కొంచెం కొత్తగా ఉందాం | 2025 new year special | Sakshi
Sakshi News home page

కొంచెం కొత్తగా ఉందాం

Published Wed, Jan 1 2025 12:13 AM | Last Updated on Wed, Jan 1 2025 10:30 AM

2025 new year special

2025 హ్యాపీ న్యూఇయర్‌

క్యాలెండర్‌ మారితే సంతోషపడటం కాదు. మనం ఏం మారామనేది ముఖ్యం. అవే పాత అలవాట్లు.. పాత తలపోతలు పాత బలహీనతలు.. పాత అనవసర భారాలు... వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మీరు అదే పాత మనిషి అవుతారు. కొత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ చుట్టూ మిమ్మల్ని మబ్బులో పెట్టి పబ్బం గడిపే వారుంటారు.  మబ్బు వీడండి.. కొత్త మనిషిగా ముందుకు అడుగు వేయండి. హ్యాపీ న్యూ ఇయర్‌.

రొటీన్‌లో ఉండే పెద్ద ప్రమాదం ఏమిటంటే... మనం సత్యాన్ని కనుగొనలేము. అవే రక్తసంబంధాలు, బంధువులు, స్నేహితులు... మన చుట్టూ ఉంటారు. రొటీన్‌లో ఉంచుతారు. వారు చేసే మంచి, చెడు... మనం క్షమించుకుంటూ, బాధపడుతూ ముందుకెళ్లిపోతూ ఉంటాం. కాని ఆగాలి. దూరంగా జరగాలి. కొన్నాళ్లు కలవకుండా ఉండి, స్థిమితంగా ఆలోచించి, వీరిలో నిజంగా మీకు సంతోష ఆనందాలు ఇస్తున్నది ఎవరు, మీ అభిమానాన్ని ప్రేమని దుర్వినియోగం చేయకుండా ఉన్నది ఎవరు, మీకు అపకారం లేదా అవమానం చేస్తున్నది ఎవరు... అనేది మీరు గమనించి చూసుకుంటే, కాస్త కఠినంగా మారి, వీరితో ఎడంగా ఉండాలని ఈ సంవత్సరం మీరు నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు.

మంచి ఆలవాట్లు చేసుకోవడం తర్వాత. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అవి మనకు తెలుసు. వాటి వల్ల ప్రమాదమూ తెలుసు. గిల్ట్‌ అనిపించడమూ తెలుసు. వాటిని వదిలించుకోవాలి. మీ ఎంపికే మీ ఫలితం. మీరు చెడు అలవాటు ఎంచుకుంటే చెడు ఫలితం వస్తుంది. దానిని వదిలించుకుంటే చెడు వదిలిపోతుంది. గట్టిగా నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా మారతారు.

వాయిదా వేయడం వల్లే మనిషి జీవితంలో మంచి వాయిదా పడుతూ ఉంటుంది. రేపు చేద్దాం, తొందరేముందిలే, ఇవాళ బద్దకం అంటూ మీరు పోస్ట్‌పోన్‌ చేసిన ప్రతిదీ మీకు సరైన సమయంలో సరైన రైలు అందకుండా చేస్తుంది. రైలు మిస్సయ్యాక మరో రైలు కోసం స్టేషన్‌లో పడి ఉండే ధోరణి మీలో ఉన్నంత కాలం మీరు కొత్త మనిషిగా మారలేరు... ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా. రోజూ ఉదయం ఇవాళ చేయాల్సిన పనులు అని రాసుకోవడం... చేశాకే నిద్రపోవడం మీకో కొత్త జీవితాన్ని తప్పక ఇస్తుంది.

మీ భౌతిక, మానసిక ఎదుగుదల గత సంవత్సరం ఎలా సాగింది? ప్రశ్నించుకోండి. మీ మేధస్సు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వీటిని ఎంతమేరకు పెంచుకున్నారో చూసుకోండి. చిల్లర విషయాలకు నెలలు నెలలు ఎలా తగలెట్టారో మీకే తెలుసు. మంచి పుస్తకాలు, సంగీతం, మంచి సినిమాలు, ఆధ్యాతికత, విహారం, కొత్త ప్రాంతాల... మనుషుల సాంగత్యం... ఇవి మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. డిసెంబర్‌ 31 పార్టీ చేసుకుని మళ్లీ డిసెంబర్‌ 31 పార్టీ మధ్యలో గతంలోలా ఉంటే న్యూ ఇయర్‌ రావడం ఎందుకు? పార్టీ చేసుకోవడం ఎందుకు?

కుటుంబ సభ్యులను చూసుకోవడం వేరు. వారిని ‘తెలుసుకోవడం’ వేరు. వారి మనసుల్లో ఏముంది, ఆకాంక్షలు ఏమిటి, ఒకరితో మరొకరికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి, ప్రేమాభిమానాల కొలమానం ఎలా ఉంది... సరిగ్గా సమయం గడిపితే తెలుస్తుంది. షేర్లు, బంగారం పెరుగుదల తెలుసుకోవడం కంటే కూడా ఒక కుటుంబ సభ్యుడి మనసు తెలుసుకోవడం కుటుంబ వికాసానికి ముఖ్యం.

చట్టాన్ని, నియమ నిబంధలను, ΄ûర బాధ్యతను, కాలుష్యం పట్ల చైతన్యాన్ని కలిగి ఉంటే రుతువులు గతి తప్పవు. ఎండా వానల వెర్రి ఇంట్లో జొరబడదు.

కొత్త అంటే పాతను, పాతలోని చెడును తొలగించుకోవడమే.వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిజీవితం వరకు గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, కొత్త సంవత్సర లక్ష్యాలు మన వెండి తెర వెలుగుల మాటల్లో...

జ్ఞాపకాల పునాదిపై స్వప్నాల మేడ
గతం అనేది జ్ఞాపకం. అలాగే భవిష్యత్‌ అనేది స్వప్నం. జీవితం ఎప్పుడూ జ్ఞాపకాలకు, స్వప్నాలకు మధ్యలో ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. గతానికీ, భవిష్యత్‌కు మధ్యలో ఉండేదే మన జీవితం. అయితే గతాల పునాదిపై భవిష్యత్‌ భవనాన్ని కట్టుకోవాలి. జ్ఞాపకాల పునాదిపైన స్వప్నాల మేడ నిర్మించుకోవాలి. జ్ఞాపకాలను కేవలం పునాదిలాగా మాత్రమే వాడుకోవాలి. పునాది ఎప్పుడూ మేడ కాదు.. పునాది ఎప్పుడూ భవనం కాదు. కాకపోతే ఆ భవనం పటిష్టంగా ఉండాలనే పునాది మాత్ర గట్టిగా ఉండాలి. అంటే గతమనేది గట్టిగా ఉండాలి. గతంలోని మంచి విషయాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలన్నింటిని కూడా పోగుచేస్తేనే భవిష్యత్‌ భవనం పటిష్టంగా ఉంటుంది. చాలా కాలం నిలిచి ఉంటుంది.

మనల్ని నిలబెడుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే.. ఆత్రేయగారు ఒకమాట చె΄్పారు. ‘వచ్చునప్పుడు కొత్తవే వచ్చరాలు.. పాతబడిపోవు మన పాత పనుల వలన’ అన్నారు. అంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది. కానీ, మనం చేసే పాత పనుల వల్ల ఆ కొత్త సంవత్సరం కాస్తా పాతబడిపోతుంది. మనం కొత్త పనులు చేయాలి.. కొత్త ఆలోచనలు చేసుకోవాలి. కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు, కొత్త ధ్యేయాలను మనం పెట్టుకొని ముందుకెళ్లాలి. ముఖ్యంగా ఆ రోజుల్లోనే మంచిది, మా చిన్నప్పుడు బాగుండేది అంటూ గతంతో ఎప్పుడూ కాలయాపన చేయకూడదు.

కొత్త విషయాలు ఏంటి? కొత్త పరిజ్ఞానం ఏంటి? కొత్త సాంకేతికత ఏంటి... వంటి వాటిని ఆమోదించాలి, ఆహ్వానించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. దాని ద్వారా మనం సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ కేవలం మనం గతాన్ని పొగుడుతూ.. ఈ తరాన్ని, ఈ కాలాన్ని నిందించకూడదు, నిరసన తెలియచేయకూడదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త ఆలోచనలతో, కొత్త తరాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎప్పుడూ విజేతలం కాగలం. ముందు ఆ విషయాన్ని మనం ఆమోదించాలి. అప్పుడే దానిద్వారా మనం ముందుకెళ్లేలా నిచ్చెనలాగా, వారధిలాగా పనికొస్తుంది. అప్పుడే జీవితం కొత్తగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు.. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు. కొత్తగా మనం జీవితాన్ని మలచుకొనే అవకాశం ఉంటుంది. కొత్త తరాన్ని, కొత్త భావజాలాన్ని మనం అర్థం చేసుకుని ఆమోదిస్తే గనక ఏ గొడవా ఉండదు, ఏ పేచీ ఉండదు.. చక్కగా ముందుకు వెళ్లొచ్చు.

ప్రతి పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. అట్లాగే... ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించే కోణంలో నాదొక సూచన ఏంటంటే... నేడు పొందే ఆనందం.. రేపటి ఆనందాన్ని హరించకూడదు. ఈ రోజు ఎంత ఆనందాన్నైతే అనుభవిస్తున్నామో... ఈ ఆనందం వల్ల..రేపటి ఆ ఆనందానికి అది హాని కలుగ చేయకూడదు. రేపటి ఆనందానికి ఏ రకంగానూ ప్రభావం చూపకూడదు. రేపటి ఆనందాన్ని అనుభవించగలిగేలాగే ఉండాలి ఈ రోజుటి ఆనందం. అంటే ఓ హద్దులో.. పరిమితిలో.. ప్రతిరోజూ మనం పని చేస్తూ, 
ఆనందాన్ని అనుభవిస్తుంటే గనక రేపటి ని మరింత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. సంపాదన కోసం కొంత సమయం, సమాజం కోసం కొంత సమయం, నీ శరీరం కోసం కొంత సమయం, నీ సొంత కుటుంబం కోసం కొంత సమయం... ఇంతే..!  – చంద్రబోస్‌

హెల్త్‌... హార్డ్‌వర్క్‌
మనం ప్రతి ఒక్కరం కెరీర్‌ కోసం చాలా కష్టపడతాం. హార్డ్‌వర్క్‌ చేస్తాం. ఆ కష్టం వృథా కాదు. మన కష్టమే మనల్ని ఓ స్థాయికి చేర్చుతుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఇంకా కష్టపడి పని చేద్దాం... అయితే కెరీర్‌ గ్రోత్‌ మాత్రమే కాదు... మన వ్యక్తిగత ఆనందానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. హార్డ్‌ వర్క్‌... హెల్త్‌... హ్యాపీనెస్‌... ఈ మూడూ ముఖ్యం. వీటికి అనుగుణంగా లైఫ్‌ని ప్లాన్‌ చేసుకుని పాజిటివ్‌గా ముందుకెళ్లడమే. కెరీర్‌ కోసం హ్యాపీగా కష్టపడదాం... మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండి... హ్యాపీగా ఉందాం.

2024 గురించి చెప్పుకోవాలంటే... నేను ఎంత గ్రాండ్‌ సక్సెస్‌ సాధించానన్నది పక్కనపెడితే, నాకు తెలియనివి అన్నీ నేర్చుకునేందుకు సహకరించిన సంవత్సరంగా అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో సహనమే కీలకం అనే విషయాన్ని నాకు నేర్పించింది. అంతేకాదు నేను గమనించిన మరో ముఖ్య విషయం ఏమిటంటే... ఎన్ని సినిమాలు చేశాం,  నా తరువాత సినిమా ఏంటి, ఎప్పుడు అని ఎదురు చూడటం కన్నా, సెట్స్‌లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాం, షూటింగ్‌లో ఎంత సక్సెస్‌పుల్‌గా .. ఎంత టీమ్‌ స్పిరిట్‌తో.. ఎంత ఎఫర్ట్‌ఫుల్‌గా పనిచేశామన్నది ముఖ్యం.

రేటింగ్‌ విషయానికొస్తే... 1 నుంచి పది పాయింట్లలో నేను 2024కు 6 పాయింట్లు ఇస్తాను. ఎందుకంటే, 2024 నాకెంతో నేర్పించింది. దాంతోపాటు అనేక సవాళ్లను కూడా ఇచ్చింది మరి!

2024లో నాకు సంతోషం కలిగించిన విషయాలు... మొదటిసారిగా నేను నా ఫ్యామిలీతో యూఎస్‌ ట్రిప్‌కు వెళ్లడం, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగలగడం.

2025 మీద నా అంచనాలు: షూటింగ్‌లతో బిజీగా ఉండటం, చాలా ఎగై్జటింగ్‌ స్టోరీస్, అద్భుతమైన టీమ్‌ నా చేతిలో ఉన్నాయి. వాటితో కనీసం రెండు మూవీస్‌ అయినా 2025లో రిలీజ్‌ కావాలి. ఇంకా కష్టపడటం, పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా 
పనిచేయడం, నా గోల్స్‌. – ఆనంద్‌ దేవరకొండ

స్ట్రాంగ్‌గా... పాజిటివ్‌గా...
మన ఎదుగుదలకు ఓ కారణం ‘సెల్ఫ్‌ లవ్‌’. ముందు మనల్ని మనం ఇష్టపడాలి... గౌరవించుకోవాలి. 2025 సౌండింగ్‌ చాలా బాగుంది. ఏదో పాజిటివిటీ కనబడుతోంది. ఓ పాజటివ్‌ ఫీలింగ్‌తో ఈ ఇయర్‌లో మనం హ్యాపీగా, హెల్దీగా, పాజిటివ్‌గా ముందుకు సాగుదాం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. అందుకని ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. యోగా చేయాలి... రోజూ కొంచెం సేపు ధ్యానానికి కేటాయించాలి. ఆరోగ్యంగా ఉండాలి... కష్టపడి పని చేయాలి. ఆత్యవిశాస్వంతో బతకాలి.

నాకు డైరీ రాసే అలవాటు ఉంది. 2024లో పుషప్స్, ఫులప్స్, హ్యాండ్‌స్ట్రెంగ్త్‌పై దృష్టి పెట్టాలనుకున్నాను. కాని అది అవ్వలేదు. ఒక లవ్‌స్టోరీలో నటించాలనుకున్నాను. అఫ్‌కోర్స్‌ అది మన చేతుల్లో లేదనుకోండి. ఈ కొత్త సంవత్సరంలో నేను అనుకున్నవి ఫలించాలని కోరుకుంటున్నాను.

ప్రొఫెషన్‌ విషయానికి వస్తే... ఈ సంవత్సరం నాలుగు సినిమాల్లో నటించాను. హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఇక పర్సనల్‌ విషయానికి వస్తే టఫ్‌ పరిస్తితులను ఎదుర్కొన్నాను. వాటి నుంచి బయటపడగలిగాను. టఫ్‌ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎమోషనల్‌గా ఇతరుల మీద ఆధారపడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది నేర్చుకున్నాను. ఒంటరితనంగా అనిపించే పరిస్థితులు కూడా వస్తుంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకున్నాను.

కొత్త సంవత్సరం తీర్మానాల విషయానికి వస్తే... కొత్త స్కిల్స్‌ నేర్చుకోవాలనుకుంటున్నాను. యోగాను మరింత ప్రాక్ట్రిస్‌ చేయాలనుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్‌ చేయాలనుకుంటున్నాను. 2023 చివరిలో కూడా కొత్త సంవత్సరం రిజల్యూషన్స్‌ తీసుకున్నాను. వాటిలో చాలా వరకు ఈ సంవత్సరం పూర్తి చేశాను.ఆడియెన్స్‌ సినిమాను ఎలా చూస్తున్నారు, సినిమాల రిజల్ట్‌ నుంచి సినిమా మేకింగ్‌ ప్రాసెస్‌ వరకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటాను. – అనన్య నాగళ్ల

ప్రశాంతతకు ప్రాధాన్యం
రోజు రోజుకీ నెగటివిటీ పెరిగిపోతోంది. అందుకే కొంచెం పాజిటివిటీ పెంచుకోవాలి. కెరీర్‌ కోసం పరుగులు... డబ్బు కోసం పరుగులు... ఈ పరుగులో ప్రశాంతత ఉందా? అని ఆగి ఆలోచించుకోవాలి. లేనట్లు అనిపిస్తే పరుగు కాస్త తగ్గించి ప్రశాంతతకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏం చేసినా కుటుంబం కోసమే కాబట్టి... కుటుంబంతో గడపడానికి వీలు లేనంత బిజీ అయిపోవడం సరి కాదు. అందుకే ఫ్యామిలీకి తగిన సమయం వెచ్చించండి... పాజిటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి... ప్రశాంతంగా ఉండండి.

ప్రొఫెషన్‌గా, కెరీర్‌పరంగా కూడా 2024 నాకు చాలా మంచి సంవత్సరం అనే చెబుతాను నేను. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి నా పెళ్లి, రెండు నా సినిమా గ్రాండ్‌ సక్సెస్‌ కావడం. ఐదు సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్న మా ప్రేమ కాస్తా పెళ్లి పట్టాలెక్కింది 2024లోనే. సంవత్సరమున్నరపాటు నేను, మా టీమ్‌ అంతా ఎంతో హార్డ్‌వర్క్‌ చేసిన నా సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం నా కెరీర్‌లో మెమరబుల్‌ మూమెంట్‌గా చెప్పుకుంటాను.

1 నుంచి 10 పాయింట్లలో2024 కు నేను 9 పాయింట్లు ఇస్తాను. నా పెళ్లి చాలా గ్రాండ్‌గా జరగటం, ఆ పెళ్లికి పిలవడం కోసం చాలాకాలం నుంచి దూరంగా ఉన్న మా బంధువులందరినీ కలవడం, వారితో సంబం«ధాలు కలుపుకోవడం, అందరూ పెళ్లికి రావటం, అందరితో హ్యాపీగా టైమ్‌ స్పెండ్‌ చేయగలగటం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే, మా పెళ్లి తర్వాత మా ఊళ్లో మేము ఆంజనేయస్వామి తిరునాళ్ల చేసుకున్నాం. అది మాకు చాలా ప్రత్యేకం. మా చిన్నప్పుడెప్పుడో చేశాం అది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పుడు చేశాం. 

ఇంక న్యూ ఇయర్‌ రెజల్యూషన్‌ అంటారా.. బీ గుడ్‌ టు అదర్స్‌. అంటే అందరితో ఇంకా మంచిగా ఉండటం. దాంతోపాటు 2024లో నేను రెండు సినిమాలు హిట్‌ కొట్టాలనుకున్నాను. అయితే అది చేయలేకపోయాను. 2025లో కచ్చితంగా రెండు మంచి సినిమాలు అందించాలి. ఎంటర్‌టైన్‌ చేయాలి అనుకుంటున్నాను. అదే నా గోల్‌. ఇంకా.. పర్సనల్‌ లైఫ్‌ విషయానికొస్తే.. మ్యారేజ్‌ తర్వాత ఇది మా ఫస్ట్‌ న్యూ ఇయర్‌. మేము ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం చేయలేకపోయినా, కనీసం అదే రిలేషన్‌షిప్‌ మెయిన్‌టెయిన్‌ చేయాలనుకుంటున్నాం.  – కిరణ్‌ అబ్బవరం

ప్రతి టైమ్‌ మంచిదే
జీవితంలో మనకు దక్కిన ‘మంచి’ని గ్రహించాలి. ఆ మంచికి కృతజ్ఞతగా ఉండాలి. మన ఉరుకు పరుగుల జీవితంలో మనకు జరిగే మంచిని పట్టించుకునే స్థితిలో కూడా కొందరం ఉండము. జరిగే చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించుకుని బాధపడుతుంటాం. అయితే మంచిని గ్రహించి, పాజిటివ్‌గా ముందుకెళ్లాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కసారి మనకు దక్కిన మంచి విషయాలను గుర్తు చేసుకుని, ఆనందంగా ముందుకెళదాం.2024లో మొత్తం చూస్తే నేను చాలా హార్డ్‌ వర్క్‌ చేశాను. వాటి ఫలితాలు 2025 అందుకోబోతున్నాను. 

2024లో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా ఏ అంచనాలు పెట్టుకోకుండా సహనంతో వర్క్‌ చేశాను. నా వరకు బెస్ట్‌ ఫెర్‌ఫార్మెన్స్‌ని ఇచ్చాను. 
ప్రతి టైమ్‌ మంచిదే. ప్రతి సందర్భం నాకు విలువైన బెస్ట్‌ మూమెంట్‌ని ఇచ్చింది. ఏడాది మొత్తంలో చాలా గుడ్‌ మూమెంట్స్‌ ఉన్నాయి. నా బెస్ట్‌ మూమెంట్‌ ఏంటంటే నా మూవీస్‌కు డబుల్‌ షిఫ్ట్స్‌లో వర్క్‌ చేశాను. హార్డ్‌ వర్క్‌ ఉన్న ఆ రోజులన్నీ చాలా గొప్పవి. 2025లో కూడా బెస్ట్‌ ఫెర్‌ఫార్మెన్స్‌ చేయదగిన వర్క్స్‌ వస్తాయని ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలోనూ ఎలాంటి బ్రేక్‌ తీసుకోకుండా వర్క్‌ చేయాలనుకుంటున్నాను. – నిధీ అగర్వాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement