సొంతగా వనరుల సేకరణపై దృష్టిపెట్టండి
శ్వేతపత్రాలు విడుదల చేయండి
‘స్వచ్ఛ భారత్’ వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
విజయవాడ సెంట్రల్ : పనులు సరిగా చేస్తే ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లిస్తారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సొంత వనరుల సేకరణపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రస్థాయి స్వచ్ఛ భారత్ వర్క్‌షాపును శనివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. ఆదాయ వనరులను ప్రజలకు తెలియజేసి ఆర్థిక పరిపుష్టికి సహకారం కోరాలని సూచించారు. ప్రజల ఆలోచనల్లో మార్పు చోటు చేసుకుంటుందన్నారు. ఎక్కువ సౌకర్యాలు కావాలని కోరుకున్నప్పుడు పన్నుల భారాలు తప్పవని పేర్కొన్నారు. విద్యుత్, నీరు, గృహ వసతి పేదలకు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు చెప్పి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా వారిని నడిపించగలిగినవాడే నిజమైన నాయకుడన్నారు. స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లో హోటళ్లు, ఆస్పత్రులు, ప్రైవేటు సంస్థల నుంచి వెలువడే చెత్తను ఆయా సంస్థలే పరిష్కరించుకొనే విధంగా నిబంధనలను కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. పారిశుధ్యం, చెత్త తొలగింపులో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సి ఉందన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ నుంచి కేంద్రం వ్యక్తిగత టాయ్‌లెట్ల నిర్మాణానికి రూ.4 వేలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,333 అందజేస్తుందని, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా రెండు శాతం సొమ్మును చెల్లించాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను సొంతబిడ్డలా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు.
రాష్ట్రంలో 5 లక్షల మరుగుదొడ్లు
రాష్ట్ర మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో ఐదు లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. కేంద్రం అందించే రూ.4 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేలు అందిస్తోందన్నారు. పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరాయిస్తోందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ డెరైక్టర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ వాణీమోహన్, నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ డెరైక్టర్ అనిమేష్ భార్తి, సెంటర్ పబ్లిక్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్ జాయింట్ అడ్వయిజర్ వీకే చౌరాసియా, డెప్యూటీ సలహాదారు రోహిత్ కక్కుర్, ఉపాధ్యక్షుడు సుమన్ చహర్, రాంకీ ఎన్విరాన్ ఇంజినీర్స్ సంస్థ జాతీయ ప్రతినిధి ఆర్.మోహనరావు, 13 జిల్లాలకు చెందిన 99 మంది మున్సిపల్ కమిషనర్లు, 47 మంది మేయర్లు, చైర్‌పర్సన్లు హాజరయ్యారు. మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పనులు చేస్తేనే పన్నులు చెల్లిస్తారు
Published Sun, Feb 22 2015 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement