
2024కి వీడ్కోలు చెబుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తూర్పు గోదావరి జిల్లా కడియంలోని పల్లా వెంకన్న నర్సరీలో వేలాది మొక్కలతో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2025’ అంటూ అక్షరాకృతులను మొక్కలతో అలంకరించారు.
పల్లా వెంకన్న నర్సరీ రైతు పల్లా సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) కుమారులు, నర్సరీ యువ రైతులు వెంకటేశ్, వినయ్ తీర్చిదిద్దిన ఈ ఆకృతుల మధ్య ఫొటోలు తీయించుకోవడానికి సందర్శకులు పోటీపడుతున్నారు. 50 మంది కార్మికులు 4 రోజుల పాటు శ్రమించి వేల మొక్కలతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ మొక్కల కూర్పును సందర్శకుల కోసం జనవరి 18 వరకు నర్సరీలో ఉంచనున్నారు.

వైజాగ్‌లో న్యూ ఇయర్ జోష్
నూతన సంవత్సర వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. విశాఖపట్నం బీచ్‌లో నృత్యకారిణులు విభిన్నంగా కొత్త ఏడాది ఆగమనాన్ని స్వాగతించారు. వైజాగ్ నగరంలో చాలా ప్రాంతాల్లో న్యూ ఇయర్ జోష్ కనిపించింది. సెల్ఫీలు, ఫొటోలతో వైజాగ్ వాసులు సందడి చేశారు. ఆటపాటలతో హ్యపీ న్యూ ఇయర్ జరుపుకున్నారు.
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో గోదారి ‘కళ’కళలు
కొత్తపేట: ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో గోదారి ‘కళ’కళలు కనువిందు చేయనున్నాయి. అక్కడ జరిగే ‘జై మా భారతి నృత్యోత్సవం’లో పాల్గొనే అవకాశం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 100 మంది గరగ నృత్యం కళాకారులకు లభించింది. గణతంత్ర వేడుకలకు దేశవ్యాప్తంగా 29 జానపద, 22 గిరిజన కళారూపాల ప్రదర్శనలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఈ ప్రదర్శనల్లో ప్రముఖ జానపద సంప్రదాయ ప్రదర్శనలుగా ఖ్యాతి పొందిన గరగ నృత్యం, వీరనాట్యం కళారూపాలకు కేంద్ర సాంస్కృతిక శాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెల గ్రామానికి చెందిన గరగ నృత్యం, వీరనాట్యం కళాకారుడు కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ ఆధ్వర్యాన శివపార్వతి గరగ నృత్యం కళాకారులు 100 మంది డిసెంబర్ 28న ఢిల్లీ పయనమయ్యారు.
చదవండి: బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు'