Electronics Corporation of India Limited
-
దరఖాస్తు చేశారా?
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 14 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీలో.. ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్.. పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 25 నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ - ఇండియాలో ఫెలోస్/సీనియర్ ఫెలోస్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 27 -
విశ్వ రహస్యాల అన్వేషణకు ‘భేష్’!
చుక్కల లోకం గుట్టు విప్పాలి. గామా కిరణాల లోగుట్టు పసిగట్టాలి. ఖగోళ చరిత్రను మలుపు తిప్పాలి. ఈసీఐఎల్ మేస్ టెలిస్కోపు అదే చేయబోతోంది అందుకే లడఖ్‌కు బయలుదేరింది... విశ్వాంతరాళాల నుంచి దూసుకువచ్చి లిప్తపాటులో మాయమయ్యే కాంతిపుంజాలను ఒడిసిపడితేనే అల్లంత దూరంలోని చుక్కల లోకం గుట్టు తెలుస్తుంది. నక్షత్రాలు, వాటి పేలుళ్ల వెనక ఉన్న మర్మం అంతు పడుతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూనే రూపుమార్చుకునే గామా కిరణాల ఉనికిని గుర్తిస్తేనే ఖగోళం సంగతులు అర్థమవుతాయి. అందుకే.. గామా కిరణాల గుట్టు విప్పేందుకు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) శాస్త్రవేత్తలు మేస్ టెలిస్కోపును తయారు చేశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోపు, ఎత్తై ప్రదేశంలో ఏర్పాటుచేసే అతిపెద్ద టెలిస్కోపు అయిన మేస్ ఇంతకూ ఏం చేస్తుంది? దీని కథాకమామిషు ఏమిటి? గామా కిరణాలపై నిఘా నేత్రం... విశ్వం పుట్టు, పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలంటే రోదసిలో సుదూర తీరాల నుంచి దూసుకువచ్చే శక్తిమంతమైన గామా కిరణాలపై అధ్యయనం ఓ మంచి అవకాశం. మిలమిల మెరిసే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రపేలుడు అవశేషాలు, గెలాక్సీ కేంద్రాలు, మొదలైన వాటి నుంచి వెలువడే గామా కిరణాలపై అధ్యయనం వల్ల వాటి గురించి తెలుసుకునేందుకు వీలవుతుంది. తద్వారా ఖగోళ భౌతికశాస్త్రం, ప్రాథమిక భౌతికశాస్త్రం, గామా కిరణాల ఆవిర్భావం, వాటి వేగం వెనక ఉన్న ప్రక్రియ గురించి మరింత బాగా అవగాహన చేసుకోవచ్చు. అయితే ఈ గామా కిరణాలు అత్యధిక శక్తితో దూసుకొస్తుంటాయి. చాలా శక్తితో కూడిన ఈ ఫొటాన్లను భూమిపై నుంచి నేరుగా గుర్తించడం సాధ్యం కాదు. మామూలుగా అయితే ఇవి నేరుగా భూమికి చేరితే జీవకోటి ఉనికికే ప్రమాదకరం. కానీ ఈ కిరణాలు భూవాతావరణంలోకి ప్రవేశించగానే విద్యుదావేశ కణాలను వెదజల్లుతాయి. ఫలితంగా నీలికాంతితో కూడిన రేడియేషన్ ఫ్లాష్ మాదిరిగా మెరిసి మాయమైపోతుంది. ఇదెంత వేగంగా జరుగుతుందంటే ఒక సెకనులో కొన్ని వందల కోట్ల వంతు సమయంలోనే. దీనినే సెరెంకోవ్ కాంతి లేదా సెరెంకోవ్ రేడియేషన్ అంటారు. ఈ కాంతిని గుర్తించి ఫొటోలు తీయడంతోపాటు ఇతర సమాచారాన్ని అందించడమే మేస్ టెలిస్కోపు పని అన్నమాట. పనితీరు ఇలా... మేస్ టెలిస్కోపులో కాంతిని పసిగట్టేందుకు 356 అద్దాల పలకలు ఉంటాయి. టెలిస్కోపు కేంద్రభాగంలో ప్రతిఫలించే సెరెంకోవ్ ప్రక్రియలు, వాటి లక్షణాలను పసిగట్టేందుకు 1200 కిలోల బరువైన హైరెసోల్యూషన్ ఇమేజింగ్ కెమెరా ఉంటుంది. ఇది సెరెంకోవ్ కాంతిని ప్రతిఫలింపచేసే లైట్ కలెక్టర్లకు అభిముఖంగా ఉంటుంది. వీటన్నిటి సమన్వయంతో గామా రే ఫొటాన్ను శక్తిని, చిత్రాన్ని ఈ టెలిస్కోపు రికార్డు చేస్తుంది. సమాచారాన్ని గంటకు 50 జీబీల వేగంతో ఆప్టికల్ ఫైబర్ ద్వారా కంట్రోల్‌రూంలోని కంప్యూటర్ సిస్టమ్‌కు చేరవేస్తుంది. ఆరు చక్రాలతో ఉండే మేస్ ఆకాశంలో ఏ దిక్కున ఉన్న ఖగోళ వస్తువునైనా పరిశీలించేందుకు అనుగుణంగా తిరగగలదు. ఇప్పటిదాకా అమెరికా, యూరోప్వంటి దేశాలు, సమాఖ్యలే ఇంత భారీ టెలిస్కోపులను నిర్మించాయి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (ముంబై) సహకారంతో దీనిని ఈసీఐఎల్ స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించింది. సౌర విద్యుత్‌తో పనిచేసే మేస్ ప్రారంభమైతే.. గామా రే అధ్యయనంలో భారత్ కీలక స్థానంలో నిలవనుంది. ప్రత్యేకతలు... ప్రపంచంలో ఎక్కడినుంచైనా దీనిని రిమోట్‌తో నియంత్రించవచ్చు. గంటకు 30 కి.మీ. వేగంతో గాలులు వీచినా స్థిరంగా నిలబడగలదు. పార్కింగ్ పొజిషన్లో ఉంచితే గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. నిర్దేశిత ఖగోళ వస్తువును నిరంతరాయంగా, కచ్చితత్వంతో అనుసరిస్తుంది. దిశను, ఎత్తును కూడా ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది. ‘మేస్’డేటా! పూర్తిపేరు: మేజర్ అట్మాస్ఫెరిక్ సెరెంకోవ్ ఎక్స్పెరిమెంట్ (మేస్) గుర్తింపు: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోపు ఎత్తై ప్రాంతంలో ఏర్పాటయ్యే అతిపెద్ద టెలిస్కోపు ఎత్తు: సముద్రమట్టానికి 4,500 మీటర్లు వ్యాసం: 21 మీటర్లు బరువు: 180 టన్నులు ఖర్చు: రూ.45 కోట్లు స్థలం: హన్లే, లడఖ్ ప్రారంభం: 2016, జనవరిలో -
నేడే ‘మేస్’ పయనం!
ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద టెలిస్కోప్ సంస్థ ఆవరణలో ప్రతిష్టాత్మక ‘లైవ్‌షో’ కుషాయిగూడ: ప్రపంచంలోనే అతిపెద్ద రెండో టెలిస్కోప్‌ను భారత్ శాస్త్రవేత్తలు రూపొందించారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగాల్లో భారత్ అగ్రదేశాలకు తీసిపోదని దీంతో మరోసారి రుజువైంది. ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పి.సుధాకర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘మేజర్ అట్మాస్ఫెరిక్ చెరింకోవ్ ఎక్స్పరిమెంట్’ (మేస్) పనితీరును వివరించారు. ఇది సూర్యుని నుంచి వెలువడే ‘గామా’ కిరణాలు వాతావరణం చూపుతున్న ప్రభావంపై పరిశోధనలు చేస్తుందని, దీని ద్వారా విశ్వ రహస్యాలు కనుగొనేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. విలేకరుల సమావేశంలో బార్క్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం హెడ్ డాక్టర్ వై.ఎస్.మయ్యా, బార్క్ శాస్త్రవేత్తలు ఏ.కే.సిన్హా, రమేష్ కుమార్ కౌల్ తదితరులు పాల్గొన్నారు. బార్క్ పర్యవేక్షణలో... మన దేశ శాస్త్ర పరిశోధన రంగాభివృద్ధికి ప్రతీకగా నిలిచే ‘మేస్’ రూపకల్పన ముంబయిలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పర్యవేక్షణలో జరిగింది. 25 మందికి పైగా ఈసీఐఎల్ శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమించారు. చంద్రయాన్-1 లూనార్ మిషన్‌లో కూడా ఈ శాస్త్రవేత్తలు తమ సేవలనందించారు. ‘లడఖ్’లో ఏర్పాటు... జమ్ముకాశ్మీర్ పరిధిలో ఉన్న ‘లడఖ్’ ప్రాంతంలోని ‘హన్లే’ అనే ఎత్తై ప్రదేశంలో ఏర్పాటు చేయనున్న ఈ ‘మేస్’ టెలిస్కోప్ శనివారం ఉదయం 9 గంటలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉత్తర భారత దేశానికి పయనమవుతోంది. అణు ఇంధన శాఖ కార్యదర్శి, కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆర్.కె.సిన్హా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ టెలిస్కోప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ‘మేస్’ ముఖ్యాంశాలు పేరు: మేజర్ అట్మాస్ఫెరిక్ చెరింకోవ్ ఎక్స్పరిమెంట్ (మేస్) ఎత్తు: 21 డయా మీటర్లు బరువు: 180 టన్నులు ప్రాజెక్టు వ్యయం: రూ.45కోట్లు అమర్చినవి: 356 అతి శక్తివంతమైన అద్దం పలకలు, హై రెజల్యూషన్‌తో కూడిన 1080 మెగాపిక్సెల్ కెమెరా రూపకల్పన: ఈసీఐఎల్ సహకార సంస్థలు: ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ పర్యవేక్షణలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ (టీఐఎఫ్ఆర్) ప్రాజెక్టు ప్రారంభం: రెండేళ్ల క్రితం ప్రాజెక్టు పూర్తి, పరిశోధనలు ప్రారంభం: జనవరి 2016లో ప్రయాణం: భూమి మార్గం ద్వారా 2,500కి.మీ.లు నిర్దేశిత ప్రాంతంలో బిగింపు పూర్తి: 2015 అక్టోబరు నాటికి పనితీరు: టెలిస్కోప్‌లో అమర్చిన హై రెజల్యూషన్ కెమెరా 26డిగ్రీల నుంచి 270డిగ్రీల కోణంలో 27మీటర్ల వ్యాసంలోని పరిధిలో గామా కిరణాలను చిత్రీకరించి, భూమిపై ఉండే కంట్రోల్ రూంకు చేరవేస్తుంది. ఈ కంట్రోల్ రూం నుంచే టెలిస్కోప్‌ను నియంత్రిస్తారు. -
భారీ టెలిస్కోప్.
- ఈసీఐఎల్ చరిత్రలో మరో కలికితురాయి - ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్ ‘మేస్’ రూపకల్పన హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) చరిత్రలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్ ‘మేజర్ అట్మాస్ఫెరిక్ చెరింకోవ్ ఎక్స్పరిమెంట్’ (మేస్) రూపకల్పనతో మరోసారి వార్తల్లో నిలిచింది. సూర్యుని నుంచి వెలువడే ‘గామా’ కిరణాలు మన వాతావరణంపై చూపుతున్న ప్రభావానికి సంబంధించి ఈ పరిశోధనలు కొనసాగుతాయని, దీనిద్వారా విశ్వ మానవాళికి ఎంతో ఉపయోగపడే ఫలితాలు రాబట్టవచ్చునని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. దాదాపు 21 మీ.ల ఎత్తు, 180 టన్నుల బరువు ఉండే ఈ టెలిస్కోప్‌లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా -26 డిగ్రీల నుంచి 270 డిగ్రీల కోణంలో 27 మీటర్ల వ్యాసార్థ పరిధిలో గామా కిరణాలను చిత్రీకరించి, భూమిపై ఉండే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. ఈ కంట్రోల్ రూమ్ నుంచే టెలిస్కోప్‌ను నియంత్రిస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో దాదాపు 28మీటర్ల ఎత్తు ఉన్న ‘హెస్’ టెలిస్కోప్ నమీబియాలో ఉంది. ‘లడఖ్’లో ఏర్పాటు... జమ్మూకాశ్మీర్ పరిధిలో ఉన్న ‘లడఖ్’ ప్రాంతంలోని హన్లే వద్ద ఏర్పాటు చేయనున్న ఈ ‘మేస్’ టెలిస్కోప్ ఈ నెల 28న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉత్తర భారతదేశానికి పయనమవుతోంది. -
ఈసీఐఎల్.. ఈవీఎం సృష్టికర్త
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామి సంస్థ. నాలుగున్నర దశాబ్దాలుగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, ఎలక్ట్రానిక్స్ యంత్రాల తయారీలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన సంస్థ అది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పరిచయం చేసిన ఈసీఐఎల్.. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలోనే 48వ సంవత్సరంలోకి ప్రవేశించడం సందర్భోచితం. ఏప్రిల్ 11న ఈసీఐఎల్ ఆవిర్భావ దినం. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ఈవీఎంల తయారీలో రికార్డ్ పారదర్శకతకు ప్రతిబింబంగా నిలిచే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రూపొందించిన ఈసీఐఎల్.. ఈ ఏడాది లక్షా 87 వేల యంత్రాలను అందజేసి చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. దశాబ్ద కాలంగా మొత్తం 7.4 లక్షల ఈవీఎంలను తయారుచేసి అగ్రగామి సంస్థగా నిలిచింది. గతంలో జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోను ఈసీఐఎల్ తయారు చేసిన ఓటింగ్ యంత్రాలనే వినియోగించారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ ఈ సంస్థ తయారుచేసిన ఓటింగ్ యంత్రాలనే వినియోగిస్తున్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంల వినియోగం మరింత పెరగనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్(ఏడీయు), డిటాచబుల్ మెమొరీ మాడ్యుల్ (డీఎంఎం) వంటి పరికరాలతో రూపొందించే ఈవీఎంలు ఓటరు తీర్పును సురక్షితంగా కాపాడతాయి. ఈసారి ఈ యంత్రాలలో ‘పైవారు ఎవరూ కాదు’ (నోటా-నన్ ఆఫ్ ద ఎబోవ్) అనే మీటను కూడా తాజాగా ఏర్పాటు చేసింది. వీటిలో లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతోందీ సంస్థ. ఇందుకోసం చర్లపల్లిలో ఒక ప్రత్యేక కేంద్రాన్నే ఏర్పాటు చేశారు. ఈవీఎంల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ఈటీడీసీ) కూడా ఈసీఐఎల్‌కు అనుబంధంగా పని చేస్తోంది. -
‘నిర్భయ’ పేరున ఎలక్ట్రానిక్ పరికరం
=ముంబైలో విడుదల = ఈసీఐఎల్ ఆధ్వర్యంలో తయారీ =త్వరలో నగర మార్కెట్లోకి.. కుషాయిగూడ,న్యూస్‌లైన్: ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ ‘నిర్భయ’ పేరిట తయారు చేసిన ఎలక్ట్రానిక్ పరికరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఆపదలో ఉన్న మహిళకు సహాయకారిగా ఉండేలా ఒక్క స్విచ్‌తో తాను ఎక్కడ ఉందీ, ఏ పరిస్థితుల్లో ఉందీ...తదితర విషయాలను ముందుగా నిర్దేశించిన నంబర్లకు సమాచారమందడం ఈ పరికరం ప్రత్యేకత. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ ఉదంతంతో పాటు హైటెక్‌సిటీలో చోటుచేసుకున్న ‘అభయ’ ఘటనల నేపథ్యంలో ‘గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం’తో ఈ పరికరం పనిచేస్తుంది. ఈ పరికరాన్ని శుక్రవారం ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అణు ఇంధనవిభాగం (డీఏఈ) చైర్మన్ డాక్టర్ రతన్‌కుమార్ సిన్హా ఆవిష్కరించారు. బార్క్ పరిశోధకులు రూపకల్పన చేయగా,ఈసీఐఎల్ సంస్థ ‘నిర్భయ’ పరికరాన్ని తయారు చేసిందని ఈసీఐఎల్ పీఆర్వో లక్ష్మీనారాయణ శనివారం ఇక్కడ తెలిపారు. సెల్‌ఫోన్‌కు అనుసంధానమయ్యే ఈ పరికరం త్వరలో మార్కెట్లోకి వస్తుందని ఆయన చెప్పారు.