కుతుబ్ షాహి వంశానికి చెందిన అయిదో పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించిన చార్మినార్ నగరం నడిబొడ్డులో ఒక వారసత్వ కట్టడంగా ఠీవీగా వెలిగిపోతోంది. దీని నిర్మాణమే చాలా ప్రత్యేకం. నాలుగు మీనార్‌లపై నిర్మితమై, చుట్టూ బాల్కనీలతో చూడగానే ఆకట్టుకునే డిజైన్‌తో అందరి హృదయాలను దోచుకుంటోంది. ఎన్నో పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుకొని ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉంటే చార్మినార్ మాత్రం అంత పటిష్టంగా ఎలా ఉంది ? ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఇన్నేళ్లు ఎలా పదిలంగా ఉంది ? ఈ ప్రశ్నలు ఎవరికైనా సహజంగా వస్తాయి.
తమిళనాడుకి చెందిన వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) పరిశోధకులకూ ఈ ప్రశ్నలు విపరీతమైన కుతూహలాన్ని పెంచాయి. చార్మినార్ నిర్మాణంలో రహస్యాలను ఛేదించడానికి వీఐటీ పరిశోధకులు పురావస్తు శాఖ సహకారంతో కొన్ని పరిశోధనలు చేశారు. చార్మినార్‌కు పైపూతగా వినియోగించిన సున్నపురాయి వల్లే ఆ కట్టడం సుదీర్ఘకాలం పటిష్టంగా ఉందని తేల్చారు. ఆ సున్నపురాయిని ఏ నిష్పత్తిలో వాడారు ? దానికి ఏయే పదార్థాలు కలిపారు అన్న దానిపై కూడా వీఐటీ శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేశారు.
సున్నపురాయిని ఎలా వినియోగించారంటే ?
చార్మినార్ నిర్మాణంలో సున్నపురాయిని చాలా ప్రత్యేకమైన పద్ధతిలో వాడారని వీఐటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సున్నపురాయితో పాటు, అందులో ఇసుక, కంకర, తగినన్ని నీళ్లతో కలిపారు. ప్రధానంగా మొక్కల నుంచి సేకరించిన పదార్థాన్ని నీళ్లతో కలిపి పులియబెట్టి, దాంట్లో సున్నపు రాయిని కలిపారు. ఇలా చేయడం వల్ల ఎన్ని విపత్తులు ఎదురైనా కట్టడం దృఢంగా ఉందని వారి పరిశోధనలో తేలింది. వాతావరణంలోని కార్బన్‌డైయాక్సైడ్ ప్రభావంతో సున్నపురాయి కాల్షియం కార్బొనేట్‌గా మారుతుంది. దీన్నే కార్బొనేషన్ అంటారు. సముద్రతీరాల్లో లభించే ఆల్చిప్పలు, నత్తగుల్లల పెంకులు కూడా కాల్షియం కార్బొనేట్‌తోనే తయారవుతాయి.
మొక్కల నుంచి సేకరించిన పదార్థాలను పులియబెట్టి, దానికి సున్నపురాయిని కలపడం వల్ల కార్బొనేషన్ చాలా నెమ్మదిగా జరుగుతూ వచ్చింది. దీని వల్ల కట్టడం ఎక్కువ కాలం పటిష్టంగా ఉందని వారి పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు కరక్కాయ వంటి మొక్కల నుంచి సేకరించిన పదార్థాల్లో ఉన్న కార్బొహైడ్రేట్లు సున్నపురాయితో కలవడం వల్ల వాటి బంధం మరింత దృఢంగా మారిందని వీఐటీ పరిశోధనలో పాల్గొన్న వీఐటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. తిరుమాలిని వెల్లడించారు. భారత్‌లో కొన్ని పురాతన కట్టడాల నిర్మాణాల్లో ఇలా మొక్కల నుంచి సేకరించిన కార్పొహైడ్రేట్లు, లేదంటే బెల్లం వాడేవారని ఆమె చెబుతున్నారు.
అంతేకాదు దక్కన్ పీఠభూమిలో లభించే సున్నపురాళ్లలో సహజసిద్ధంగా ఉండే మాగ్నేషియం ఆక్సైడ్ కూడా చార్మినార్ చెక్కు చెదరకుండా ఉండడానికి కారణమేనని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మొక్కల నుంచి సేకరించిన కార్పొహైడ్రేట్లు, సున్నపురాయి ఏ నిష్పత్తిలో వాడాలో కొన్ని వందల ఏళ్ల క్రితమే బిల్డర్లు గ్రహించారని ప్రొఫెసర్ తిరుమాలిని వెల్లడించారు. సున్నపురాయి, ఇసుక 1:3 నిష్పత్తిలో వాడితే సున్నపురాయి మిశ్రమంలో ఖాళీలు చాలా తక్కువగా, చిన్నగా ఉంటాయని... ఫలితంగా నీరు చొరబడేందుకు వీల్లేకుండా పోతుందని అంచనా. చార్మినార్ నిర్మాణంలో అచ్చం ఇదే మోతాదు మిశ్రమం వాడినట్లు వీఐటీ అధ్యయనంలో వెల్లడైందని ఆమె వివరించారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment