స్మార్ట్‌సిటీ ప్రణాళికకు రూ.192 కోట్లు విడుదల
ప్రతి నగరానికీ రూ.2 కోట్లు
► మూడు నెలల్లో ప్రతి నగరం నుంచీ ప్రణాళికలు
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీస్ మిషన్ కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 96 నగరాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.192 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో ప్రతి నగరానికి రూ.2 కోట్ల రూపాయలు స్మార్ట్‌సిటీ ప్రణాళిక రూపకల్పనకు అందిస్తారు. ప్రతి నగర పాలక సంస్థలు సాంకేతిక పరిజ్ఞాన సంస్థల సహాయంతో తమ తమ నగరాలను ఏవిధంగా స్మార్‌సిటీలుగా రూపుదిద్దుతామో సమగ్రమైన ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మూడు నెలల గడువును విధించారు. మూడు నెలల తరువాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చేరిన ప్రణాళికల్లోంచి అత్యుత్తమంగా ఉన్న 20 ప్రణాళికలను ఎంపిక చేసి ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ 20 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి కోసం ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ మిషన్‌లో వంద నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
వీటిలో 98 నగరాలను ఇప్పటికే ఎంపిక చేసింది. ఈ 98 నగరాల్లో న్యూఢిల్లీ, చండీగఢ్‌లకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ త్వరలోనే నిధులను విడుదల చేయనుంది. మిగతా 96 నగరాలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నిధులను సమకూరుస్తుంది. జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి మరో రెండు నగరాల పేర్లు రావలసి ఉంది. మరోవైపు న్యూఢిల్లీలో గురువారం స్మార్ట్‌సిటీలపై ఓ వర్క్‌షాప్ జరిగింది. 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్‌సిటీ ప్రణాళిక నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఇందులో పాల్గొన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. 38 నగరాలకు సంబంధిత నిధుల మంజూరు ఉత్తర్వులను ఈ వర్క్ షాపులో మంత్రి అందజేశారు.