విశ్వ రహస్యాల అన్వేషణకు ‘భేష్’! | To explore the mysteries of the universe, 'concluded'! | Sakshi
Sakshi News home page

విశ్వ రహస్యాల అన్వేషణకు ‘భేష్’!

Published Wed, Jul 2 2014 10:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

విశ్వ రహస్యాల అన్వేషణకు ‘భేష్’! - Sakshi

విశ్వ రహస్యాల అన్వేషణకు ‘భేష్’!

చుక్కల లోకం గుట్టు విప్పాలి. గామా కిరణాల లోగుట్టు పసిగట్టాలి. ఖగోళ చరిత్రను మలుపు తిప్పాలి. ఈసీఐఎల్ మేస్ టెలిస్కోపు అదే చేయబోతోంది
 
అందుకే లడఖ్‌కు బయలుదేరింది...

విశ్వాంతరాళాల నుంచి దూసుకువచ్చి లిప్తపాటులో మాయమయ్యే కాంతిపుంజాలను ఒడిసిపడితేనే అల్లంత దూరంలోని చుక్కల లోకం గుట్టు తెలుస్తుంది. నక్షత్రాలు, వాటి పేలుళ్ల వెనక ఉన్న మర్మం అంతు పడుతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూనే రూపుమార్చుకునే గామా కిరణాల ఉనికిని గుర్తిస్తేనే ఖగోళం సంగతులు అర్థమవుతాయి. అందుకే.. గామా కిరణాల గుట్టు విప్పేందుకు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) శాస్త్రవేత్తలు మేస్ టెలిస్కోపును తయారు చేశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోపు, ఎత్తై ప్రదేశంలో ఏర్పాటుచేసే అతిపెద్ద టెలిస్కోపు అయిన మేస్ ఇంతకూ ఏం చేస్తుంది? దీని కథాకమామిషు ఏమిటి?
 
గామా కిరణాలపై నిఘా నేత్రం...

విశ్వం పుట్టు, పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలంటే రోదసిలో సుదూర తీరాల నుంచి దూసుకువచ్చే శక్తిమంతమైన గామా కిరణాలపై అధ్యయనం ఓ మంచి అవకాశం. మిలమిల మెరిసే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రపేలుడు అవశేషాలు, గెలాక్సీ కేంద్రాలు, మొదలైన వాటి నుంచి వెలువడే  గామా కిరణాలపై అధ్యయనం వల్ల వాటి గురించి తెలుసుకునేందుకు వీలవుతుంది. తద్వారా ఖగోళ భౌతికశాస్త్రం, ప్రాథమిక భౌతికశాస్త్రం, గామా కిరణాల ఆవిర్భావం, వాటి వేగం వెనక ఉన్న ప్రక్రియ గురించి మరింత బాగా అవగాహన చేసుకోవచ్చు. అయితే ఈ గామా కిరణాలు అత్యధిక శక్తితో దూసుకొస్తుంటాయి. చాలా శక్తితో కూడిన ఈ ఫొటాన్లను భూమిపై నుంచి నేరుగా గుర్తించడం సాధ్యం కాదు. మామూలుగా అయితే ఇవి నేరుగా భూమికి చేరితే జీవకోటి ఉనికికే ప్రమాదకరం. కానీ ఈ కిరణాలు భూవాతావరణంలోకి ప్రవేశించగానే విద్యుదావేశ కణాలను వెదజల్లుతాయి. ఫలితంగా నీలికాంతితో కూడిన రేడియేషన్ ఫ్లాష్ మాదిరిగా మెరిసి మాయమైపోతుంది. ఇదెంత వేగంగా జరుగుతుందంటే ఒక సెకనులో కొన్ని వందల కోట్ల వంతు సమయంలోనే. దీనినే సెరెంకోవ్ కాంతి లేదా సెరెంకోవ్ రేడియేషన్ అంటారు. ఈ కాంతిని గుర్తించి ఫొటోలు తీయడంతోపాటు ఇతర సమాచారాన్ని అందించడమే మేస్ టెలిస్కోపు పని అన్నమాట.
 
పనితీరు ఇలా...

మేస్ టెలిస్కోపులో కాంతిని పసిగట్టేందుకు 356 అద్దాల పలకలు ఉంటాయి. టెలిస్కోపు కేంద్రభాగంలో ప్రతిఫలించే సెరెంకోవ్ ప్రక్రియలు, వాటి లక్షణాలను పసిగట్టేందుకు 1200 కిలోల బరువైన హైరెసోల్యూషన్ ఇమేజింగ్ కెమెరా ఉంటుంది. ఇది సెరెంకోవ్ కాంతిని ప్రతిఫలింపచేసే లైట్ కలెక్టర్లకు అభిముఖంగా ఉంటుంది. వీటన్నిటి సమన్వయంతో  గామా రే ఫొటాన్‌ను శక్తిని, చిత్రాన్ని ఈ టెలిస్కోపు రికార్డు చేస్తుంది. సమాచారాన్ని గంటకు 50 జీబీల వేగంతో ఆప్టికల్ ఫైబర్ ద్వారా కంట్రోల్‌రూంలోని కంప్యూటర్ సిస్టమ్‌కు చేరవేస్తుంది. ఆరు చక్రాలతో ఉండే మేస్ ఆకాశంలో ఏ దిక్కున ఉన్న ఖగోళ వస్తువునైనా పరిశీలించేందుకు అనుగుణంగా తిరగగలదు.  ఇప్పటిదాకా అమెరికా, యూరోప్‌వంటి దేశాలు, సమాఖ్యలే ఇంత భారీ టెలిస్కోపులను నిర్మించాయి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (ముంబై) సహకారంతో దీనిని ఈసీఐఎల్ స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించింది. సౌర విద్యుత్‌తో పనిచేసే మేస్ ప్రారంభమైతే.. గామా రే అధ్యయనంలో భారత్ కీలక స్థానంలో నిలవనుంది.
 
ప్రత్యేకతలు...
ప్రపంచంలో ఎక్కడినుంచైనా దీనిని రిమోట్‌తో నియంత్రించవచ్చు.
 
గంటకు 30 కి.మీ. వేగంతో గాలులు వీచినా స్థిరంగా నిలబడగలదు.
 
పార్కింగ్ పొజిషన్‌లో ఉంచితే గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు.

నిర్దేశిత ఖగోళ వస్తువును నిరంతరాయంగా, కచ్చితత్వంతో అనుసరిస్తుంది. దిశను, ఎత్తును కూడా ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది.
 
 ‘మేస్’డేటా!
 పూర్తిపేరు: మేజర్ అట్మాస్ఫెరిక్ సెరెంకోవ్ ఎక్స్‌పెరిమెంట్ (మేస్)  
 గుర్తింపు: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోపు ఎత్తై ప్రాంతంలో ఏర్పాటయ్యే అతిపెద్ద టెలిస్కోపు
 ఎత్తు: సముద్రమట్టానికి 4,500 మీటర్లు
 వ్యాసం: 21 మీటర్లు
 బరువు: 180 టన్నులు
 ఖర్చు: రూ.45 కోట్లు
 స్థలం: హన్లే, లడఖ్
 ప్రారంభం: 2016, జనవరిలో
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement