ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్, యూపీఏ పాలనపై ప్రధాని నరేంద్ర నిప్పులు చెరిగారు. రాజకీయ స్వలాభం కోసమే దేశాన్ని ముక్కలు ముక్కలు చేశారని.. ప్రధాని తీవ్రంగా విమర్శించారు. బ్యాంకులపై ఎన్‌పీఏల రూపంలో కాంగ్రెస్ చేసిన పాపాల ప్రభావాన్ని ఇప్పటికీ దేశం అనుభవిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామన్నారు. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ పిలుపునిచ్చింది మోదీ కాదని.. మహాత్మాగాంధీయేనన్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు.
ఓ కుటుంబ సేవలో..
‘భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత.. స్వేచ్ఛావాయువులు పీల్చిన పలు దేశాలు అభివృద్ధిలో మనకన్నా వేగంగా ముందుకెళ్తున్నాయి. మనమింకా వెనుకబడే ఉన్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి తల్లి భారతిని ముక్కలు ముక్కలు చేశారు. అయినా.. మొదట్నుంచీ దేశం మీ వెంటే ఉంది. 4–5 దశాబ్దాల వరకు నామమాత్రమైన విపక్షం.. మీడియా ప్రభావం లేకపోవటం వంటివి మీకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. ఇంత స్వేచ్ఛ ఉన్న సమయంలోనూ మీరు చేసిందేంటి? దేశ సౌభాగ్యం, అభివృద్ధిని విస్మరించి.. ఒక కుటుంబం సేవలో తరించటంలోనే సమయాన్ని వ్యర్థం చేశారు’ అని పేర్కొన్నారు.
మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది?
ఆగస్టు 15, 1947 తర్వాతే దేశంలో ప్రజాస్వామ్యమనే పదం తెలిసిందని.. అంతకుముందు దేశానికి అస్తిత్వమే లేదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూలే దేశానికి ప్రజాస్వామ్యం తెచ్చారనటంలో అర్థం లేదన్నారు. ‘మన దేశంలో బౌద్ధమతం విరాజిల్లుతున్న సమయంలోనే ప్రజాస్వామ్యం విరాజిల్లింది. కర్ణాటకలో 12వ శతాబ్దంలోనే జగద్గురు బసవేశ్వరుడు ప్రజాస్వామ్యాన్ని అమలుచేశారు’ అని తెలిపారు. జహంగీర్ స్థానంలో షాజహాన్.. ఆయన స్థానంలో ఔరంగజేబ్ ఇలా పారంపర్యంగా పగ్గాలందినట్లే.. కాంగ్రెస్ పార్టీకీ గాంధీ కుటుంబానికే అధ్యక్ష బాధ్యతలు అందుతాయని.. ఎన్నికలంటూ ఉండవని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలనూ ప్రధాని గుర్తుచేశారు.
పటేల్ ప్రధాని అయ్యుంటే!
స్వాతంత్య్రం వచ్చాక అప్పటికి దేశవ్యాప్తంగా ఉన్న 15 కాంగ్రెస్ కమిటీల్లో 12 కమిటీలు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రధాని చేయాలని ఓటేశారని మోదీ తెలిపారు. అయినా పటేల్‌ను పక్కనపెట్టి నెహ్రూకు పగ్గాలు కట్టబెట్టిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ఒకవేళ పటేల్ తొలి ప్రధాని అయ్యుంటే ఇవాళ కశ్మీర్‌సమస్యే ఉండేది కాదని.. భారత్‌లో అంతర్భాగమై ప్రశాంతంగా ఉండేదని మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ సార్లు ఆర్టికల్ 365ను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందన్నారు. యూపీఏ హయాంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ పదాధికారి ఒకరు (పరోక్షంగా రాహుల్ గాంధీని సంబోధిస్తూ) మీడియా సాక్షిగా చించేయటమే ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.
చెప్పింది చేసి చూపిస్తాం
2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త పనిసంస్కృతిని తీసుకొచ్చిందని ప్రధాని తెలిపారు. ‘మాటలు చెప్పటం, ప్రధాన శీర్షికల్లో వార్తలు వేయించుకోవటం మా ఉద్దేశం కాదు. ప్రజలను మభ్యపెట్టకుండా చేతుల్లోకి తీసుకున్న పనిని పూర్తిచేయటమే మా లక్ష్యం. దేశానికి నష్టం చేసే వారెవరైనా.. ఏ పనైనా దార్లోపెట్టి ప్రజాసంక్షేమం కోసం నడిపిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. దేశంలో మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేస్తున్న పథకాలు, పనుల అమలుతీరును ఆయన వెల్లడించారు. ‘దేశంలో అతిపెద్ద సొరంగం, అతిపెద్ద గ్యాస్‌పైప్‌లైన్. అతిపెద్ద సముద్రపు రైలు, వేగవంతమైన రైలు మేం తీసుకొస్తున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు.
నాడు అనుమానాలు.. నేడు విమర్శలా?
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆధార్ వ్యవస్థను రద్దుచేస్తారంటూ కాంగ్రెస్ విషప్రచారం చేసిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం ఆధార్ సాంకేతికతను సరిగ్గా వినియోగించుకుంటుండటం వల్ల విపక్షాలు అసహనంతో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి నలుగురు మాజీ సీఎంలు అవినీతి కేసుల్లో జైలుకెళ్లారన్నారు. దేశాన్ని లూటీ చేసిన వారంతా.. దోచుకున్నది తిరిగివ్వాల్సిందేనని ఈ ప్రయత్నంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నిరర్థక ఆస్తులపై ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. అసలు కాంగ్రెస్ హయాంలో చేసిన పాపాల ఫలితాన్నే ఇప్పటికీ దేశం అనుభవిస్తోందన్నారు.
రండి కలసి పనిచేద్దాం:
రాజ్యసభలోనూ కాంగ్రెస్ తీరుపై మోదీ నిప్పులు చెరిగారు. ఆత్యయిక పరిస్థితి, బోఫోర్స్, హెలికాప్టర్ కుంభకోణాలు, సిక్కులపై హింస వంటివున్న పాత భారతాన్ని కాంగ్రెస్ కోరుకుంటోందని.. కానీ తమ ప్రభుత్వం ‘నవభారత’ నిర్మాణానికి కృషిచేస్తోందన్నారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదాన్ని తీసుకొచ్చింది మహాత్మాగాంధీయేనని మోదీ పేర్కొన్నారు. విపక్షాలు ఓబీసీ, ట్రిపుల్ తలాక్ బిల్లులకు మద్దతివ్వాలని ఆయన కోరారు. పార్లమెంటు, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపైనా నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment