కేంద్ర హోంశాఖ, కేరళ, బెంగాల్ గవర్నర్ల కార్యదర్శులకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: కేరళ, పశి్చమ బెంగాల్ శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు అంగీకారం తెలియజేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గవర్నర్ల వైఖరిని సవాలు చేస్తూ కేరళ, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
కేంద్ర హోం శాఖకు, కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, బెంగాల్ గవర్నర్ ఆనందబోసు కార్యదర్శులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. బిల్లులను ఎందుకు పెండింగ్‌లో కొనసాగిస్తున్నారో మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పిటిషన్‌లో కేంద్ర హోంశాఖను సైతం ఒక పార్టీగా చేర్చాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. తమ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ అంగీకారం తెలియజేయడం లేదంటూ కేరళ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment