సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ఖరారు అయింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ పత్రాల దాఖలులో గుత్తాకు సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. గుత్తా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటనతో నల్లగొండ జిల్లాకు మరో ఎమ్మెల్సీ పదవి వరించినట్లు అయింది.
ఇప్పటికే జిల్లా నుంచి నేతి విద్యాసాగర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ప్రస్తుతం ఆయన శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ తేరా చిన్నపరెడ్డి విజయం సాధిం చారు. అంతకుముందు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా, ఆయన మండలిలో ప్రభుత్వ విప్ పదవిలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఒక స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవడం లాంఛనమేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి.. టీఆర్‌ఎస్‌లోకి
కాంగ్రెస్ నుంచి.. టీఆర్‌ఎస్‌లోకి
నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్‌నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం లో టీఆర్‌ఎస్ గూటికి చేరారు. 2014 సార్వత్రిక ఎ న్నికల్లో, తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తొలి ఎన్నికల్లో పదిహేడు ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించగా.. అందులో నల్లగొండ ఒకటి. టీఆర్‌ఎస్ గాలిని తట్టుకుని కాంగ్రెస్‌నుంచి విజయం సాధించిన ఆయన రాజకీయ పునరేకీకరణ పేర టీఆర్‌ఎస్ చేపట్టి ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గులాబీ పార్టీకి చేరువయ్యారు.
ఆయన తనతోపాటు మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండిన ఎన్.భాస్కర్‌రావు, సీపీఐ నుంచి దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రకుమార్‌లను కూడా టీఆర్‌ఎస్‌లోకి తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించిన గుత్తాకు చివరి వరకూ ఆ అవకాశమే దక్కలేదు. కానీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి మాత్రం దక్కింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కానీ, ఆయన ఎక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నించలేదు. ఎమ్మెల్సీ పదవిపైనే ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఖాళీ కావడం, నోటిఫికేషన్ కూడా వెలువడడంతో పాటు గుత్తా పేరు ఖరారు కావడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment