కశ్మీర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌! | tension situation in jammu kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌!

Published Mon, Aug 5 2019 4:08 AM | Last Updated on Mon, Aug 5 2019 10:32 AM

tension situation in jammu kashmir - Sakshi

ఫరూక్‌ అబ్దుల్లా నివాసంలో అఖిలపక్ష భేటీకి హాజరైన మెహబూబా ముఫ్తీ, ఒమర్, ఇతర నేతలు

శ్రీనగర్‌/జమ్మూ/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం ఆదివారం నాటికి మరింత ముదిరింది. ఉగ్రవాదులు దాడిచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో శ్రీనగర్‌ను వీడాలని రాష్ట్ర క్రికెట్‌ జట్టు కోచ్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను అధికారులు ఆదేశించారు. అదే సమయంలో జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్‌ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ) పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా ఇంట్లో సమావేశమైన అఖిలపక్ష నేతలు పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్‌లకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వం చేసేందుకు ఇదే సరైన సమయమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్‌ కశ్మీర్‌పై ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలుచెప్పాయి.

కలసికట్టుగా పోరాడుతాం: అఖిలపక్షం
కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ) అధినేత ఫరూక్‌ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్, జేఅండ్‌కే మూవ్‌మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అనిశ్చితిని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు వివరించేందుకు వీలుగా ఓ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని నేతలు నిర్ణయించారు.

ఈ విషయమై ఫరూక్‌ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్‌ 35 ఏ, ఆర్టికల్‌ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దుచేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్‌ ప్రజలపై దాడిచేయడమే. ఈ విషయంలో పరిస్థితులు మరింత దిగజారేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్‌లకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం’ అని చెప్పారు.

మరోవైపు పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నోటీసులు జారీచేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్‌ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎవరి పేరునైనా మౌఖికంగా లేదా ఇతర మార్గాల్లో సిఫార్సు చేశారో, లేదో చెప్పాలని కోరింది. దీంతో ప్రజల్ని ఏకంచేయకుండా ప్రధాన రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనీ, ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవని ముఫ్తీ స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్న నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఇంట్లోంచి బయటకు రాకూడదని పోలీసులు ఆదేశించారు. కాంగ్రెస్‌ నేత ఉస్మాన్‌ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామిలను అరెస్ట్‌ చేశారు.

జమ్మూలోనూ బలగాల మోహరింపు..
జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాల మోహరింపుతో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతోంది. ఉగ్రముప్పు నేపథ్యంలో కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్‌ ప్రధాన కార్యాలయం, విమానాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను ఆదివారం కట్టుదిట్టం చేశారు. అలాగే జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్‌ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను భారీగా మోహరించారు.

ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. కశ్మీర్‌లో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న భయంతో స్థానికులు నిత్యావసర సరుకులు, పెట్రోల్‌ కొనేందుకు షాపుల ముందు భారీ సంఖ్యలో బారులుతీరారు. మరోవైపు పుల్వామా తరహాలో ఉగ్రవాదులు వాహనాలతో ఆత్మాహుతిదాడికి పాల్పడకుండా ఉండేందుకు  భద్రతాబలగాలు రోడ్లపై చాలాచోట్ల బారికేడ్లను ఏర్పాటుచేశాయి. యాజమాన్యం ఆదేశాలతో నిట్‌–శ్రీనగర్‌ విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు.

అమిత్‌ షా–దోవల్‌ కీలక భేటీ..
జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చితి, భారత్‌లో చొరబాటుకు యత్నించిన 5–7 మంది పాక్‌ బ్యాట్‌ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలుజరిపారు. మరోవైపు జమ్మూ, ఉధమ్‌పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్‌నాథ్‌ యాత్రికులు రిజర్వేషన్‌ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయరాదని కార్గిల్‌ కలెక్టర్‌ ఆదేశించారు.

దీటుగా బదులిస్తాం: పాక్‌

భారత్‌ ఎలాంటి దుస్సాహసానికి, దురాక్రమణకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పాకిస్తాన్‌ హెచ్చరించింది. కశ్మీరీలకు తమ దౌత్య, నైతిక, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి రక్షణ మంత్రి పర్వేజ్‌ ఖట్టక్, విదేశాంగమంత్రి ఖురేషీ, త్రివిధ దళాధిపతులు, ఐఎస్‌ఐ చీఫ్‌ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌ హాజరయ్యారు.

ఈ భేటీ అనంతరం పాక్‌ స్పందిస్తూ..‘భారత్‌ చర్యల కారణంగా ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతుంది. కశ్మీర్‌ అన్నది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యే. కశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని పరిష్కరించాలని భారత్‌ను కోరుతున్నాం. తాజాగా బలగాల మోహరింపుతో కశ్మీర్‌లో పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది’ అని హెచ్చరించింది.  ట్రంప్‌ కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని చెప్పారనీ, అందుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు.

జమ్మూలో హైదరాబాద్‌ రైలు ఎక్కుతున్న విద్యార్థులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement