ప్రజా సహకారంతోనే స్మార్ట్ సిటీ
త్వరలో స్మార్ట్ సిటీ గెడైన్స్
చిన్నాపురం దత్తత తీసుకున్నా..
మంత్రి గంటా శ్రీనివాసరావు
పెదవాల్తేరు : ప్రజా సహకారం ఉంటేనే విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దగలమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బీచ్ రోడ్డులోని అంబికా సీ గ్రీన్ హోటల్లో ఫియోనిక్స్ సంస్థ నిర్వహించిన లెట్స్ గెట్ స్మార్ట్ కిర్లంపూడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ అంటే అద్దంలాంటి రోడ్లు, విద్యుద్దీపాలు కాదని, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడమేనన్నారు. ఇప్పటికి స్మార్ట్ సిటీపై సరైన ప్రతిపాదనలు లేవని, ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం స్మార్ట్ సిటీ గెడైన్స్ రూపొందించడానికి సమాయత్తమవుతోందన్నారు. వేల కిలో మీటర్లు నడవాలన్నా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. విశాఖ అభివృద్ధికి అడుగులు పడ్డాయని, స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో భాగంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఇంటిగ్రేటెడ్ స్టేడియం, రింగ్ రోడ్లు నగరానికి రానున్నాయన్నారు. పద్మనాభ మండలంలోని చిన్నాపురాన్ని దత్తత తీసుకున్నానని చెప్పారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించి స్మార్ట్ చిన్నాపురంగా తీర్చిదిద్దుతామన్నారు. కిర్లంపూడి లేఅవుట్‌ని స్మార్ట్ సొసైటీగా తయారు చేయడానికి ఫియోనిక్స్ సొల్యూషన్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఎంపీ హరిబాబు మాట్లాడుతూ సమస్యలు లేని దేశంగా రూపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమం అమలు చేశారన్నారు. మన స్థాయిలో నగరాన్ని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఫియోనిక్స్ ప్రతినిధి మురళి మాట్లాడుతూ కిర్లంపూడి లేఅవుట్‌ను స్మార్ట్ సొసైటీగా మార్చడానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. క్లీన్ వైజాగ్, గ్రీన్ వైజాగ్, హెల్దీ వైజాగ్ థీమ్స్‌తో మూడు ప్రాజెక్టులను అమలు చేస్తామన్నారు. తర్వాత సేఫ్ వైజాగ్, డిజిటల్ వైజాగ్ రూపాంతరానికి ప్రతిపాదనలు చేస్తామన్నారు. కిర్లంపూడిలో పారిశుద్ధ్యం, తాగునీరు, వైఫే టెక్నాలజీ, గార్డు సిస్టం, రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఠీఠీఠీ.ౌ్ఛ ఠిజ్డ్చీజ.ౌటజ వెబ్‌సైట్ ప్రారంభించారు. కిర్లంపూడిలో సమస్యలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీకుంటామని తెలిపారు. పోర్టు చైర్మన్ కృష్ణబాబు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీన్‌కుమార్ మాట్లాడుతూ ఫియోనిక్స్ సంస్థ ఒక కాలనీ దత్తతకు తీసుకుని స్మార్ట్ కిర్లంపూడిగా తయారు చేయడానికి సన్నద్ధం కావడం నగరాభివృద్ధికి శుభపరిణామమన్నారు. తమ శాఖపరంగా వారికి పూర్తి సహాయసహకారాలందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఫియోనిక్స్‌ప్రతినిధులు వాణి, సంధ్య, కిర్లంపూడి అసోసియేషన్ అధ్యక్షుడు సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.