స్వరాజ్య మైదానం ప్రైవేట్‌కు | Jakkampudi will be a model for Amaravati in Cabinet Meeting | Sakshi
Sakshi News home page

స్వరాజ్య మైదానం ప్రైవేట్‌కు

Published Fri, Dec 16 2016 1:29 AM | Last Updated on Fri, May 25 2018 7:10 PM

స్వరాజ్య మైదానం ప్రైవేట్‌కు - Sakshi

స్వరాజ్య మైదానం ప్రైవేట్‌కు

పీపీపీ విధానంలో సిటీ స్క్వేర్‌ ప్రాజెక్టుకు అనుమతి
స్మార్ట్‌ సిటీలుగా ఆరు నగరాలు
జక్కంపూడిలో ఎకనామిక్‌ సిటీ
విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు


సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంలో సిటీ స్క్వేర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందులో ఉన్న రైతు బజార్, ప్రభుత్వ కార్యాలయాలు, క్వార్టర్లను తొలగించి మిగిలిన గ్రౌండ్‌తో కలిపి పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మల్టీ పర్పస్‌ రిక్రియేషన్‌ అండ్‌ కమర్షియల్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే చైనాకు చెందిన జీఐఐసీ కంపెనీతో ఈ సిటీ స్క్వేర్‌ డిజైన్‌ తయారు చేయించిన ప్రభుత్వం దాన్ని ఆమోదించనుంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ (సవివర నివేదిక)ను ఆమోదించే బాధ్యతను పట్టణీకరణపై నియమించిన కేబినెట్‌ సబ్‌ కమిటీకి అప్పగించింది. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీపీపీ విధానంలో వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతోపాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, నారాయణ మీడియాకు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి...

విజయవాడ స్వరాజ్య మైదానం, దానికి ఆనుకుని ఉన్న 27.5 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ విధానంలో విజయవాడ సిటీ స్క్వేర్‌ ఏర్పాటుకు అనుమతి. అందులో షాపింగ్‌ కాంప్లెక్స్, థీమ్‌ పార్క్, ఎగ్జిబిషన్‌ కాంప్లెక్స్, మినీ ఇండోర్‌ స్టేడియం, పబ్లిక్‌ ప్లేస్‌ తదితరాలు ఏర్పాటు.  

విశాఖపట్నంలో 11 ఎకరాల్లో పీపీపీ విధానంలో అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఆమోదం.

విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో మౌలిక  వసతుల ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు గుంటూరు–విజయవాడ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ఎస్‌పీవీ (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) ఏర్పాటుకు ఆమోదం.

కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన మూడు స్మార్ట్‌ సిటీలు కాకుండా కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలు నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం.

విజయవాడలోని జక్కంపూడిలో 256 ఎకరాల్లో పీపీపీ విధానంలో ఎకానమిక్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటుకు అనుమతి.

మున్సిపల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల సర్వీసు నిబంధలను క్రమబద్ధీకరించేందుకు ఆమోదం.

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 35 శాతం వేతనాల పెంపునకు ఆమోదం. ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా మరో పది శాతం ప్రోత్సాహకం అదనంగా చెల్లింపు. భారీగా భూకేటాయింపులు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం సర్వే నెంబర్‌ 1604లోని 9.74 ఎకరాలను ఎకరం రూ.8 లక్షల చొప్పున ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయింపు.

అగ్రిగోల్డ్‌కు సంబంధించి విజయవాడలో రూ.90 కోట్ల విలువైన 13 ఆస్తులు, కృష్ణాజిల్లా కీసరలో రూ.200 కోట్ల విలువైన 341 ఎకరాల వేలానికి 26వ తేదీ వరకూ బిడ్ల స్వీకరణ. 27వ తేదీన బిడ్లు తెరవాలని నిర్ణయం.   

బ్యాంకులపై నెట్టేయండి...
పెద్ద నోట్ల రద్దు అంశం మంత్రివర్గ , తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఓ కుదుపు కుదిపింది. ఇప్పటివరకూ పెద్ద నోట్ల రద్దుకు కర్త, కర్మ, క్రియ తానేనని చెప్తూ వచ్చిన సీఎం చంద్రబాబు ఇక నుంచి ఆ అంశంపై సాధ్యమైనంత తక్కువగా మాట్లాడటంతో పాటు ప్రస్తావించకూడదని నిర్ణయించారు. గురువారం  బాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం ఉండవల్లిలోని నివాసంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా  బాబు నోట్ల రద్దు పరిణామాల తప్పిదాన్ని బ్యాంకులపై నెట్టేయాలని సూచించారు.

కేబినెట్‌ భేటీకి సెల్‌ఫోన్లు తీసుకురావొద్దు  సీఎంవో కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనే మంత్రులు తమ సెల్‌ఫోన్లను బయటే డిపాజిట్‌ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ  చేసింది. ఈ అంశంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement