జుకర్‌బర్గ్, లూయిస్ బార్‌క్లే, ఫ్రాన్సెస్ హౌగెన్ (ఎడమ నుంచి)
సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ కంపెనీలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యూజర్ భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తోందని సోషల్ మీడియా దిగ్గజ కంపెనీపై మాజీ ఉద్యోగి ఒకరు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరోపణలకు సంబంధించిన రుజువు పత్రాలతో సైతం ఆమె మీడియా ముందుకు సైతం వచ్చారు.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక దిద్దుబాటు చర్యలకు దిగింది ఫేస్‌బుక్. కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల కదలికలపై నిఘా పెంచింది. బ్లాక్ షీప్స్ లిస్ట్ తయారు చేసి.. అనుమానం ఉన్నవాళ్లపై వేటుకి సిద్ధమైంది. ఈ తరుణంలో న్యూస్ ఫీడ్‌ను డిలీట్ చేసే యాప్‌ను కనిపెట్టినందుకు ఓ డెవలపర్‌పై శాశ్వత నిషేధం విధించింది. యూకేకు చెందిన లూయిస్ బార్‌క్లే అనే డెవలపర్.. ‘అన్‌ఫాలో ఎవ్రీథింగ్’ అనే బ్రౌజర్ ద్వారా ఆటోమేటిక్‌గా ఫ్రెండ్‌లిస్ట్‌ను, పేజీలకు అన్‌ఫాలో అయ్యే వెసులుబాటు అందిస్తోంది. అంతేకాదు న్యూస్ ఫీడ్‌ను సైతం ఖాళీ చేసేస్తోంది.
అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని లూయిస్ ఖండిస్తున్నాడు. ఇది కేవలం ఎక్స్‌టెన్షన్ సర్వీస్ మాత్రమేనని, అన్‌ఫాలోకి సంబంధించింది ఏమాత్రం కాదని, న్యూస్‌ఫీడ్ క్లియరెన్స్ వల్ల యూజర్ మానసిక స్థితి మెరుగుపడడంతో పాటు(పదే పదే ఫేస్‌బుక్‌లో గడిపే పని తగ్గుతుంది), కుటుంబంతో సంతోషంగా గడుపుతారని చెప్తున్నాడు. అయినప్పటికీ ఫేస్‌బుక్ ఈ వివరణతో సంతృప్తి చెందలేదు. బార్‌క్లేను ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థ అయిన ఇన్‌స్టాగ్రామ్ నుంచి శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈ వేటు వెనుక.. ఫ్రాన్సెస్ హౌగెన్‌కు బార్‌క్లే అందించిన సాయమే కారణం అయ్యి ఉండొచ్చన్న! అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉద్యోగులను బతిమాలుతూ..
ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్, విజిల్‌బ్లోయ(వ)ర్‌గా మారిపోయి.. ఫేస్‌బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆపై ఈ పంచాయితీ అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్) దగ్గరికి చేరింది. ఈ క్రమంలో ఫేస్‌బుక్ గురించి పాజిటివ్ ప్రచారం చేయాలని ఉద్యోగులను బతిమాలుతోంది యాజమాన్యం. ఆరోపణల్ని ఖండించడం, ఫేస్‌బుక్ గురించి ఇంట్లోవాళ్లతో, ఇతరులతో మంచిగా చెప్పడం లాంటివి చేయాలంటూ క్లాసులు తీసుకుంటోంది. ఇక కిందిస్థాయి ఉద్యోగులకు ఈ అంశాలతో కూడిన మెమోలను ఉద్యోగులకు జారీ చేసిందని ది టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హౌగెన్‌ను ఎవరూ విమర్శించకూడదనే కఠిన ఆదేశాలు ఉద్యోగులకు జారీ చేసిందట.
ఆమెను కలవనున్న బోర్డ్
ఫేస్ బుక్ మీద సంచలన ఆరోపణలతో ప్రపంచం ముందుకు వచ్చారు మాజీ ప్రొడక్ట్ ఇంజినీర్ ఫ్రాన్సెస్ హౌగెన్. ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్‌లైన్’ పేరిట ఆమె సమర్పించిన నివేదిక ఓ ప్రముఖ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌తో టీనేజర్ల మానసిక స్థితి ఎంత దారుణంగా దెబ్బతింటుందో అనే విషయంతో పాటు వివిధ దేశాల్లో రకరకాల రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ విభాగాల ప్రయోజనాల కోసం ఫేస్‌బుక్ ఏ విధంగా పని చేసిందనే విషయాల్ని సైతం అందులో క్షుణ్ణంగా వివరించినట్లు చెబుతున్నారామె. ఈ తరుణంలో వ్యక్తిగత భద్రత కోసం ఆమె సెనెటర్లను సైతం ఆశ్రయించారు. అయితే ఆమె ఆరోపణలను బహిరంగంగా ఖండించిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.. ఇప్పుడు రాజీ కోసం ప్రయత్నిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఫేస్‌బుక్ కంపెనీలో స్వతంత్ర్య దర్యాప్తు సంస్థగా పేరున్న ఓవర్‌సైట్ బోర్డ్.. త్వరలో ఫ్రాన్సెస్ హౌగెన్‌ను స్వయంగా కలవబోతుందట. తద్వారా ఆరోపణలపై నిజనిర్ధారణ చేయనున్నట్లు సోమవారం ఒక ప్రకటన చేసింది బోర్డు. అయితే ఇదంతా రాజీ చర్యల్లో భాగమేనని ది టైమ్స్ అనుమానం వ్యక్తం చేస్తూ మరో కథనం ప్రచురించింది.
చదవండి: TIME Cover Ft. Zuckerberg: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా?
చదవండి: పైసల కోసమే ఫేస్‌బుక్ కక్కుర్తి!
చదవండి: నవంబర్ 10న.. ఏం జరగబోతోంది?
Comments
Please login to add a commentAdd a comment