న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. కశ్మీర్‌లో వివిధ రాజకీయ పక్షాలతో ఈ నెల 24న సమావేశాన్ని ఏర్పాటు చేసి నలుగురు మాజీ ముఖ్యమంత్రులు సహా 14 మంది నేతలకు ఆహ్వానం పంపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరవుతారు. జమ్మూ కశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కశ్మీర్ నేతల్ని స్వయంగా ఫోన్ ద్వారా ఆహ్వానించినట్టుగా ప్రభుత్వ అధికారులు శనివారం వెల్లడించారు.
సమావేశానికి ఆహ్వానం అందుకున్న నేతల్లో నలుగురు మాజీ సీఎంలు... నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ ఉన్నారు. ఇక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన కాంగ్రెస్ నేత తారా చంద్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత ముజాఫర్ హుస్సేన్ బేగ్, బీజేపీ నేతలు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాలను కూడా ఆహ్వానించింది. సీపీఐ(ఎం) నేత యూసఫ్ తరిగామి, జమ్ము కశ్మీర్ అప్నీ పార్టీ (జేకేఏపీ) చీఫ్ అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ సజ్జద్ లోనె, జేకే కాంగ్రెస్ హెడ్ జీ ఏ మిర్, బీజేపీకి చెందిన రవీందర్ రైనా, పాంథర్స్ పార్టీ నేత భీమ్ సింగ్‌లకు ఆహ్వానం అందింది. వీరంతా తప్పనిసరిగా కోవిడ్–19 నెగిటివ్ రిపోర్ట్‌తో సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది.
మంచుకొండల్లో రాజకీయ వేడి
జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370ని 2019లో ఆగస్టులో రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రాజకీయ ప్రక్రియకి తెర తీయడంతో మంచుకొండల్లో రాజకీయ వేడి రాజుకుంది. ఈ సమావేశానికి హాజరవడానికి వివిధ రాజకీయ పక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. పీడీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆదివారం సమావేశమై దీనిపై చర్చించనుంది.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికలు ?
ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్ము కశ్మీర్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసినప్పటికీ మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర హోదా కల్పిస్తామని అప్పట్లోనే కేంద్రం చెప్పింది. జమ్ము కశ్మీర్‌లోని రాజకీయ పార్టీల సహకారంతో ఈ ఏడాది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర హోదాను కల్పించాలని భావిస్తోంది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్, లేదంటే వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచనగా ఉన్నట్టు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment