నేడే ‘మేస్’ పయనం!
- ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద టెలిస్కోప్
- సంస్థ ఆవరణలో ప్రతిష్టాత్మక ‘లైవ్‌షో’
కుషాయిగూడ: ప్రపంచంలోనే అతిపెద్ద రెండో టెలిస్కోప్‌ను భారత్ శాస్త్రవేత్తలు రూపొందించారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగాల్లో భారత్ అగ్రదేశాలకు తీసిపోదని దీంతో మరోసారి రుజువైంది. ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పి.సుధాకర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘మేజర్ అట్మాస్ఫెరిక్ చెరింకోవ్ ఎక్స్‌పరిమెంట్’ (మేస్) పనితీరును వివరించారు.
ఇది సూర్యుని నుంచి వెలువడే ‘గామా’ కిరణాలు వాతావరణం చూపుతున్న ప్రభావంపై పరిశోధనలు చేస్తుందని, దీని ద్వారా విశ్వ రహస్యాలు కనుగొనేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో బార్క్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం హెడ్ డాక్టర్ వై.ఎస్.మయ్యా, బార్క్ శాస్త్రవేత్తలు ఏ.కే.సిన్హా, రమేష్ కుమార్ కౌల్ తదితరులు పాల్గొన్నారు.
బార్క్ పర్యవేక్షణలో...
మన దేశ శాస్త్ర పరిశోధన రంగాభివృద్ధికి ప్రతీకగా నిలిచే ‘మేస్’ రూపకల్పన ముంబయిలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పర్యవేక్షణలో జరిగింది. 25 మందికి పైగా ఈసీఐఎల్ శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమించారు. చంద్రయాన్-1 లూనార్ మిషన్‌లో కూడా ఈ శాస్త్రవేత్తలు తమ సేవలనందించారు.
‘లడఖ్’లో ఏర్పాటు...
జమ్ముకాశ్మీర్ పరిధిలో ఉన్న ‘లడఖ్’ ప్రాంతంలోని ‘హన్లే’ అనే ఎత్తై ప్రదేశంలో ఏర్పాటు చేయనున్న ఈ ‘మేస్’ టెలిస్కోప్ శనివారం ఉదయం 9 గంటలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉత్తర భారత దేశానికి పయనమవుతోంది. అణు ఇంధన శాఖ కార్యదర్శి, కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆర్.కె.సిన్హా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ టెలిస్కోప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.
‘మేస్’ ముఖ్యాంశాలు
పేరు: మేజర్ అట్మాస్ఫెరిక్ చెరింకోవ్ ఎక్స్‌పరిమెంట్ (మేస్)
ఎత్తు: 21 డయా మీటర్లు
బరువు: 180 టన్నులు
ప్రాజెక్టు వ్యయం: రూ.45కోట్లు
అమర్చినవి: 356 అతి శక్తివంతమైన అద్దం పలకలు, హై రెజల్యూషన్‌తో కూడిన 1080 మెగాపిక్సెల్ కెమెరా
రూపకల్పన: ఈసీఐఎల్
సహకార సంస్థలు: ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ పర్యవేక్షణలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ (టీఐఎఫ్‌ఆర్)
ప్రాజెక్టు ప్రారంభం: రెండేళ్ల క్రితం
ప్రాజెక్టు పూర్తి, పరిశోధనలు ప్రారంభం: జనవరి 2016లో
ప్రయాణం: భూమి మార్గం ద్వారా 2,500కి.మీ.లు
నిర్దేశిత ప్రాంతంలో బిగింపు పూర్తి: 2015 అక్టోబరు నాటికి
పనితీరు: టెలిస్కోప్‌లో అమర్చిన హై రెజల్యూషన్ కెమెరా
26డిగ్రీల నుంచి 270డిగ్రీల కోణంలో 27మీటర్ల వ్యాసంలోని పరిధిలో గామా కిరణాలను చిత్రీకరించి, భూమిపై ఉండే కంట్రోల్ రూంకు చేరవేస్తుంది. ఈ కంట్రోల్ రూం నుంచే టెలిస్కోప్‌ను నియంత్రిస్తారు.