అక్షరాలను చాలా అందంగా రాసే రాజు? | which king write neatly the letters ? | Sakshi
Sakshi News home page

అక్షరాలను చాలా అందంగా రాసే రాజు?

Published Mon, Nov 3 2014 10:41 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Bommana boina Srinivas - Sakshi

Bommana boina Srinivas

హర్షవర్ధనుడు (క్రీ.శ. 606 - 647)
 గుప్తుల పతనానంతరం ఉత్తర భారతదేశంలో చిన్నచిన్న స్వతంత్ర రాజ్యాలేర్పడ్డాయి. వాటిలో ‘స్థానేశ్వరం’ ఒకటి. ఈ రాజ్యాన్ని పుష్యభూతి వంశం పాలించేది. వీరిలో ప్రసిద్ధి చెందినవాడు హర్షవర్ధనుడు. ఇతడినే హర్షుడు అంటారు. ఇతడు స్థానేశ్వరం, కనూజ్‌లను ఏకం చేసి పాలించాడు. తర్వాత రాజధానిని స్థానేశ్వరం నుంచి కనూజ్‌కు మార్చాడు. బాణభట్టుడు రాసిన ‘హర్షచరితం’ అనే కావ్యం హర్షుడి గురించి తెలియజేస్తోంది.

ఇతడికి‘శీలాదిత్య’, ‘సకలోత్తరాపథేశ్వరుడు’ అనే బిరుదులు ఉన్నాయి. ఇతడు వేయించిన బన్సీఖేరో, మధుబన్ శాసనాలతోపాటు చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ రచనలు  కూడా ఇతడి పాలన గురించి వివరిస్తున్నాయి. హర్షుడు దక్షిణ భారతదేశాన్నంతటినీ జయించాలనుకున్నాడు. కానీ బాదామి చాళుక్య రాజైన రెండో పులకేశి చేతిలో ఓడిపోవడం వల్ల అతడి కోరిక నెరవేరలేదు. హర్షుడి రాజ్యం నర్మదానది వరకు విస్తరించి ఉండేది. పులకేశి వేయించిన ఐహోలు శాసనం ద్వారా ఈ విషయం తెలుస్తోంది.

 హర్షుడి కాలంలో పంటలో 1/6వ భాగాన్ని శిస్తుగా వసూలు చేసేవారు. దీన్ని ‘ఉద్రుంగ’ పన్ను అనేవారు. దీంతోపాటు అమ్మకం పన్ను ‘తుల్యమేయ’ విధించేవారు. పన్నులు వసూలు చేసే అధికారులను ‘ధ్రువాధీకరణ’, ‘గౌల్మిక’ అని పిలిచేవారు. గుప్తులు స్థాపించిన నలందా విశ్వవిద్యాలయ అభివృద్ధికి హర్షుడు 100 గ్రామాలను దానం చేసినట్టుగా హ్యూయాన్‌త్సాంగ్ రచించిన సీ-యూ-కీ ద్వారా తెలుస్తోంది. ఇతడు సౌరాష్ట్రలో మౌఖారి వంశస్థులు నెలకొల్పిన వల్లభి విశ్వవిద్యాలయ అభివృద్ధికి కూడా కృషి చేశాడు. చరిత్రకారులు గుప్త యుగం, రాజపుత్ర యుగానికి హర్షుడిని వారధిగా పేర్కొంటారు.

 హర్షుని కాలంలో రాజభాష సంస్కృతం. ఇతడు స్వయంగా కవి. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే సంస్కృత నాటకాలను రాశాడు. ఇతడి ఆస్థానకవి బాణభట్టుడు. బాణుడు హర్ష చరిత్రతోపాటు ‘కాదంబరి’ అనే కావ్యాన్ని రాశాడు. ఇవి సంస్కృత సాహిత్యంలో ‘మణిరత్నాలు’గా వెలుగొందాయి. హర్షుడి ఆస్థానంలో మయూరుడు (సూర్య శతకం), మాతంగుడు, దివాకరుడు అనే కవులు కూడా ఉండేవారు. సుభాషిత శతకాన్ని రాసిన భర్తృహరి కూడా హర్షుడి కాలానికి చెందినవాడే. హర్షుడి ‘నాగానందం’ ఇత్సింగ్ (చైనా యాత్రికుడు) ద్వారా చైనా, జపాన్‌కు  విస్తరించింది.

 హ్యూయాన్‌త్సాంగ్: క్రీ.శ. 630లో హర్షుని పాలనాకాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. ఇతడు ప్రసిద్ధ చైనా యాత్రికుడు. బౌద్ధ భిక్షువు అయిన హ్యూయాన్‌త్సాంగ్ బౌద్ధ విజ్ఞానాన్ని పొందడానికి ఇండియాకు వచ్చాడు. భారతదేశంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను పరిశీలించి రచనలు చేశాడు. భారతదేశ ప్రాచీన చరిత్ర తెలుసుకోవడానికి ఇవి ప్రస్తుతం ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి. హర్షునిపై ఇతడికి ప్రత్యేక అభిమానం ఉన్నట్లుగా ‘సీ-యూ-కీ’ ద్వారా తెలుస్తోంది. హర్షుడి గురించి తెలుసుకోవడానికి ఇదే ముఖ్య ఆధారం.

ఈ గ్రంథంలో హర్షుడిని ‘పంచరాజ్యాలకు’ ప్రభువుగా పేర్కొన్నాడు. ‘హ్యూలీ’ రాసిన హ్యూయాన్‌త్సాంగ్ జీవిత చరిత్ర హ్యూయాన్‌త్సాంగ్, హర్షుడి గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. హ్యూయాన్‌త్సాంగ్ క్రీ.శ. 644లో స్వదేశానికి తిరిగి వెళ్లాడు.

 హర్షుడు బౌద్ధమతం స్వీకరించడానికి హ్యూయాన్‌త్సాంగ్‌తో దగ్గరి సంబంధాలే కారణం. ఇతడు కనూజ్‌లో హ్యూయాన్‌త్సాంగ్ అధ్యక్షతన అన్ని మతాలకు చెందినవారితో గొప్ప పరిషత్‌ను నిర్వహించాడు. ప్రతి ఐదేళ్లకోసారి ప్రయాగ వద్ద ‘సర్వస్వధాన’ కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీన్నే ‘మహామోక్ష పరిషత్’ అంటారు. ఈ కార్యక్రమాల ద్వారా హర్షుడు తన ఆస్తినంతా ప్రజలకు దానం చేసేవాడు. హ్యూయాన్‌త్సాంగ్ 6వ మహామోక్ష పరిషత్‌కు హాజరయ్యాడు.

 రాజపుత్రులు
 హర్షుడి పాలనానంతరం ఉత్తర భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. వీటిని పాలించిన రాజులను రాజపుత్ర రాజులు అంటారు. అంతర్గత వైషమ్యాలతో ఐకమత్యం లోపించడం వల్ల రాజపుత్రులు బలహీనులయ్యారు. దీన్ని అదనుగా తీసుకొని విదేశీయులు దండయాత్రలు చేశారు. రాజపుత్ర యుగం క్రీ.శ. 650 నుంచి 1200 వరకు ఉనికిలో ఉంది. కానీ ఈ లోపే క్రీ.శ. 712లో అరబ్బులు ‘సింధు దండయాత్ర’ జరిపి ఇండియాలో మహ్మదీయుల పాలనకు నాంది పలికారు.

 అరబ్బుల దండయాత్ర
 ఉత్తరభారతదేశంలోని చిన్న రాజ్యాల్లో కనూజ్, మాళ్వా, కాశ్మీర్, సింధు, బెంగాల్, నేపాల్, అస్సాం ముఖ్యమైనవి. సింధు రాజ్యాన్ని దాహిర్ అనే హిందూరాజు పాలించేవాడు. దాహిర్ అసమర్థ పాలనతో విసుగు చెందిన ప్రజలు అతడిని ద్వేషించారు. క్రీ.శ. 708లో శ్రీలంక నుంచి ఇరాన్ పాలకుడైన ఆల్ హజాజ్‌కు కానుకలతో వెళుతున్న ఓడలను సింధుదేశ సముద్రపు దొంగలు దేబాల్ ఓడరేవు సమీపంలో దోచుకున్నారు.

ఇందుకు ఆగ్రహించిన ఆల్‌హజాజ్ దాహిర్‌ను నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. దాహిర్ నిరాకరించడంతో ఆల్‌హజాజ్ అరబ్బు సైన్యాన్ని సింధుపైకి రెండుసార్లు పంపించాడు. దాహిర్ ఈ దాడులను తిప్పికొట్టాడు. క్రీ.శ. 712లో మహ్మద్‌బిన్ కాశిం నాయకత్వంలో అరబ్బు సైన్యం దేబాల్ ఓడ రేవును ఆక్రమించుకొని దోచుకుంది. రేవర్ (రోర్) వద్ద జరిగిన యుద్ధంలో కాశిం చేతిలో దాహిర్ మరణించాడు.

సింధు రాజ్య రాజధాని అయిన అరోర్ కోటను కూడా కాశిం ధ్వంసం చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. క్రీ.శ.713లో అపార ధనరాశులకు నిలయమైన ముల్తాన్ నగరాన్ని అరబ్బులు దోచుకొని నాశనం చేశారు. సింధు రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించిన తర్వాత కాశిం కనూజ్, కాశ్మీర్‌లను ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉండగా క్రీ.శ. 716లో ఖలీఫా (ముస్లింల మత పెద్ద) సింధు నుంచి కాశింను పిలిపించి హత్య చేయించాడు.  ఇస్లాం విజయ పతాకాన్ని మొదటగా భారత భూభాగంపై ప్రతిష్టించిన ఘనత మహ్మద్‌బిన్ కాశింకు దక్కుతుంది. దాహిర్ అంతర్గత విరోధులు, చిన్న చిన్న రాజ్యాల రాజులు సింధులో కాశిం విజయయాత్రలకు సహాయపడ్డారు.

 అరబ్బుల వల్ల భారతదేశ మత, సాంస్కృతిక, విద్యా, వైజ్ఞానిక, రంగాల ప్రాముఖ్యత  ఇతర ముస్లిం రాజ్యాలు, యూరప్ దేశాలకు తెలిసింది. హిందూ, ముస్లిం వర్గాలు మత పరంగా, సాంస్కృతిక పరంగా పరస్పరం ప్రభావితమయ్యాయి.  బ్రహ్మగుప్తుడి బ్రహ్మసిద్ధాంతం, ఆయుర్వేద శాస్త్రమైన చరక సంహిత, నీతిశాస్త్రమైన పంచతంత్రం అరబ్బీ భాషలోకి అనువదితమయ్యాయి. చాలామంది హిందూ రాజులు, ప్రముఖులు, ప్రజలు ఇస్లాంను స్వీకరించి ఇండో యూరో ముస్లిం మతవ్యాప్తికి దోహదం చేశారు. హిందూ వేదాంతం, కర్మసిద్ధాంతం, దర్శనాలు ఇస్లాంపై ప్రభావం చూపాయి. ఇవి మహమ్మదీయుల్లో సూఫీ సిద్ధాంతం పుట్టడానికి కారణమయ్యాయి.

 మాదిరి ప్రశ్నలు
 1.    అరబ్బులు ముల్తాన్‌ను ఏమని కొనియాడారు?
     ఎ) వజ్రాల నగరం
     బి) బంగారు నగరం
     సి) ధనరాశుల నగరం    
     డి) అందమైన నగరం
 2.    సింధుపై అరబ్బుల దండయాత్రకు ప్రధాన కారణం?
     ఎ) ఇస్లాం మత వ్యాప్తి
     బి) సింధును దోచుకోవడం
     సి) అరబ్బుల ఓడలను సింధుప్రాంత దొంగలు దోచుకోవడం
     డి) దాహిర్‌పై ఖలీఫా శత్రుత్వం
 3.    మహ్మద్ బిన్ కాశిం దండయాత్ర చేసినప్పుడు సింధు చక్రవర్తి ఎవరు?
     ఎ) ఆల్ హజాజ్    బి) దాహిర్
     సి) జయసింహుడు    డి) జయచంద్రుడు
 4.    సూఫీ సిద్ధాంతాన్ని ఆచరించినవారెవరు?
     ఎ)    ఇస్లాంను ఆచరించే హిందూమత విశ్వాసులు
     బి)    హిందూమతంలోని ఇస్లాం విశ్వాసులు
     సి)    హిందూ మతంలో మంచి విశ్వాసాలను ఇస్లాంలో ప్రవేశ పెట్టాలనుకునే ముస్లింలు
     డి)    ఇస్లాంలోని ఆదర్శనీయమైన పద్ధ తులను హిందూమతంలో పాటించా లనుకున్న హిందువులు
 5.    భారతదేశంలో మొదటిసారిగా ముస్లిం పాలన నెలకొల్పినవారు?
     ఎ) టర్కీలు    బి) అఫ్గాన్‌లు
     సి) ఉజ్బెక్‌లు    డి) అరబ్బులు
 6.    యాత్రికుల యువరాజుగా పేరొందిన విదేశీ యాత్రికుడు?
     ఎ) పాహియాన్    బి) ఇత్సింగ్    
     సి) మార్కోపోలో
     డి) హ్యూయాన్‌త్సాంగ్        
 7.    కిందివాటిలో సరికాని జత ఏది?
     ఎ) హర్షుడు- నాగానందం        బి) బాణుడు- కాదంబరి
     సి) మయూరుడు- ఆదిపురాణం        
     డి) భర్తృహరి- సుభాషిత శతకం
 8.    తుల్యమేయ అంటే?
     ఎ) పంటపై విధించే పన్ను    
     బి) పుల్లరి పన్ను
     సి) వివాహ పన్ను
     డి) అమ్మకం పన్ను
 9.    అక్షరాలను చాలా అందంగా రాసే నైపుణ్యం ఉన్న రాజు?
     ఎ) హర్షుడు     
     బి) అశోకుడు
     సి) చంద్రగుప్త విక్రమాదిత్యుడు        డి) శివాజీ
 10.    హర్షుడికాలంలో ప్రఖ్యాతి చెందిన విశ్వ విద్యాలయం ఏది?
     ఎ) తక్షశిల    బి) విక్రమశిల
     సి) వల్లభి    డి) నలందా
 11.    అరబ్బులు సింధుపై దండయాత్ర జరిపిన సంవత్సరం?
     ఎ) క్రీ.శ. 726    బి) క్రీ.శ. 712
     సి) క్రీ.శ. 722    డి) క్రీ.శ 728
 12.    హర్షుడు రచించిన నాటకం?
     ఎ) హర్షచరిత్ర    బి) పంచతంత్రం
     సి) రత్నావళి    డి) పంచసిద్ధాంతం
 13.    కిందివాటిలో హ్యూయాన్‌త్సాంగ్ రచన ఏది?
     ఎ) షా-కివో-కీ    బి) సీ-యూ-కీ
     సి) క్వీ-షో-కువై    డి) హర్షచరిత్ర
 14.    గౌల్మిక అంటే ఏమిటి?
     ఎ) పన్ను వసూలు చేసే అధికారి        బి) పన్ను నిర్ణయ అధికారి
     సి) మార్కెటింగ్ అధికారి
     డి) గణాంకాధికారి
 15.    హర్షుడు మహామోక్షపరిషత్‌లను ఎందుకు నిర్వహించేవాడు?
     ఎ)    కవులను, సాహిత్యకారులను సన్మా నించడానికి    
     బి)    తాను రాసిన గ్రంథాలను ప్రజలకు పరిచయం చేయడానికి
     సి)    తన యుద్ధ విజయాలను గ్రంథస్థం చేయమని కవులను ప్రోత్సహించ డానికి
     డి) ఏదీకాదు
 
 సమాధానాలు
 1) బి;     2) సి;     3) బి;     4) సి;  5) డి;     6) డి;      7) సి;      8) డి;  9) ఎ;     10) డి;     11) బి;     12) సి;
 13) బి;     14) ఎ;     15) డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement