు వరంగల్ జూపార్క్ నుంచి వైద్యులు కూడా వచ్చారు. శుక్రవారం భువనగిరి మండలం రెడ్డినాయక్ తండా పరిసర ప్రాంతాల్లో అడవి దున్న సంచరిస్తున్నట్లు గుర్తించి వైద్యులు అడవి దున్నకు సమీపంలో నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో భయంతో అడవి దున్న అక్కడ ఉన్న గుట్టల పైన పరుగులు పెట్టి పడిపోయింది.
మత్తుతో ఉన్న దున్నను వాహనంలోకి ఎక్కించే క్రమంలో పరిశీలించగా అది మృతిచెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు రోజుల నుంచి పరుగులు పెడుతున్న అడవి దున్న అప్పటికే అనార్యోగానికి గురికావడంతో పాటు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పరుగులు పెట్టడం వల్ల మృతిచెందినట్లు జిల్లా అటవీశాఖ అధికారి తెలిపింది. అడవి దున్నకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment