ఆదివారం జరిగఅఖిలపక్ష సమావేశంలో మోదీ, మంత్రులు అనంత్ కుమార్, రాజ్‌నాథ్, జైట్లీ
న్యూఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం కోసం సాధ్యమైనంత కృషి చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ఏకాభిప్రాయం కోసం వివిధ పార్టీలతో చర్చిస్తామంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం పార్లమెంట్ హౌస్‌లో ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించింది. బడ్జెట్ సమావేశాలు విజయవంతమయ్యేలా ప్రతిపక్షాలు సహకరించాలని అన్ని పార్టీలను కోరింది. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, అనంత కుమార్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, సింధియా, ములాయం సింగ్ యాదవ్ (సమాజ్‌వాదీ), డి.రాజా(సీపీఐ), కనిమొళి(డీఎంకే), డెరెక్ ఒబ్రియాన్(తృణ మూల్), తారిక్ అన్వర్ (ఎన్సీపీ) తదితరులు పాల్గొన్నారు.
భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘సమావేశం ఫలవంతంగా సాగింది. బడ్జెట్ సమావేశాల్ని విజయవంతం చేయాలని అన్ని పార్టీల నేతలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్టీలు లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదే సమయంలో నిర్మాణాత్మక చర్చ జరిగేలా సహకరించాలని ప్రధాని కోరారు. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి వీలైనంత మేర ప్రయత్నిస్తాం.
అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో జీఎస్టీ ఆమోదం పొందినట్లే.. ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఆమోదం పొందుతుంది’ అని చెప్పారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ప్రశ్నించగా.. ‘బిల్లు ఇప్పుడు రాజ్యసభ ఆస్తి. సభే నిర్ణయం తీసుకుంటుంది’ అని సమాధానమిచ్చారు. పార్లమెంటరీ కమిటీల వ్యవస్థను బలోపేతం చేయాలని, జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై స్టాండింగ్ కమిటీలు వాస్తవిక పరిష్కారాలు సూచించాలని పార్టీలకు ప్రధాని సూచించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల నేతలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం రాత్రి విందు సమావేశం ఏర్పాటు చేశారు. సభలో సహకారం ఉంటుందని నేతలు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.
అత్యాచారాలు, వర్తకుల దుస్థితిపై నిలదీస్తాం
మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. అత్యాచార సంఘటనలు, మహిళలపై అకృత్యాలు, రాజ్యాంగ సంస్థలపై దాడులు, వర్తకుల దుస్థితితో పాటు ఉత్తర ప్రదేశ్‌లో మత ఘర్షణలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ చెప్పారు. ఈ అంశాల్ని లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించాలని, సభలో సహకార ధోరణితో వ్యవహరించాలని ఆయన కోరారు. పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై వ్యూహరచన కోసం ప్రతిపక్ష పార్టీల నేతలు నేడు సమావేశం కానున్నారు. ఇక అదే ఎజెండాతో ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక వర్గ భేటీ కూడా జరగనుంది.
ఫిబ్రవరి 9 వరకూ తొలి దశ సమావేశాలు
బడ్జెట్ సమావేశాల తొలిరోజైన నేడు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. అనంతరం ప్రభుత్వం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది. ఎన్డీఏ సర్కారు చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న జైట్లీ పార్లమెంటులో ప్రవేశ పెడతారు. తొలిదశ సమావేశాలు ఫిబ్రవరి 9తో ముగుస్తాయి. మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకూ మలిదశ సమావేశాలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment