ambitious
-
BJP: వ్యూహాలు సిద్ధం.. హుజూరాబాద్‌లో గెలవాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలన్న పార్టీ అధినాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర పార్టీ తదనుగుణ వ్యూహాలు సిద్ధం చేసింది. ఇరవై ఏళ్లకు పైగా టీఆర్ఎస్ ముఖ్యనేతగా, కేసీఆర్ ఉద్యమ సహచరుడిగా కొనసాగి, ఆరు పర్యాయాలు ఎదురులేకుండా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ ఇమేజీ తమకు తప్పకుండా ఉపయోగపడుతుందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన ఈటల వెంట.. ఆ పార్టీ ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు చాలామంది బీజేపీలోకి రాకపోవడంతో సొంతపార్టీ కార్యకర్తలతోనే బూత్‌స్థాయి ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు నడుం బిగిస్తోంది. హుజూరాబాద్ ప్రజల్లో ఈటలకున్న మంచిపేరును వినియోగించుకుని అధికార పార్టీగా టీఆర్ఎస్కు ఉండే అదనపు అవకాశాలను అధిగమించాలని భావిస్తోంది. వ్యూహాత్మకంగా అన్నిస్థాయిల్లో పార్టీ ఇన్చార్జీలను నియమించుకుని ముందుకు సాగుతోంది. ఇప్పుడు గెలిస్తే ‘2023’కు ఊపు అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రధానపోటీదారుగా నిలిచి గణనీయమైన సంఖ్యలో కార్పొరేటర్లు గెలుపొందారు. ఆ తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ పరిస్థితిని అధిగమించి ఇప్పుడు హుజూరాబాద్‌ను చేజిక్కించుకుంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు ఈ విజయం దోహదపడతుందని బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ పోకడలు ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగామని అంచనా వేస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాతే దళిత బంధు స్కీం ప్రకటించడం, హుజూరాబాద్‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలోని అధికార పార్టీ ఎత్తుగడలను కూడా వివరించగలిగామని భావిస్తోంది. దళితబంధు ద్వారా హుజూరాబాద్ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షలు డిపాజిట్ చేసినా ఆ మొత్తాన్ని డ్రా చేయకుండా స్తంభింపచేయడం (ఫ్రీజింగ్)తో ఏర్పడిన అసంతృప్తి, ఇంకా ఈ లబ్ధి అందని వారిలో ఉన్న వ్యతిరేకత వల్ల ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. వికేంద్రీకరణ వ్యూహంతో ఓటర్ల వద్దకు.. ఈసీ వివిధ రూపాల్లో విధించిన ఆంక్షల నేపథ్యంలో తొలుత ఎన్నికల ప్రచారానికి రావాలని భావించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పుడా ఆలోచనను విరమించుకున్నారు. కేవలం వెయ్యిమందితోనే బహిరంగసభలు నిర్వహించాల్సి ఉండడంతో ఇతర ముఖ్యనేతలు సైతం ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎక్కడకక్కడ వికేంద్రీకరణ వ్యూహాన్ని అనుసరించాలని నేతలు నిర్ణయించారు. వివిధ మండలాలు, గ్రామాలుగా చిన్న చిన్న బృందాలుగా విడిపోయి వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. బూత్ స్థాయిలో శక్తి కేంద్రాలు క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ సమన్వయానికి, పోలింగ్ బూత్‌స్థాయిలో విస్తృత ప్రచారానికి శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగైదు పోలింగ్ బూత్‌లను కలిపి లేదా ఒకటి, రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఇప్పటికే మొత్తం 98 శక్తి కేంద్రాలకు స్థానిక ఇన్చార్జిల నియామకం పూర్తయింది. ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీలో ఉన్న ఓటర్లను కలిసి, సమన్వయం చేసేందుకు పన్నా ప్రముఖ్ (ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ ఓటర్ల ఇన్చార్జి)లను నియమించారు. దసరా తర్వాత దూకుడే... దసరా పండుగ దాకా ‘గ్రౌండ్‌వర్క్’పూర్తిచేసి ఆ తర్వాత ఒక్కసారిగా దూకుడు పెంచాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ వేడిపెంచి ప్రచారాన్ని ఉధృతం చేసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈనెల 15 తర్వాత రాష్ట్రపార్టీ నాయకత్వం మొదలు, అన్నిస్థాయిల్లోని నాయకులు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రణాళికల రూపకల్పన, ప్రచారంలో నిమగ్నమై ప్రత్యక్షంగా ఆయా అంశాలను పర్యవేక్షించనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పోటీపడుతుండగా, కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కేసీఆర్ వ్యూహం ఇక్కడ పనిచేయదు ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయం. అధికార టీఆర్ఎస్ ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు వాటికి లొంగే పరిస్థితే లేదు. హుజూరాబాద్ ఆత్మగౌరాన్ని ప్రజలు కాపాడుకుంటారు. కేసీఆర్ ఏ వ్యూహం పన్నినా ఇక్కడ పనిచేయదు. వారి అబద్ధపు అస్త్రాలన్నీ ఖర్చయిపోయాయి. తమ గుండెల్లో నిలిచి, వారిని అనేక సందర్భాల్లో, కష్టకాలంలో ఆదుకున్న ఈటల పక్షానే ప్రజలు నిలవబోతున్నారు. ఏ ఊరికి వెళ్లినా అంతా ఈటల నామస్మరణే చేస్తున్నారు. కమలం గుర్తుకే ఓటేస్తామని కరాఖండిగా చెబుతున్నారు. – బీజేపీ హుజూరాబాద్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఏపీ జితేందర్‌రెడ్డి -
జీవితాశయాలకే ప్రాధాన్యం
ముంబై: జీవితమన్నాక ఒక ఆశయం ఉండాలి. అది సాధించడానికి కష్టపడాలి. అంతిమంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యతనిస్తూనే కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలి. ఇదీ మన భారతీయ మహిళల మనోగతం.. మహిళా ఉద్యోగుల్లో 89శాతం మంది తమకంటూ ఆశయం ఉండాలని, అదే అత్యంత ముఖ్యమని చెప్పారని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ , న్యూయార్క్‌కు చెందిన మహిళా సంస్థ యాంబిషియస్ ఇన్సైట్స్ సంయుక్త సర్వే వెల్లడించింది. జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకొని దానిని సాధించడం అంత సులభమేమీ కాదు. అందులో ఎన్నో కోణాలుంటాయి. వృత్తిపరమైన విజయాలు, ఆర్థిక స్వాతంత్య్రం, నైపుణ్యం, వ్యక్తిగత ఆరోగ్యం, పిల్లల పెంపకం, కుటుంబ బాంధవ్యాలు పటిష్టంగా ఉండడం వంటివన్నీ అందులో మిళితమై ఉంటాయి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అటు వృత్తిపరంగా, ఇటు వ్యక్తిగతంగా అద్భుతమైన ఫలితాలు సాధించాలన్న తపన భారతీయ మహిళల్లోనే ఎక్కువగా ఉందని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఇండియా సీఈఓ మనోజ్ అద్లాఖా అన్నారు. భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని వారికి అవకాశం వస్తే తాము అనుకున్నది సాధించి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తారని ఆయన కొనియాడారు. సర్వే ఇలా.. విశ్వవిద్యాలయాల్లో చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న 21–64 ఏళ్ల మధ్య వయసున్న 3,026 మంది మహిళల్ని ఆన్లైన్ ద్వారా సర్వే చేశారు. గత నెల జనవరి 10–16 మధ్య జరిగింది. భారత్ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, మెక్సికో, యూకేలలో సర్వే నిర్వహించారు. ఆశయ సాధనలో.. భారత్: 89% మెక్సికో: 82% అమెరికా: 68% ఫ్రాన్స్: 41% జపాన్: 28% వ్యక్తిగత అంశాల్లో.. భారత్: 91% ప్రపంచ సగటు: 68% కెరీర్లో.. భారత్: 78% మెక్సికో: 69% అమెరికా: 44% జపాన్: 17% -
నేడే ‘మేస్’ పయనం!
ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద టెలిస్కోప్ సంస్థ ఆవరణలో ప్రతిష్టాత్మక ‘లైవ్‌షో’ కుషాయిగూడ: ప్రపంచంలోనే అతిపెద్ద రెండో టెలిస్కోప్‌ను భారత్ శాస్త్రవేత్తలు రూపొందించారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగాల్లో భారత్ అగ్రదేశాలకు తీసిపోదని దీంతో మరోసారి రుజువైంది. ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పి.సుధాకర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘మేజర్ అట్మాస్ఫెరిక్ చెరింకోవ్ ఎక్స్పరిమెంట్’ (మేస్) పనితీరును వివరించారు. ఇది సూర్యుని నుంచి వెలువడే ‘గామా’ కిరణాలు వాతావరణం చూపుతున్న ప్రభావంపై పరిశోధనలు చేస్తుందని, దీని ద్వారా విశ్వ రహస్యాలు కనుగొనేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో బార్క్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం హెడ్ డాక్టర్ వై.ఎస్.మయ్యా, బార్క్ శాస్త్రవేత్తలు ఏ.కే.సిన్హా, రమేష్ కుమార్ కౌల్ తదితరులు పాల్గొన్నారు. బార్క్ పర్యవేక్షణలో... మన దేశ శాస్త్ర పరిశోధన రంగాభివృద్ధికి ప్రతీకగా నిలిచే ‘మేస్’ రూపకల్పన ముంబయిలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పర్యవేక్షణలో జరిగింది. 25 మందికి పైగా ఈసీఐఎల్ శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమించారు. చంద్రయాన్-1 లూనార్ మిషన్‌లో కూడా ఈ శాస్త్రవేత్తలు తమ సేవలనందించారు. ‘లడఖ్’లో ఏర్పాటు... జమ్ముకాశ్మీర్ పరిధిలో ఉన్న ‘లడఖ్’ ప్రాంతంలోని ‘హన్లే’ అనే ఎత్తై ప్రదేశంలో ఏర్పాటు చేయనున్న ఈ ‘మేస్’ టెలిస్కోప్ శనివారం ఉదయం 9 గంటలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉత్తర భారత దేశానికి పయనమవుతోంది. అణు ఇంధన శాఖ కార్యదర్శి, కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆర్.కె.సిన్హా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ టెలిస్కోప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ‘మేస్’ ముఖ్యాంశాలు పేరు: మేజర్ అట్మాస్ఫెరిక్ చెరింకోవ్ ఎక్స్పరిమెంట్ (మేస్) ఎత్తు: 21 డయా మీటర్లు బరువు: 180 టన్నులు ప్రాజెక్టు వ్యయం: రూ.45కోట్లు అమర్చినవి: 356 అతి శక్తివంతమైన అద్దం పలకలు, హై రెజల్యూషన్‌తో కూడిన 1080 మెగాపిక్సెల్ కెమెరా రూపకల్పన: ఈసీఐఎల్ సహకార సంస్థలు: ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ పర్యవేక్షణలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ (టీఐఎఫ్ఆర్) ప్రాజెక్టు ప్రారంభం: రెండేళ్ల క్రితం ప్రాజెక్టు పూర్తి, పరిశోధనలు ప్రారంభం: జనవరి 2016లో ప్రయాణం: భూమి మార్గం ద్వారా 2,500కి.మీ.లు నిర్దేశిత ప్రాంతంలో బిగింపు పూర్తి: 2015 అక్టోబరు నాటికి పనితీరు: టెలిస్కోప్‌లో అమర్చిన హై రెజల్యూషన్ కెమెరా 26డిగ్రీల నుంచి 270డిగ్రీల కోణంలో 27మీటర్ల వ్యాసంలోని పరిధిలో గామా కిరణాలను చిత్రీకరించి, భూమిపై ఉండే కంట్రోల్ రూంకు చేరవేస్తుంది. ఈ కంట్రోల్ రూం నుంచే టెలిస్కోప్‌ను నియంత్రిస్తారు. -
కొలువుదీరేదెన్నడు?
పరోక్ష ఎన్నికలపై తొలగని ప్రతిష్టంభన - నీరసిస్తున్న ఆశావహులు - మారుతున్న సమీకరణలు - అభ్యర్థులకు చుక్కలు చూపుతున్న జంప్‌జిలానీలు కరీంనగర్ సిటీ: ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని అయోమయ పరిస్థితి పరోక్ష ఎన్నికల విషయంలో నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడి నలభై రోజులు దాటుతున్నా ఇప్పటివరకు అధ్యక్ష ఎన్నికపై స్పష్టత రాలేదు. రాష్ట్ర విభజన, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, అసెంబ్లీ సమావేశాలు.. నెపం ఏదైనా చైర్మన్ ఎన్నికలకు ముహూర్తం కుదరడం లేదు. ఇప్పటివరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయకపోవడం, కనీసం ఆ దిశగా కసరత్తు చేయకపోవడంతో గందరగోళ పరిస్థితి తలెకొంది. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని ఎన్నికకు ఉత్సాహంతో క్యాంప్‌లు వేసిన ఆశావాహులు ప్రస్తుత పరిస్థితితో బేజారెత్తిపోతున్నారు. క్యాంపుల నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుంటే కండ్లు తేలేసి.. మళ్లీ వేద్దాంలే అంటూ నుంచి ఇంటిబాట పడుతున్నారు. ఇదే అదనుగా ప్రత్యర్థులు గాలం వేయడంతో సభ్యులు కప్పదాట్లకూసై అంటున్నారు. నలభై రోజులు దాటినా ఊసేది? మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. మే 12న మున్సిపల్, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు వెలువడి 40 రోజులు దాటుతున్నా జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవుల ఎన్నికలపై ఎన్నికల సంఘం ఎటూ తేల్చలేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి విచిత్ర పరిస్థితి ప్రజాప్రతినిధులకు ఎదురవలేదు. గతంలో కౌంటింగ్ కేంద్రాల నుంచే విజేతలను క్యాంపులకు తరలించేవాళ్లు. వారం రోజుల్లోపు చైర్మన్ ఎన్నిక తేలిపోయేది. ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రజాప్రతినిధులకు గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయింది. కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయకపోవడం ఇబ్బందిగా మారింది. చైర్మన్ ఎన్నికలో ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లు కూడా కీలకమవుతుండటంతో శాసనసభ కొలువు తీరాక, ప్రమాణస్వీకారం చేసిన తరువాత నోటిఫికేషన్ విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాలు పూర్తయినా ఎలాంటి స్పందన లేదు. ఎన్నికల సంఘం విభజన కాకపోవడం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు కొనసాగుతుండటంతో అవి పూర్తయ్యాక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కలవరపెడుతున్న జంప్‌జిలానీలు నానాతంటాలు పడి మద్దతుకు హామీ తీసుకొని క్యాంపులకు తీసుకెళ్తే ఎన్నిక నిర్వహించకపోవడంతో సభ్యుల మనసు మారకుండా చూడటం చైర్మన్ అభ్యర్థులకు మరో పరీక్షగా మారింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు కావస్తుండటంతో రాజకీయ సమీకరణలు తారుమారవుతున్నాయి. జిల్లాలో 57 మండలాలకు 29 స్థానాల్లో టీఆర్ఎస్, 11 మండలాల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాగా, 17 మండలాల్లో హంగ్ ఏర్పడింది. కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థల్లో ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి టీఆర్ఎస్ మెజారిటీ సాధించగా, కాంగ్రెస్ పార్టీ సైతం చాపకిందనీరులా తమ ప్రయత్నాలు సాగిస్తోంది. పెద్దపల్లి నగరపంచాయతీ నువ్వానేనా అన్నట్లుగా ఉంది. క్యాంపు రాజకీయాలంటేనే కప్పదాట్లకు నిలయం. ఒక పార్టీ క్యాంపులో ఉన్నా, మరో పార్టీ ఆశావాహులు వారితో టచ్ లో ఉంటూ తమవైపు జంప్ చేసేలా ‘మాట్లాడుకుంటున్నారు’. ఇందుకు తగినట్లుగానే కొన్ని ప్రాంతాల్లో ఒక క్యాంపు నుంచి వచ్చి మరో క్యాంపునకు వెళ్లగా, మరికొంతమంది ఎన్నికల నాటికి పార్టీ మారుస్తామని ఒట్టేస్తున్నారు. కమాన్‌పూర్‌లో కాంగ్రెస్ క్యాంపు నిర్వహించి తిరిగి రాగా, టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎనిమిది మంది ఎంపీటీసీలు క్యాంపు మార్చారు. కాంగ్రెస్ క్యాంపు నుంచి వచ్చి తిరిగి టీఆర్ఎస్ క్యాంపులో చేరడంతో ఎంపీపీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ముగింపు ఎప్పుడో...? పరోక్ష ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు ముగింపు ఎప్పుడనేది ప్రజాప్రతినిధుల మదిని తొలుస్తోంది. ఇప్పుడు...అప్పుడు అంటూ ప్రచారం జరగడం, ఆశావాహులు, పార్టీ నేతలు హడావుడి పడటం, ఆ తరువాత ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నీరుగారిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు పూర్తయ్యాక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందని పార్టీలన్నీ బలంగా విశ్వసిస్తున్నాయి. దీంతో మళ్లీ క్యాంపులపై నేతలు దృష్టిసారిస్తున్నారు. మొత్తానికి పరోక్ష ఎన్నిక ఆశావాహుల్లో గుబులు పుట్టస్తుంటే, ఏదైనా జరగకపోతుందా అనే కోణంలో ప్రత్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. -
బాబు మూడు కాళ్ల థియరీ!
రాష్ట్రంలో రెండు కళ్ల సిద్ధాంతం.. కేంద్రంలో మూడు కాళ్ల థియరీ...!! టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలి కాలంలో కొత్త థియరీతో ముందుకు వెళుతున్నారట. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాత చంద్రబాబు రాష్ట్రంలో రెండు కళ్ల సిద్ధాంతమని చెప్పుకున్న విషయం తెలుసు. మరి కొత్తగా ఈ మూడు కాళ్ల థియరీ ఏమిటన్న అంశంపై టీడీపీలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఎన్టీఆర్‌ను గద్దె దింపి సీఎం అయినప్పటి నుంచి చంద్రబాబు ఎక్కడికెళ్లినా రెండు వేళ్లను చూపుతూ అభివాదం చేశారు. 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాత రెండు కళ్ల సిద్ధాంతం మొదలుపెట్టారట. ఏ సిద్ధాంతం చెప్పినా... కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ అసలు సిద్ధాంతానికే చంద్రబాబు తిలోదకాలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించే పనిలో పడిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిందట. ఆ కారణంగానే ఇప్పుడు మూడు కాళ్ల థియరీ తెరమీదకొచ్చిందని టీడీపీలో గుసగుసలాడుతున్నారు. ఇంతకు ఈ థియరీ ఏమిటని ఆరా తీస్తే...! రాష్ట్రంలో ఎలాగూ గెలవలేమని తెలిసి కేంద్రంలో అధికార హోదాపై కన్నేసిన చంద్రబాబు అందుకు లోతుగానే అంచనాలు వేసుకుంటున్నారట. సాధారణ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కారే తిరిగి ఏర్పడుతుందా? లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఉంటుందా? ఇవేవీ కాకుండా మూడో ప్రత్యామ్నాయం అధికారంలోకి వస్తుందా? ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉన్నందున... తనకొచ్చే ఒకటిరెండు సీట్లతోనైనా ఎవరు అధికారంలోకి వచ్చినా అందులో చేరడం, అనుకున్న హోదా దక్కించుకోవడం కోసం... ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఆ మూడు ఫ్రంట్ల నేతలతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారట. అదే మూడు కాళ్ల థియరీ!!!