బాబు మూడు కాళ్ల థియరీ!
రాష్ట్రంలో రెండు కళ్ల సిద్ధాంతం.. కేంద్రంలో మూడు కాళ్ల థియరీ...!! టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలి కాలంలో కొత్త థియరీతో ముందుకు వెళుతున్నారట. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాత చంద్రబాబు రాష్ట్రంలో రెండు కళ్ల సిద్ధాంతమని చెప్పుకున్న విషయం తెలుసు. మరి కొత్తగా ఈ మూడు కాళ్ల థియరీ ఏమిటన్న అంశంపై టీడీపీలో రసవత్తరమైన చర్చ సాగుతోంది.
ఎన్టీఆర్‌ను గద్దె దింపి సీఎం అయినప్పటి నుంచి చంద్రబాబు ఎక్కడికెళ్లినా రెండు వేళ్లను చూపుతూ అభివాదం చేశారు. 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాత రెండు కళ్ల సిద్ధాంతం మొదలుపెట్టారట. ఏ సిద్ధాంతం చెప్పినా... కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ అసలు సిద్ధాంతానికే చంద్రబాబు తిలోదకాలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించే పనిలో పడిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిందట. ఆ కారణంగానే ఇప్పుడు మూడు కాళ్ల థియరీ తెరమీదకొచ్చిందని టీడీపీలో గుసగుసలాడుతున్నారు.
ఇంతకు ఈ థియరీ ఏమిటని ఆరా తీస్తే...! రాష్ట్రంలో ఎలాగూ గెలవలేమని తెలిసి కేంద్రంలో అధికార హోదాపై కన్నేసిన చంద్రబాబు అందుకు లోతుగానే అంచనాలు వేసుకుంటున్నారట. సాధారణ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కారే తిరిగి ఏర్పడుతుందా? లేదా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఉంటుందా? ఇవేవీ కాకుండా మూడో ప్రత్యామ్నాయం అధికారంలోకి వస్తుందా? ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉన్నందున... తనకొచ్చే ఒకటిరెండు సీట్లతోనైనా ఎవరు అధికారంలోకి వచ్చినా అందులో చేరడం, అనుకున్న హోదా దక్కించుకోవడం కోసం... ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఆ మూడు ఫ్రంట్ల నేతలతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారట. అదే మూడు కాళ్ల థియరీ!!!