
అప్పుడే 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదుగుతాం
వినోదాలతో, స్టార్లను ఫాలో అవుతూనో కూర్చుంటే కుదరదు
నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారతీయులు మరింత ఎక్కువగా కష్టపడితేనే సాధ్యమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం అవసరమైతే వారానికి 80 గంటలైనా, 90 గంటలైనా పనిచేయాల్సిందేనన్నారు. ‘‘నేను కష్టించి పని చేయాలని విశ్వసిస్తాను. భారతీయులు ఇంకా కష్టపడి పనిచేయాలి. అది వారానికి 80 గంటలు కావచ్చు లేదా 90 గంటలు కావచ్చు.
ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల భారీ లక్ష్యానికి చేరుకోవాలనుకున్నప్పుడు, వినోదాలతో గడిపేస్తూనో, లేకపోతే ఏదో కొందరు సినిమా స్టార్ల అభిప్రాయాలను అనుసరిస్తూనో కూర్చుంటే సాధించలేము’’ అని వ్యాఖ్యానించారు. పటిష్టమైన పని విధానాలతోనే జపాన్, దక్షిణ కొరియా, చైనా ఆర్థిక విజయం సాధించాయని, ప్రపంచ స్థాయి ఎకానమీగా ఎదగాలంటే భారత్ కూడా అలాంటి ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలని చెప్పారు.
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఎన్ని గంటల పని వేళలు ఉండాలనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొందరు కార్పొరేట్ దిగ్గజాలు వారానికి 70–90 గంటలు పని చేయాలంటే, ఎన్ని గంటలు పని చేశామనేది కాదు ఎంత నాణ్యంగా పని చేశామనేది ముఖ్యమని మరికొందరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే.
ఫ్యాషనైపోయింది..
‘‘ఎక్కువగా కష్టపడకూడదంటూ మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. పనుల్లో జాప్యం జరగకుండా, ఖర్చులు పెరిగిపోకుండా, ప్రపంచ స్థాయి నాణ్యతతో, గడువు కన్నా ముందుగా ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే భారత్ కష్టపడి పని చేయాల్సిందే. ఇక పని–కుటుంబ జీవితం మధ్య సమతౌల్యం పాటించాలనే విషయానికొస్తే.. నేను ప్రతి రోజూ వ్యాయామం చేస్తాను. గోల్ఫ్ ఆడతాను. ఇవన్నీ చేస్తూనే నేను ప్రతి రోజూ కష్టపడి పని కూడా చేస్తాను.
మీకు వ్యక్తిగతంగా ఒకటిన్నర గంటలు మీకోసమే పక్కన పెట్టుకున్నా మీకు రోజులో ఇంకా 22.5 గంటలు ఉంటాయి. పని–కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించడానికి బోలెడంత సమయం ఉంటుంది. కష్టపడకపోవడమనేదాన్ని ఏదో ఫ్యాషన్‌గా మార్చొద్దు. పెద్దగా శ్రమించకుండానే భారత్ గొప్ప దేశంగా ఎదగగలదంటూ యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. కష్టపడకుండా ఏ దేశమూ ఎదగలేదు’’ అని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment