సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం మరోసారి జమిలి ఎన్నికలపై చర్చకు తెరలేపింది. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ (జమిలి ఎన్నికలు (లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం) అంశంతో పాటు ఇతర ముఖ్యాంశాలపై చర్చించేందుకు ఈ నెల 19న ఢిల్లీలో అఖిలపక్ష భేటీకి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ప్రస్తుత లోక్‌సభలో చాలామంది కొత్త వారున్నారంటూ.. పార్లమెంటు దిగువ సభ మొదటి సమావేశాలు నూతనోత్సాహం, కొత్త ఆలోచనలతో ప్రారంభం కావాలని మోదీ ఆకాంక్షించారు. కాగా 19న భేటీకి హాజరుకావాల్సిందిగా కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆదివారం లేఖలు రాశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖరరావు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా లేఖలు రాశారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు ఉభయ సభలూ సాఫీగా సాగేందుకు సహకరించాల్సిందిగా అన్ని పార్టీలను ముఖ్యంగా విపక్షాన్ని ప్రభుత్వం కోరిందన్నారు. జమిలి ఎన్నికలతో పాటు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2022లో 75 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా వేడుకలు, ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ, పార్లమెంటు పనితీరు మెరుగుపరచడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నట్టు జోషి తెలిపారు. కాగా ఉభయ సభల ఎంపీలు ప్రభుత్వంతో స్వేచ్ఛగా మాట్లాడేందుకు, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా ఈ నెల 20న రాత్రి విందు సమావేశం జరుగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment