కొలంబో: ఆర్థికంగా అధ్వాన్న స్థితికి చేరుకున్న లంకలో సామాజిక పరిస్థితులు కూడా కట్టు తప్పుతున్నాయి. ప్రజాగ్రహాన్ని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం దమనకాండకు దిగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై నిరసనకు దిగిన వర్సిటీ విద్యార్ధులపై ఆదివారం పోలీసులు లాఠీ చార్జ్, బాష్పవాయు ప్రయోగం చేశారు. ఆల్‌పార్టీ ప్రభు త్వం ఏర్పాటుకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం
ప్రభుత్వ ఆజ్ఞలు లెక్కచేయని ప్రతిపక్ష సమగి జన బలవెగయ పార్టీ కొలంబోలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. లంకలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిపక్ష నేత హర్ష డిసిల్వా ప్రకటించారు. నిరసనలో భాగంగా కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్దకు ప్రతిపక్షాలు లాంగ్‌మార్చ్ నిర్వహించాయి. దేశ పశ్చిమ ప్రాంతంలో పోలీసులు కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనకు 664మందిని అరెస్టు చేశారు. ప్రజాహక్కుల పరిరక్షణకే నిరసనలని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస చెప్పారు.
ప్రతిపక్షాలకు మద్దతుగా పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆన్‌లైన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆల్‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ పరిష్కారాన్ని వెతకాలని మాజీ మంత్రి విమల వీరవంశ సూచించారు. ఈ సూచనపై అధ్యక్షుడు, ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు గుప్పిట్లో ఉంచుకున్నారని, వీరికి ప్రజల్లో మద్దతు పోయిందని మాజీ క్రికెటర్ మహెళ జయవర్ధనే విమర్శించారు. వీరంతా వెంటనే గద్దె దిగాలన్నారు. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో క్రీడలు, యువజన మంత్రి పదవికి నమల్ రాజపక్సా రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి.
సోషల్ మీడియాపై నిషేధం, ఎత్తివేత
ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించిన శ్రీలంక.. తిరిగి 15 గంటల్లోనే ఎత్తివేసింది. 36 గంటల కర్ఫ్యూలో భాగంగా సోషల్ మీడియాపై శనివారం రాత్రి నిషేధం విధించింది. దీన్ని మంత్రులు వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గింది.
కిలో బియ్యం రూ.220!
శ్రీలంకలో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఇంధనం, నిత్యావసరాల కోసం జనం భారీగా క్యూ కడుతున్నారు. అయినా ఏ కొందరికో సరుకులు లభిస్తున్నాయి. సూపర్‌మార్కెట్లలో కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ.190, పంచదార రూ.240, పాల పౌడర్ రూ.1900 చేరడంతో లీటర్ కొబ్బరి నూనె రూ. 850, గుడ్డు రూ.30 పలుకుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment