
కౌన్ బనేగా స్మార్ట్ సిటీ?
గత కొంతకాలంగా మనం ఎదురుచూస్తున్న స్మార్ట్ సిటీల జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది.
న్యూఢిల్లీ: అభిమాన హీరో సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ...ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న స్మార్ట్ సిటీల జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. దేశంలో ఉన్న 100 పట్టణాలు, నగరాలను స్మార్ట్ వేదిక మీదకు తీసుకురావడానికి ముహూర్తం ఖరారైంది. కౌన్ బనేగా స్మార్ట్ సిటీ అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది. భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో పోటీలో ఉన్న స్మార్ట్ సిటీల పేర్లను గురువారం కేంద్ర ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది.
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద ‘స్మార్ట్’ నగరాల అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన జాబితాలో రాష్ట్రాల రాజధానులను తోసిరాజని పలు చిన్న నగరాలు చోటు పొందడం విశేషం. ప్రతీ రాష్ట్రంలో కనీసం ఒక స్మార్ట్ సిటీ ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ప్రధాన నగరాలకు చోటు దక్కలేనట్లు తెలుస్తోంది. వీటిలో బీహార్ రాజధాని పాట్నాతో పాటు, బెంగళూరు, కోల్ కతా, తిరువనంతపురం తదితర నగరాలున్నట్లు సమాచారం.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన నామినేషన్లలో.. హిమాచల్‌ప్రదేశ్‌లో సిమ్లాను తోసిరాజని ధర్మశాల చోటుపొందింది. కర్ణాటకలో శివమొగ్గకూ చోటు దక్కింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 13 నగరాలకు చోటు లభించింది.జాబితాలో చేరిన వాటిలో ఇంకా రాయ్‌పూర్, గువాహటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఉంది. ఢిల్లీతోపాటు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకూ చోటు లభించింది. ముంబై, కోల్‌కతా, లక్నో, జైపూర్, రాంచీ, భువనేశ్వర్‌లూ ఇందులో ఉన్నాయి.వీటిపై విశ్లేషించి తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేసి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కోదానికి రూ.200 కోట్ల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. మరి ఆ 100 స్మార్ట్ సిటీలు ఏమిటనేది మరికాసేపట్లో వెల్లడి కానుంది.