న్యూఢిల్లీ: మూడు సాగు చట్టాలను ఉపసంహరించడంతోపాటు పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రైతాంగం సమస్యలు, దేశంలో ధరల పెరుగుదల, చమురు ధరల మంట, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కరోనా మహమ్మారి వ్యాప్తి– నియంత్రణ చర్యలు, దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, పెగాసస్ స్పైవేర్ వ్యవహారం, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, భారత భూభాగంలో చైనా సైనికుల చొరబాట్లు, సరిహద్దు రాష్ట్రాల్లో బీఎస్‌ఎఫ్ పరిధి పెంపు, మహిళా రిజర్వేషన్లు తదితర కీలక అంశాలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని పట్టుబట్టాయి.
పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానునున్న నేపథ్యంలో కేంద్రం ఆదివారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ నిర్వహించింది. 31 ప్రతిపక్షాల నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలన్నీ సహకరించాలని రాజ్‌నాథ్ కోరారు. ఉభయ సభల సభాపతులు అనుమతించే అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో కచ్చితంగా చర్చించాలని ప్రతిపక్ష నేతలు సూచించారు. అఖిలపక్ష భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ రాకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి హాజరయ్యే సంప్రదాయం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ గుర్తుచేశారు.
‘ఎంఎస్పీ’పై చర్యలు తీసుకోవాలి
అఖిలపక్ష సమావేశంలో 15 అంశాలను లేవనెత్తాం. రైతుల సమస్యలను ప్రస్తావించాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని విన్నవించాం. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. ఎంఎస్పీకి చట్టబద్ధతపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పాం. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విన్నవించాం. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపాం. పార్లమెంట్ 19 రోజులపాటే పనిచేయనుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు సమయం సరిపోదు. లోక్‌సభ సక్రమంగా కొనసాగడానికి డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలి. పార్లమెంట్‌లో మీడియాపై విధించిన ఆంక్షలను తొలగించాలి
– మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి,కాంగ్రెస్ నేతలు
మహిళా రిజర్వేషన్ బిల్లును చేపట్టాలి
పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పార్లమెంట్‌లో ఈ బిల్లుపై చర్చించాలని కోరాయి. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు వారి వంతు భాగస్వామ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని సూచించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గత 15 ఏళ్లుగా మోక్షం లభించడం లేదు.
సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయొద్దు
దేశ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచడం సరైంది కాదు. ఇలా చేయడం రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తూ దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయడమే అవుతుంది. అఖిలపక్ష భేటీలో 10 అంశాలను లేవనెత్తాం
– డెరెక్ ఓ బ్రెయిన్, సుదీప్ బందోపాధ్యాయ, తృణమూల్ నేతలు
మాట్లాడనివ్వలేదు..
అఖిలపక్ష సమావేశంలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. రైతు ల సమస్యలు, ఎంఎస్పీకి చట్టబద్ధత అంశాన్ని లెవనెత్తడానికి అనుమతించలేదు. అందుకే వాకౌట్ చేశాం
– సంజయ్ సింగ్, ఆప్ నాయకుడు
జమ్మూకశ్మీర్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలి
– ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత
పార్లమెంట్ పనితీరుపై సుప్రీం వ్యాఖ్యలు
ఆందోళనకరం వెంకయ్యతో విపక్ష నేతలు
పార్లమెంట్‌తోపాటు ఇతర చట్టసభల పనితీరు, చట్టాలను రూపొందిస్తున్న విధానం పట్ల ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల హక్కులకు, మర్యాదలకు భంగం వాటిల్లకుండా, ఇతర రాజ్యాంగబద్ధ వ్యవస్థలు చట్టసభలపై ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా సభాపతులే(ప్రిసైడింగ్ ఆఫీసర్లు) తగిన చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడి దృష్టికి తీసుకొచ్చారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వెంకయ్య ఆదివారం తన నివాసంలో దాదాపు 40 పార్టీల నేతలతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘‘మీ ఆందోళనను అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో గమనించాలి. చట్టసభల్లో తరచూ అంతరాయాలు కలుగుతున్నాయి. సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. చట్టసభల్లో మన ప్రవర్తన గౌరవంగా, హూందాగా ఉంటే ప్రజాబాహుళ్యం నుంచి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినిపించవు’’ అని సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 70 శాతం సమయం వృథా అయ్యిందని, శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని పలువురు నేతలు వెల్లడించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు తరచుగా కలిసి మాట్లాడుకుంటే, పార్లమెంట్‌లో గొడవలకు ఆస్కారం ఉండదని వెంకయ్య నాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment