అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టి వారం గడిచింది. ఈ వారంలో ఆయన తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు సంచలనం సృష్టించాయి. చైనా నుండి యూరప్ వరకు, ఉక్రెయిన్ నుండి ఇరాన్ వరకు, ట్రంప్ నిర్ణయాలను విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.
ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో అమెరికన్లు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. జనవరి 20న ట్రంప్ అధ్యక్షునిగా అధికార బాధ్యతలు చేపట్టారు. వెంటనే పలు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. గడచిన వారంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాతో పాటు ప్రపంచంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చైనాతో దోస్తీ?
ముందుగా చైనా విషయానికొస్తే ట్రంప్ తొలి పదవీకాలంలో, చైనా- అమెరికా మధ్య సత్సంబంధాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 60 శాతం వరకు భారీగా సుంకం విధిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రంప్ వారం గడిచినా ఈ విషయమై నోరు మెదపడం లేదు. పైగా ఒక ఇంటర్వ్యూలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో ఏదైనా వ్యాపార ఒప్పందం కుదుర్చుకోగలరా అని అడిగినప్పుడు ట్రంప్ అందుకు సిద్దమేనన్నట్లు సమాధానం చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధంపై మారిన వైఖరి
ట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్ యుద్ధంపై గతంలో చేసిన వాగ్దానం అమలులో వైఖరిని మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా.. రష్యాను వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్‌ను పావుగా వాడుకుంది. మాజీ అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం మేరకు ఇది జరిగింది. నిజానికి ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధం నుండి అమెరికాను దూరంగా ఉంచవచ్చు. కానీ ఇది అమెరికా భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ మద్దతు ఉంది. ఒకవేళ అమెరికా వెనక్కి తగ్గితే, భవిష్యత్‌లో రష్యాతో చేతులు కలిపే సందర్భం వస్తే ఎటువంటి హాని ఏర్పడదని ట్రంప్ భావిస్తున్నట్లుందని విశ్లేషకులు అంటున్నారు.
జన్మతః పౌరసత్వ చట్టం
డొనాల్డ్ ట్రంప్ రెండవమారు అధ్యక్షుడైన వెంటనే జన్మతః పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు. ట్రంప్ ఉత్తర్వులు ఫిబ్రవరి 20 నుండి అమెరికాలో అమల్లోకి వస్తాయి. ఇది విదేశాల నుండి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిని ప్రభావితం చేస్తుంది. అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారు తమ పిల్లలు అమెరికన్ పౌరసత్వం పొందాలని కలలు కంటుంటారు. అయితే ట్రంప్ నిర్ణయం వారి కలలను కల్లలు చేసింది.
ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహం
ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారిలో ఆయన సన్నిహితుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ట్రంప్ ఇటీవల స్టార్‌గేట్ పేరుతో భారీ ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందంపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నారు. స్టార్‌గేట్‌లో పాల్గొన్న మూడు కంపెనీలకు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యం లేదని మస్క్ సోషల్ మీడియాలో రాశారు.
గాజా శరణార్థుల పునరావాసం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా గాజా శరణార్థుల పునరావాసానికి సంబంధించి ఓ ప్రతిపాదన చేశారు. గాజాలో ఉండలేకపోతున్న పాలస్తీనా వాసులు అక్కడికి పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లలో తాత్కాలిక పునరావాసం పొందాలని ట్రంప్ సూచించారు. గాజా ప్రాంతం నాశనమైందని, అక్కడి ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలైన జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు సహకరించాలని ఆయన కోరారు.
ఆర్థిక సాయం నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివిధ దేశాలకు ఇస్తున్న ఆర్ధిక సహాయాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యుద్ధంలో చిక్కుకున్న ఉక్రేయిన్ కూడా ఆర్ధిక సాయం నిలిపివేశారు. అయితే ఇజ్రాయెల్, ఈజిప్ట్‌లకు సైనిక బలగాల పెంపు కోసం అందించే నిధులకు మినహాయింపులు ఇవ్వడం విశేషం.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..
Comments
Please login to add a commentAdd a comment