అగ్రగామిగా హైదరాబాద్
ఐటీ మంత్రి కేటీఆర్
బంజారాహిల్స్: హైదరాబాద్ సంస్కృతిని, చరిత్రను కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు.
నగరం చుట్టూ సుమారు 200 వరకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయన్నారు. ఏటా వేలాది మంది ఇంజినీర్లు తయారవుతున్నారన్నారు. ఐటీ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రముఖ ఐటీ సంస్థలతో చర్చిస్తున్నామన్నారు.
వారి సహకారంతో ప్రతి సంస్థ వెయ్యిమంది విద్యార్థులను దత్తత తీసుకుని వారికి శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను మరింత మెరుగు పరిచేందుకు రానున్న ఆరు నెలల్లో నగరంలో టెక్నాలజీ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు.
నగరాన్ని వైఫై సిటీగా మార్చడం ద్వారా కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం వీసీ ఎస్. సత్యనారాయణ, సుల్తాన్ ఉలూం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఖాన్ లతీఫ్ మహ్మద్ ఖాన్, గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్, ముఫకంజా కళాశాల అధ్యక్షుడు ఆసిఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.