సూడాన్‌లో సైన్యం, పారామిలటరీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రోజు రోజుకి హింసాత్మకంగా మారుతున్న సంగతి తెలసిందే. ఇప్పటి వరకు ఈ పోరులో 300 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చినా పట్టించుకోకుండా ఇరు పక్షాలు ఘర్షణ కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న మూడు వేల మందికి పైగా ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే అక్కడ ఉన్న వారిని భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సూడాన్‌లోని భారతీయుల భద్రత పరిస్థితిపై అధికారులతో వర్చువల్‌గా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సూడాన్‌లోని భారత రాయబారి రవీంద్ర ప్రసాద్ జైస్వాల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూడాన్‌లోని చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారిచడమే గాక క్షేత్ర స్థాయిలో అక్కడ పరిస్థితులకు సంబంధించిన నివేదికను మోదీ సమీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే అధికారులను అప్రమత్తంగా ఉండాలని, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ..పౌరుల తరలింపుకి సంబంధించిన అన్ని రకాల సహాయాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పొరుగు దేశాల తోపాటు సూడాన్‌లో ఉన్న పౌరులతో సంభాషణలు చేయడం వంటి ప్రాముఖ్యతల గురించి నొక్కి చెప్పారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌తో జైశంకర్ చర్చలు
ఈ రోజు తెల్లవారుజామున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సూడాన్‌లోని అధ్వాన్నమైన పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో చర్చించారు. కాల్పుల విరమణ కోసం దౌత్యం జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సూడాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అక్కడ చిక్కుకున్న భారతీయల భద్రత, తరలింపుపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అదీగాక అక్కడ ఉన్న భారతీయ పౌరులు ఉన్నచోటునే ఉండాలని ఖార్టుమ్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.
ఇదిలా ఉండగా, అక్కడ చిక్కుకుపోయిన తమ పౌరులను తరలించేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్న విమానాశ్రయలే రంణరంగాలుగా మారిపోవడంతో అధి సాధ్యం కాకవపోవచ్చని తెలుస్తోంది. కాగా, ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయం ప్రకారం.. సుమారు 2,800 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకుపోయారని, అందులో 1200 మంది సూడాన్‌లోనే 150 ఏళ్లుగా నివశిస్తున్నట్లు సమాచారం.
(చదవండి: ప్రకాష్ సింగ్ బాదల్‌కు అస్వస్థత.. ఆరోగ్య పరిస్థితిపై అమిత్ షా ఆరా)
Comments
Please login to add a commentAdd a comment