తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిపై చర్చించేందుకు కేరళ ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సెప్టెంబర్ 28న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరిస్తూ రివ్యూ పిటిషన్లను జనవరి 22న విచారించాలని తీసుకున్న నిర్ణయంపై అఖిలపక్ష భేటీ లో చర్చించారు. సుప్రీం ఉత్తర్వులను అమలు చేసేందుకు కాలపరిమితి కోరాలని, అప్పటివరకూ శాంతిభద్రతలను సక్రమంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని విపక్షాలు సూచించాయి.
మరోవైపు ఈనెల 17 నుంచి వార్షిక మండల దీక్ష సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపైనా అఖిలపక్ష సమావేశంలో చర్చించారు. కాగా అక్టోబర్‌లో ఐదురోజులు, ఈనెల ఆరంభంలో రెండు రోజుల పాటు పూజల కోసం శబరిమల ఆలయం తెరిచిన క్రమంలో సుప్రీం ఉత్తర్వులపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనలకు సంబంధించి ఇప్పటివరకూ 3700 మందిని అరెస్ట్ చేయగా, పలువురిపై 546 కేసులు నమోదయ్యాయి. ఇక శబరిమల దర్శనం కోసం కేరళ పోలీస్ వెబ్‌సైట్‌లో 500 మంది యువతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment