తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం లక్ష మందికిపైగానే తరలివస్తున్నారు. అయ్యప్ప దర్శనానికి దాదాపు 12 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది. దర్శనం కోసం సోమవారం ఒక్కరోజే 1,19,480 మంది ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో కలిసి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
శబరిమలలో భక్తుల రాక, దర్శనం ఏర్పాట్లపై చర్చించారు. పార్కింగ్ సదుపాయాలు పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీగా తరలివస్తున్న భక్తులను నియంత్రించడం కష్టతరంగా మారడంతో వారి సంఖ్యపై పరిమితి విధించాలని, ప్రతిరోజూ గరిష్టంగా 90,000 మందిని మాత్రమే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే దర్శన సమయాన్ని మరో గంటపాటు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
హైకోర్టు ఆదేశాలతో..
భక్తుల రద్దీ నియంత్రణకు సంబంధించి కేరళ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై న్యాయస్థానం ఆదివారం సమావేశమై, విచారణ చేపట్టింది. రద్దీని నియంత్రించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పత్తనంతిట్ట జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించింది. నిత్యం 75,000 మందికిపైగా భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో భక్తుల సంఖ్యను 90,000కు పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెల్లవారుఝాము నుంచే..
అయ్యప్ప స్వామిని నిత్యం 90,000 మంది సులువుగా దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు ట్రావెన్‌కోర్ దేవాస్వోమ్ బోర్డ్(టీడీబీ) చైర్మన్ కె.అనంతగోపన్ చెప్పారు. దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు స్వామిని భక్తులు దర్శించుకోవచ్చని చెప్పారు. ఇదిలా ఉండగా, శబరి దేవస్థానంలో నవంబర్ 17న ప్రారంభమైన 41 రోజుల మండల పూజ ఈ నెల 27న ముగియనుంది. అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు యాత్ర కోసం ఈ నెల 30న ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. 2023 జనవరి 14న మకర జ్యోతి దర్శనంతో మకరవిళక్కు యాత్ర ముగుస్తుంది. పూజలు పూర్తయ్యాక జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment