
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, యువకుల జీవితాలను ప్రభావితం చేసే జోనల్ వ్యవస్థపై ప్రభుత్వం ఇష్టానుసారం ప్రకటనలు చేయకుండా, తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో రాష్ట్రంలో జోన్లు కూడా పెంచాలని గతంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సూచించినా పెడచెవిన పెట్టి జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఎంతో సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి వ్యవహరించాలని సూచించారు.