
21వ శతాబ్దికి అనుగుణంగా..
- స్మార్ట్ సిటీలపై ప్రధాని నరేంద్ర మోదీ
- ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలో ఏర్పాటు చేయదలచిన స్మార్ట్ సిటీలు 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్లుగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పట్టణాల పరిపాలనను మెరుగుపరచడం ఈ సిటీల పథకం లక్ష్యం కావాలని... పట్టణ ప్రజలతో పాటు పట్టణాలపై ఆధారపడిన ప్రజానీకాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.
సోమవారం ఢిల్లీలో స్మార్ట్ సిటీల అంశంపై జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘స్మార్ట్ సిటీ’లపై కేంద్ర, రాష్ట్రాల పట్టణాభివృద్ధి సంస్థలతో త్వరలో ఒక వర్క్‌షాప్ నిర్వహించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఆదేశించారు. పట్టణాల్లో మెరుగైన పరిపాలన దేశ పరిపాలన బలోపేతం కావడానికి తోడ్పడుతుందన్నారు.
ఈ స్మార్ట్ సిటీలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండాలని చెప్పారు. 21వ శతాబ్ధంలో పట్టణాలు, నగరాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవితం, పౌర కేంద్రీకృత సేవలు వంటివాటిని గుర్తించాలని అధికారులకు సూచిం చారు. ఘనవ్యర్థాల నిర్వహణ, వృథానీటి పునర్వినియోగం వంటి వాటితో వృథా నుంచి సంపదను సృష్టించే చర్యలు చేపట్టాలన్నారు.