మణిపూర్ అంశంపై బుధవారం లోక్‌సభలో నిరసన వ్యక్తం చేస్తున్న విపక్ష పార్టీల ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు దాదాపు ఏడాది ఉండగానే అధికార బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి తదితర విపక్ష పార్టీల బాహాబాహీకి అనూహ్యంగా రంగం సిద్ధమైంది. అనూహ్యంగా లోక్‌సభే ఇందుకు వేదికగా మారనుంది! మణిపూర్ హింసాకాండ తదితరాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టే వ్యూహంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన నాటినుంచీ విపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తుండటం తెలిసిందే.
అందులో భాగంగా మరో అడుగు ముందుకేసి మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అవి తాజాగా నిర్ణయించాయి. ఆ సవాలు స్వీకరించి విపక్షాల ఎత్తును చిత్తు చేసేలా మోదీ సర్కారు పై ఎత్తు వేయడం, అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పరిగణనలోకి తీసుకోవడం... ఇలా బుధవారం హస్తినలో అనూహ్య రాజకీయ పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చకచకా చోటుచేసుకున్నాయి...! అన్ని పార్టీలతో సంప్రదించాక అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీ, సమయం తదితరాలు వెల్లడిస్తానని స్పీకర్ ప్రకటించారు.
అదే రగడ...: మణిపూర్ హింసాకాండ తదితరాలపై లోక్‌సభలో బుధవారం కూడా రగడ జరిగింది. దాంతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే, కేంద్ర మంత్రివర్గంపై విశ్వాసం లేదని పేర్కొంటూ గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్) ఇచి్చన నోటీసును స్పీకర్ అనుమతించారు. దానికి ఎందరు మద్దతిస్తున్నారని ప్రశ్నించగా కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ, ఫరూక్ అబ్దుల్లా (ఎన్‌సీ), టీఆర్ బాలు (డీఎంకే), సుప్రియా సులే (ఎన్సీపీ) తదితర విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులంతా లేచి నిలబడ్డారు.
దాంతో తీర్మానాన్ని అనుమతిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎంపీలు శ్రీనివాసరెడ్డి, రాములు, దయాకర్ లోక్ సభ సెక్రటరీ జనరల్‌కు అవిశ్వాస నోటీసులిచ్చారు. బీఆర్‌ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డితో పాటు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా దానిపై సంతకాలు చేశారు. ‘ఇండియా’ కూటమిలో బీఆర్‌ఎస్ భాగస్వామి కాని విషయం తెలిసిందే.
ఇప్పడేమవుతుంది?
అవిశ్వాస తీర్మానంపై ఏ రోజు, ఎప్పుడు చర్చ మొదలు పెట్టాలో స్పీకర్ సారథ్యంలో జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయమవుతుంది.
► చర్చలో పాల్గొనేందుకు ఏయే పార్టీకి ఎంత సమయం ఇవ్వాలో స్పీకర్ నిర్ణయిస్తారు.
► చర్చ తర్వాత తీర్మానంపై ప్రధాని సమాధానమిస్తారు. తర్వాత ఓటింగ్ జరుగుతుంది.
లోక్‌సభలో బలాబలాలివీ...
లోక్‌సభ మొత్తం బలం 543. ప్రస్తుతం 5 ఖాళీలున్నాయి. బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ పక్షానికి 330 మందికి పైగా, విపక్ష ‘ఇండియా’ కూటమికి 140కి పైగా ఎంపీల బలముంది. ఈ రెండు కూటముల్లోనూ లేని ఎంపీలు 60 మందికి పైగా ఉన్నారు.
మోదీ జోస్యమే నిజమైంది!
విపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో ప్రధాని మోదీ నాడు చెప్పిన జోస్యమే నిజమైందంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 జూలై 20న మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలిసిందే. దానికి అనుకూలంగా 126 మంది ఓటేయగా 325 మంది ఎన్డీఏ సభ్యులు వ్యతిరేకించారు. దాంతో భారీ మెజార్టీతో మోదీ సర్కారు గట్టెక్కింది. ఆ సందర్భంగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ బదులిస్తూ విపక్షాలను ఎద్దేవా చేశారు. ‘2023లోనూ నా ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష పెట్టేంతగా వాళ్లు సన్నద్ధం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ చెణుకులు విసిరారు. అచ్చం ఆయన అన్నట్టుగానే ఇప్పుడు జరుగుతోందంటూ బుధవారం రోజంతా సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment