భోపాల్: దేశంలో 2014కు ముందు మొత్తం అవినీతి, కుంభకోణాలే రాజ్యమేలాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేద ప్రజల హక్కులను, సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన సొమ్ము వారికి చేరకుండా మధ్యలోనే లూటీ చేశారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ అరాచకానికి తెరపడిందని, ఇప్పుడు ప్రతి పైసా నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకే పంపిస్తున్నామని ఉద్ఘాటించారు.
నీతి ఆయోగ్ నివేదికను ఆయన ప్రస్తావించారు. గత ఐదేళ్లలో ఏకంగా 13.50 కోట్ల మంది భారతీయులు దారిద్య్ర రేఖ దిగువ(పీబీఎల్) కేటగిరీ నుంచి బయటపడ్డారంటూ నీతి ఆయోగ్ ప్రకటించిందని గుర్తుచేశారు. దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. పన్నుల సొమ్మును మంచి పనుల కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న నమ్మకం వారిలో కనిపిస్తోందని చెప్పారు.
సోమవారం మధ్యప్రదేశ్‌లో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. భోపాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ‘అమృతకాలంలో’ తొలి సంవత్సరం నుంచే సానుకూల వార్తలు రావడం ఆరంభమైందని, దేశంలో సంపద వృద్ధి చెందుతోందని, పేదరికం తగ్గిపోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లు దాఖలు చేసే వారి సగటు వార్షికాదాయం ఆదాయం 2014లో రూ.4 లక్షలు ఉండేదని, ఇప్పుడు అది రూ.13 లక్షలకు చేరిందని వెల్లడించారు. ప్రజలు దిగువ ఆదాయ వర్గం నుంచి ఎగువ ఆదాయ వర్గంలోకి చేరుకుంటున్నారని మోదీ తెలిపారు.
దేశమంతటా సానుకూల వాతావరణం
దేశంలో దాదాపు అన్ని రంగాలు బలోపేతం అవుతున్నాయని, అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని ప్రధాని చెప్పారు. 2014లో మన దేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు. కొత్తగా నియమితులైన 5,580 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment