- కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం
- హుద్‌హుద్ వంటి విషాదాలకు వీడ్కోలు
- విశాఖ నగరంలో నింగినంటిన వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో కష్టాలు.. మరెన్నో కన్నీళ్లు.. ఆటుపోట్ల నడుమ 2014లో నలిగిపోయిన నగరవాసులు.. కోటి ఆశలతో 2015కి స్వాగతం పలికారు.. పగబట్టిన ప్రకృతిని ఎదిరించి, పాలకుల వంచనను భరించి గతించిన కాలాన్ని చేదు జ్ఞాపకంలా, రానున్న రోజులను అందంగా భావించి వేడుకలు జరుపుకున్నారు. నగరం నడిబొడ్డు నుంచి శివారు గ్రామాల వరకూ నూతన సంవత్సర సంబరాలు హోరెత్తించారు. ప్రశాంత విశాఖలో భారీ సంచలనాలు, పెను సవాళ్లు కొత్త కాదు. గడిచిన ఏడాదిలోనూ అలాంటివి ఎన్నో ఎదురయ్యాయి.
వాటిని అధిగమించి నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక రాజధానిగా విరాజిల్లడంతోపాటు రానున్న రోజుల్లో స్మార్ట్ సిటీగా నగరం మారబోతోందనే సంతోషం నగరవాసుల్లో తొణికిసలాడింది. 2014లో భారీ విషాదం హుద్‌హుద్ రూపంలో వచ్చింది. ప్రాణాలు తీసింది. ఆస్తులను ధ్వంసం చేసింది. ప్రకృతి విపత్తు ఎంత భయంకరంగా ఉంటుందో రుచి చూపించింది. అయినా నగరం వణికిపోలేదు. నిలువెల్లా గాయాలైనా బెదిరిపోలేదు. జనం మనోధైర్యం ముందు విపత్తు చిన్నబోయింది. తలలు తెగిపడ్డ వృక్షాలు కొత్త చిగుళ్లు తొడిగాయి. అదే స్ఫూర్తి నూతన సంవత్సర వేడుకల్లో ఆవిష్కృతమైంది.
కెవ్వు కేక
నూతనోత్సాహంతో నగరవాసులు 2015కు స్వాగతం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ నివాదాలతో నగరం మారుమోగింది. చలిని లెక్క చేయక, ముసురును పట్టించుకోక, చిరుజల్లుల్లో తడుస్తూనే జనం సంబరాల్లో మునిగితేలారు. ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటలు, పాటలకు విదేశీ స్వదేశీ కళాకారులను రప్పించారు. సినీ, టీవీ రంగాలకు చెందిన నటీనటులు, యాంకర్లు నూతన సంవత్సర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నగర శివారులోని ఓ రిసార్ట్‌లో దర్శకుడు కె.రాఘవేంద్రంరావు, సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో ‘సాగర సంగమం’ అనే పేరుతో నిర్వహించిన సంగీవ విభావరి యువతను ఉర్రూతలూగించింది. పాత కొత్త పాటల మేలు కలయికతో నిర్వహించిన ఈ కార్యక్రమం న్యూ ఇయర్ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచింది. బీచ్ రోడ్డులో అర్ధరాత్రి 12 గంటలకు వేడుకలు మిన్నంటాయి. కేకులు కట్ చేసి బాణసంచా కాల్చి న్యూ ఇయర్‌కి స్వాగతం పలికారు. పోలీసు శాఖ ముందుగానే ఆంక్షలు విధించడంతో ఆకతాయిలకు కళ్లెం పడింది. వాహనాలు అనుమతించిన మార్గాల్లోనే నడవాలని చెప్పినప్పటికీ అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది.
దేవాలయాల్లోనూ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, భక్తి గీతాలతో భక్తులు పండుగ జరుపుకున్నారు. ఇక ఫుడ్ కోర్టులకు, రెస్టారెంట్లు భారీ అమ్మకాలు జరిపాయి. ఆఫర్లతో ఆకర్షించి బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్‌లను నగరవాసులకు అందించాయి. బేకరీల్లో కేకులకు కొరత ఏర్పడింది. చేదును మర్చిపోయి, తీపిని ఆస్వాదిస్తూ చిన్నా, పెద్ద తేడా లేకుండా నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. అధిక శాతం జనం వీధుల్లోకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు. కొందరు ఇళ్లల్లోనే బంధుమిత్రులతో కేకులు కోసి సంతోషాలు పంచుకున్నారు. యువతరం చిందులతో కొత్త ఏడాది సంబరాలకు కళ తెచ్చారు.