
కొందరు ఎవరినైనా తిట్టేటప్పుడు దున్నపోతులా ఉన్నావ్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దున్నపోతు గురించి తెలిస్తే ఇకపై అలాంటి మాట అనరు. ఎందుకంటే ఈ దున్నపోతు ధర, అది తినే తిండి, అంతకు మించి దీని ద్వారా వచ్చే ఆదాయం గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.
ఆ దున్నపోతు ఖరీదు రూ.23 కోట్లు అని చెబితే ఎవరైనా నమ్ముతారా? అవును.. ఇది అక్షరాలా నిజం. అయితే దాని వలన వచ్చే ఆదాయం గురించి తెలిస్తే అంత ధర ఉండటంతో తప్పులేదంటాం. ఇప్పుడు ఆ దున్నపోతు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా దాని యజమాని నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకూ సంపాదిస్తుండటం విశేషం. హర్యానాకు చెందిన ఆ దున్నపోతు పేరు అన్మోల్.
హర్యానాలోని సిర్సాలో ఉంటున్న పల్వీందర్ సింగ్ అనే రైతు ఈ అన్మోల్‌ను పెంచుతున్నాడు. దాని వయసు ఎనిమిదేళ్లు. బరువు 1500 కిలోలు. ఈ దున్నపోతును రూ.23 కోట్లు ఇస్తానన్నా పల్వీందర్ సింగ్ ఎవరికీ అమ్మబోనని తెగేసి చెబుతున్నాడు. ఉత్తరాదిన జరిగే పుష్కర్ మేళా, ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనల్లో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది. దీని భారీ ఆకారం ఎవరినైనా ఇట్టే కంగుతినేలా చేస్తుంది.
ఇక ఈ అన్మోల్ ఎంత తిండి తింటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోకమానరు. ఇది అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు, డ్రైఫ్రూట్స్‌ను తింటుంది. దాని తిండి కోసం యజమాని రోజూ రూ.1,500 ఖర్చు చేస్తుంటాడు. అంటే నెలకు దానిని మేపడానికి రూ.45 వేల వరకు ఖర్చవుతుందన్నమాట. అది ప్రతి రోజూ 250 గ్రాముల బాదాం, నాలుగు కిలోల దానిమ్మలు, 30 అరటిపండ్లు, ఐదు లీటర్ల పాలు, 20 గుడ్లను తింటుంది. వీటితోపాటు అది ఆయిల్ కేక్, పచ్చి గడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నలను కూడా తింటుంది. అన్మోల్ దున్నపోతుకు దాని యజమాని పల్వీందర్ సింగ్ రోజూ స్నానం చేయిస్తుంటాడు. ఇందుకోసం బాదాం నూనె, ఆవ నూనెలను కూడా వినియోగించడం విశేషం.
ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు
Comments
Please login to add a commentAdd a comment