ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ కేసులో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఈ యువ టెక్ పరిశోధకుడి మృతిపై మిస్టరీ వీడడం లేదు. ఓపక్క అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు ప్రకటించగా.. మరోవైపు తల్లిదండ్రులు బాలాజీ రమణమూర్తి, పూర్ణిమరావ్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అది హత్యేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘రెండో అటాప్సీ రిపోర్ట్‌ను మేం చదివాం. తలకు గాయంతో మా అబ్బాయి విలవిలలాడిపోయినట్లు సంకేతాలున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అందులో మరిన్ని వివరాలు అది హత్య అనే చెప్తున్నాయి’’ అని తల్లి పూర్ణిమరావ్ అంటున్నారు.
.. ‘‘ఏఐ ఇండస్ట్రీలో టాప్-10 వ్యక్తుల్లో నా బిడ్డ ఉంటాడు. అలాంటివాడు ఓపెన్‌ఏఐ(OpenAI) కంపెనీని.. ఉన్నపళంగా ఎందుకు ఏఐ ఇండస్ట్రీని వదిలేస్తాడు. న్యూరా సైన్స్, మెషిన్‌లెర్నింగ్ వైపు ఎందుకు మళ్లాలనుకుంటాడు?. ఓపెన్‌ఏఐ మా అబ్బాయిని అణచివేసి ఉండొచ్చు.. బెదిరించి ఉండొచ్చు.. అనేదే మా అనుమానం’’ అని పూర్ణిమ చెబుతున్నారు .
‘‘లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మిత్రుడి పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగి వచ్చినట్లు మా వాడు చెప్పాడు. వచ్చే నెలలో లాస్ వెగాస్ టెక్ షోలో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు అని తండ్రి రమణమూర్తి బాలాజీతో జరిగిన చివరి సంభాషణను వివరించారు. వాడెంతో సంతోషంగా ఉన్నాడు. అలాంటివాడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
సుచీర్ కెరీర్ ఎంపిక విషయంలో ఏనాడూ మేం అడ్డు చెప్పలేదు. వాడి పరిశోధనలకు ఏఐ ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించాం. ఏఐ మానవాళికి మేలు చేస్తుందనుకుంటే.. అది మరింత ప్రమాదకారిగా మారబోతుందని సుచీర్ గుర్తించాడు. చాట్‌జీపీటీ లోపాలను ఎత్తి చూపాడు. కళాకారుల, జర్నలిస్టుల శ్రమను దోపిడీ చేయడం అనైతిక చర్యగా భావించాడు. వాడి పోరాటం ఓపెన్‌ఏఐకి వ్యతిరేకంగా జరిగింది కాదు. కేవలం మానవత్వానికి మద్దతుగా నిలిచాడు. అందుకే వాడి అభిప్రాయంతో మేం ఏకీభవించాం.
.. కానీ, ఏదో జరిగింది. మా దగ్గర శవపరీక్ష నివేదిక ఉంది. అందులో బలవనర్మణం కాదని స్పష్టంగా ఉంది. ఇక తెలుసుకోవాల్సింది.. దీనికి కారకులెవరు? ఎందుకు చేశారనే?.. మా అబ్బాయి మృతిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరగాలి. ఇప్పటికే ఇక్కడి భారత అధికారులను కలిశాం. ఈ విషయంలో భారత ప్రభుత్వ మద్దతు కోరుతున్నాం. ఇక్కడ బలైంది నా బిడ్డ మాత్రమే కాదు. ఓ మేధావి జీవితం అర్ధాంతంగా ముగిసింది. టెక్ ఇండస్ట్రీ ఓ విలువైన జీవితం పొగొట్టుకుంది. ఓపెన్ ఏఐ ఇప్పుడు మాకు మద్దతుగా నిలుస్తాని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది’’ అని సుచీర్ పేరెంట్స్ ప్రకటించారు.
కార్నిఫోలియా ఎన్నారై దంపతులు బాలాజీ రమణమూర్తి-పూర్ణిమలకు సుచీర్ బాలాజీ(Suchir Balaji) జన్మించాడు. బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్‌ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే కిందటి ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాను ఓపెన్‌ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడు. డాటా కలెక్షన్ కోసం ఓపెన్‌ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్‌జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్‌ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్‌ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. అయితే సుచీర్ ఎత్తిచూపిన లోపాలను తాము ఇదివరకే సవరించామని ఓపెన్‌ఏఐ ప్రకటించుకుంది.
మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో నవంబర్ 26వ తేదీన సుచీర్ శవమై కనిపించాడు. అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. తమ ప్రాథమిక విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ అతని పేరెంట్స్‌తో పాటు పలువురు బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే ఇంతకు ముందు.. ఇలాన్ మస్క్(Elon Musk)కు సైతంసుచీర్ బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొసమెరుపు ఏంటంటే.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-శామ్ అల్ట్‌మన్ కలిసి ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్‌ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. అప్పటి నుంచి ఇలాన్ మస్క్‌కు ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు వైరం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment