సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే | Rajya Sabha passes two farm bills by voice vote | Sakshi
Sakshi News home page

సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే

Published Mon, Sep 21 2020 4:35 AM | Last Updated on Mon, Sep 21 2020 9:31 AM

Rajya Sabha passes two farm bills by voice vote - Sakshi

రూల్‌బుక్‌ను చించేందుకు ప్రయత్నిస్తున్న టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్‌

న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల తీవ్ర ఆగ్రహావేశాల మధ్య మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెండు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందాయి. ఈ బిల్లులు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం దాలుస్తాయి. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ కాంగ్రెస్‌ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కోవిడ్‌–19 నిబంధనలను పట్టించుకోకుండా పోడియంను చుట్టుముట్టారు. నినాదాలతో సభను హోరెత్తించారు. డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌పై దాడి చేసినంత పని చేశారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపడానికి ఉద్దేశించిన తీర్మానంపై ఓటింగ్‌ జరపాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో, ఆగ్రహంతో ఆయన  ముఖంపైకి నిబంధనల పుస్తకాన్ని విసిరారు. మరికొన్ని అధికారిక పత్రాలను చించి, విసిరారు. ఆయన ముందున్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు విఫలయత్నం చేశా రు. ఈ గందరగోళం మధ్య సభ కొద్దిసేపు వాయి దా పడింది. ఆ తరువాత ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహం, సులభతరం)’ బిల్లు, రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లులను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.  

సభా సంఘానికి పంపించాలంటూ..
ఈ బిల్లుల ఆమోదం కోసం ముందుగా పేర్కొన్న సమయం కన్నా ఎక్కువ సేపు సభ జరిగింది. ఈ సమయంలో, బిల్లులను వ్యతిరేకిస్తూ పలు డిమాండ్లను, తీర్మానాలను ప్రతిపక్ష సభ్యులు సభ ముందుకు తీసుకువచ్చారు. చర్చపై వ్యవసాయ మంత్రి సమాధానాన్ని సోమవారానికి వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి కీలక బిల్లుల ఆమోదం ఏకగ్రీవంగా జరగాలన్నారు. ఉపసభాపతి స్థానం వద్దకు వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. విపక్షం తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతుండటంతో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చర్చకు తానివ్వాల్సిన జవాబును కుదించుకుని, క్లుప్తంగా ముగించారు. క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు ఈ రెండు బిల్లులను సభా సంఘాలకు పంపాలన్న విపక్షం తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ తిరస్కరించింది. అయితే, దీనిపై డివిజన్‌ ఓటింగ్‌ జరగాలని కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, డీఎంకే సభ్యులు పట్టుబట్టారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే డివిజన్‌ ఓటింగ్‌ సాధ్యమవుతుందని పేర్కొంటూ, వారి డిమాండ్‌ను డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ తోసిపుచ్చారు.

దాంతో, టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్‌ ఆగ్రహంతో డిప్యూటీ చైర్మన్‌ స్థానం వద్దకు దూసుకువెళ్లారు. రూల్‌ బుక్‌ను ఆయన ముఖంపై విసిరేశారు. అక్కడే ఉన్న మార్షల్స్‌ అది డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌కు తగలకుండా జాగ్రత్తపడ్డారు. ఆయన వైపు దూసుకువచ్చిన మరో పుస్తకం కూడా తగలకుండా చూశారు. మరోవైపు, సభాపతి స్థానం వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్‌ అడ్డుకున్నారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని తీర్మానాలను ప్రతిపాదించిన డీఎంకే సభ్యుడు తిరుచి శివ, టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్, కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్, సీపీఎం సభ్యుడు కేకే రాగేశ్‌.. తదితరులు బిల్లు పేపర్లను చింపి గాల్లోకి విసిరేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను డిప్యూటీ చైర్మన్‌ పావుగంట పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ సమావేశమైన తరువాత.. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఈ బిల్లులను మూజువాణి ఓటింగ్‌కు పెట్టారు.

తొలి బిల్లు ఆమోదం పొంది, విపక్ష తీర్మానాలు వీగిపోయిన సమయంలో ఇద్దరు విపక్ష సభ్యులు రాజ్యసభ ఆఫీసర్స్‌ టేబుల్స్‌పై ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. ఆ తరువాత రెండో బిల్లు కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. విపక్ష తీర్మానాలు వీగిపోయాయి. ఈ బిల్లులకు జేడీయూ, వైఎస్సార్సీపీ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, టీఆర్‌ఎస్, ఆప్‌.. తదితర విపక్ష పార్టీలతో పాటు ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించింది. బిల్లులపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పుబట్టారు. రైతులకు మరణ శాసనం వంటి ఈ బిల్లులను తాము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నం ఇదని ఆరోపించింది.


ప్రతిపక్షం తీరు సిగ్గుచేటు: రాజ్‌నాథ్‌
రాజ్యసభలో రైతు బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సిగ్గుచేట ని, పార్లమెంట్‌ చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. రైతు బిల్లులను సభ ఆమోదించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో సభ్యుల ఇలాంటి ప్రవర్తను, ఘటనలను ఊహించలేమన్నారు. సభాధ్యక్షుని నిర్ణయంతో ఏకీభవించని నేతలు ఆయనపై దాడికి ప్రయత్నించడం, హింసాత్మక చర్యలకు పూనుకో వడాన్ని అనుమతించబోమన్నారు.

ఎంఎస్పీపై అనుమానాలొద్దు: ప్రభుత్వం
విపక్షాలు ఆందోళన చెందుతున్నట్లుగా.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానాన్ని తొలగించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని నరేంద్రసింగ్‌ తోమర్‌ స్పష్టం చేశారు. ఎంఎస్పీ విధానం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా తాము కోరుకున్న ధరకు అమ్ముకునే వీలు కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఎప్పట్లాగానే కొనసాగుతుందన్నారు. కాంట్రాక్ట్‌ వ్యవసాయంతో రైతులకు తమ ఉత్పత్తులను తమకు నచ్చిన ధరకు అమ్ముకునే వెసులుబాటు లభిస్తుందని వివరించారు. బిల్లులో తాము పేర్కొన్న అంశాలను కాంగ్రెస్‌ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రతిపాదించిందని గుర్తు చేశారు. వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా, తమకు నచ్చిన ధరకు ఎక్కడైనా ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్య(ప్రోత్సాహ, సులభతరం)’ బిల్లు ద్వారా లభిస్తుందన్నారు. రైతులపై సెస్, చార్జీలు ఉండబోవన్నారు. అలాగే,  రైతులు వ్యవసాయాధారిత సంస్థలు, కంపెనీలు, ఎగుమతిదారులతో తమ ఉత్పత్తులను ముందే కుదుర్చుకున్న ధరకు అమ్మేందుకు ఒప్పందంకుదుర్చుకునే వీలు ‘రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లు కల్పిస్తుందని మంత్రి తోమర్‌ వివరించారు.

ఉపసభాపతిపై అవిశ్వాసం!
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పై 12 విపక్ష పార్టీలు ఆదివారం అవిశ్వాస నోటీసును ఇచ్చాయి. వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో ఆయన పక్షపాత ధోరణిలో, అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించాయి.  బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానాలపై డివిజన్‌ ఓటింగ్‌ జరగాలన్న డిమాండ్‌ను ఆయన పట్టించుకోలేదని విమర్శించాయి. అవిశ్వాస నోటీసు ఇచ్చిన పార్టీల్లో కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్‌ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, నేషనల్‌ కాన్ఫరెన్స్, డీఎంకే, ఆప్‌ ఉన్నాయి. డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ప్రభుత్వం పక్షాన నిలిచి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శించారు. జేడీయూ నేత హరివంశ్‌ గతవారమే రాజ్యసభ ఉపసభాపతిగా రెండో సారి ఎన్నికయ్యారు. రాజ్యసభలో మెజారిటీ లేనందునే ప్రభుత్వం డివిజన్‌ ఓటింగ్‌కు అంగీకరించలేదని టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్‌ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమన్నారు.

ఆ ఎంపీలపై ప్రివిలేజ్‌ మోషన్‌
రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా సభలో అనుచితంగా ప్రవర్తించిన పలువురు విపక్ష ఎంపీలపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక పార్టీకి చెందిన ఫ్లోర్‌ లీడర్‌ సహా ముగ్గురు, లేక నలుగురు ప్రతిపక్ష ఎంపీలపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బిల్లుల ఆమోదం సమయంలో డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపిస్తూ విపక్షపార్టీలు ఆయనపై అవిశ్వాస నోటీసు ఇచ్చారు. ఆ తరువాత, వెంటనే కొందరు కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి, సభలో జరిగిన ఘటనలపై చర్చించారు. విపక్ష సభ్యుల ప్రవర్తనను ఆయనకు వివరించారు.

వ్యవసాయ బిల్లుల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం రైతులకి మరణశాసనం లిఖించింది. భూమిలో బంగారు పంటలు పండించే రైతన్నల కంట్లో నుంచి రక్తం ప్రవహిస్తోంది. రైతులకి మరణశాసనంగా మారే వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు
– రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ఎంపీ

రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. వారి బంగారు భవిష్యత్‌కు ఈ బిల్లులు బాటలు వేస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో దూరదృష్టితో ఈ బిల్లుల్ని తీసుకువచ్చారు. కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలు కొనసాగుతాయి
– జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు

ప్రజాస్వామ్యం అంటే ఏకాభిప్రాయం. కానీ అత్యధికుల అణచివేత కాదు. బిల్లును రాష్ట్రపతి వెనక్కి పంపించాలి
– సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్, శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌

వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం, కార్పొ రేట్లకు అనుకూలం. రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తాయి. రాష్ట్రాల మధ్య వ్యాపారాన్ని మాత్రమే కాదు, రాష్ట్రాల పరిధిలో వ్యాపార లావాదేవీలను నియంత్రిస్తాయి. చరిత్ర ఎవరినీ క్షమించదు.
– ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు

రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోంది. 2028 సంవత్సరం వచ్చినా రైతుల ఆదాయం పెరగదు. ఈ బిల్లుల ఆమోదం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. బిల్లుల్ని వెంటనే సెలక్ట్‌ కమిటీకి పంపాలి
– డెరెక్‌ ఓబ్రీన్, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ

వ్యవసాయ బిల్లులతో రైతు ఆత్మహత్యలు ఇంక జరగవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వగలదా? వీటిపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరపాలి
– సంజయ్‌ రౌత్,  శివసేన ఎంపీ

స్వల్పకాలంలోనూ, దీర్ఘకాలంలోనూ ఈ బిల్లులు రైతులకు ఎలా మేలు చేస్తాయో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించి చెప్పాలి. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళలో ఈ బిల్లుల్ని అత్యవసరంగా ఆమోదించాల్సిన అవసరం ఏముంది ?
– హెచ్‌డీ దేవెగౌడ, జేడీ (ఎస్‌) ఎంపీ

వ్యవసాయ బిల్లులపై చర్చించకుండా హడావుడిగా ఆమోదించడమేంటి? రైతు బిడ్డలెవరూ ఇలాంటి బిల్లుల్ని రూపొందించరు. తిరిగి స్వగ్రామాలకు వెళితే అక్కడ యువత పార్లమెంటులో కూర్చొని రైతన్నలకు మరణశాసనం లిఖిస్తారా అని ప్రశ్నిస్తారు.
– రామ్‌గోపాల్‌ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ


ఢిల్లీలోని విజయ్‌చౌక్‌ వద్ద రైతులకు స్వీట్లు తినిపిస్తున్న కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement